పోస్టాఫీసుల ద్వారా పాస్‌పోర్టులు
పైలెట్ ప్రాజెక్ట్ కింద మైసూర్ ఎంపిక
విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి ధ్యానేశ్వర్ మూలే వెల్లడి
తిరుపతి: కొత్త పాస్‌పోర్టులను ఇకపై పోస్టాఫీసుల ద్వారా జారీ చేయనున్నట్లు విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి ధ్యానేశ్వర్ మూలే వెల్ల డించారు. ఇందుకోసం మైసూరులోని పోస్టాఫీసు లను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామన్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే దేశమంతటా ఈ విధా నాన్ని అమలు చేస్తామన్నారు. రీజనల్ పాస్‌పోర్టు అధికారి అశ్విని సత్తారుతో కలసి శుక్రవారం సాయంత్రం «ఆయన తిరుపతి పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని సందర్శించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38 పాస్‌పోర్టు కార్యాలయాలు, 89 సేవా కేంద్రాలు ఉన్నాయని, వీటి ద్వారా రోజుకు దాదాపు 50 వేల చొప్పున ఏడాదికి సుమారు 1.30 కోట్ల పాస్‌పోర్టులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. దళారుల బెడదను తగ్గించి దరఖాస్తుదారుని ఇంటి వద్దకే పాస్‌పోర్టు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
త్వరలో స్టూడెంట్ కనెక్ట్ పేరిట సరికొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నామనీ, దీని ద్వారా విద్య, ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి పాస్‌పోర్టు, వీసాలపై అవగాహన కలిపిస్తామన్నారు. ప్రస్తుతం పాస్‌పోర్టు జారీని సులభతరం చేసినట్లు వెల్లడించారు. త్వరలో నెల్లూరు కేంద్రంగా పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడామన్నారు. భారతదేశం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు అధీకృత ఏజెంట్ల ద్వారానే వెళ్లాలనీ, దళారుల ద్వారా వెళితే అక్కడ ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. విజయవాడలో శనివారం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమైనప్పుడు ఈ విషయంపై మాట్లాడను న్నట్లు తెలిపారు. తిరుపతిలో త్వరలోనే జర్నలిస్టుల కోసం ప్రత్యేక పాస్‌పోర్ట్ మేళాను నిర్వహించ నున్నట్లు ధ్యానేశ్వర్ మూలే వెల్లడించారు.