ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు
ఒంగోలు: జిల్లాలో పదో తరగతి ప్రధాన పరీక్ష లన్నీ మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 39,601 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 35,304 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 4297 మంది ప్రైవేట్ విద్యార్థులు. మొత్తం 195 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు హాజరయ్యారు. కాపీయింగ్ నిరోధించేందుకు పది ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 14 సిట్టింగ్ స్క్వాడ్లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. 11 రోజుల పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు మాత్రమే కాపీయింగ్‌కు పాల్పడుతూ డిబార్ అయ్యారు. పరీక్షల విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు ఇన్విజిలేటర్లను, ముగ్గురు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు డిపార్టుమెంట్ అధికారులను పరీక్షల విధుల నుంచి తొలగించారు. మొత్తం 25 మందికి సంజాయిషీ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎ.రాజేశ్వరరావు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన వారందరికీ డీఈఓ కృతజ్ఞతలు తెలిపారు. పరీక్షల నిర్వహణ పట్ల రాష్ట్ర పరిశీలకులు ఎం.వనజాక్షి సంతృప్తి వ్యక్తం చేశారు.
మూల్యాంకనానికి ఏర్పాట్లు: స్థానిక డీఆర్‌ఆర్‌ఎం హైస్కూలులో బుధవారం నుంచి పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ రాజేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా సాయంత్రం మూల్యాంకనానికి నియమితులైన అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. మూల్యాంకనంలో పాటించాల్సిన ప్రమాణాల గోప్యత, ఇతర వివరాలను వివరించారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా మూల్యాంకనాన్ని పక్కాగా నిర్వహించాలని డీఈఓ కోరారు. సమావేశంలో డీసీఈబీ కార్యదర్శి జి.పుల్లారెడ్డి, ఏసీ సి.నాగప్ప, ఉపవిద్యాధికారులు కె.వెంకట్రావు, ఎస్‌కే చాంద్‌బేగమ్, వి.రామ్మోహనరావు, ప్రధానోపాధ్యాయుల సంఘ అధ్యక్షుడు వై.వెంకట్రావు, ఏసీవోలు పాల్గొన్నారు.