రోగుల సంరక్షణే ధ్యేయం
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగులను, సీనియర్ వైద్యులను అందరినీ కలుపుకుపోయి నిమ్స్ అభివృద్ధికి పాటుపడతానని నూతనంగా నిమ్స్ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పద్మశ్రీ డాక్టర్ లావు నరేంద్రనాథ్ తెలిపారు. అతి క్లిష్టమైన సర్జరీలు, క్లిష్టమైన వైద్య చికిత్సలు అందించడంలో నిమ్స్ ముందుండేలా చూస్తామని చెప్పారు. బెడ్ దొరకలేదంటూ ఏ ఒక్క రోగి నిమ్స్ ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నిమ్స్ డెరైక్టర్‌గా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన నరేంద్రనాథ్ ఈ సందర్భంగా ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. అన్ని డిపార్ట్‌మెంట్లవారితో సంప్రదించి ఇతర దేశాల్లో మాదిరిగా పేషెంట్ మేనేజ్‌మెంట్, బెడ్ మేనేజ్‌మెంట్‌ను ఏర్పాటుచేసి రోగులకు మరిన్ని సేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
నిమ్స్ ఆసుపత్రిలోని కాంట్రాక్టర్లు ఎవరైనా తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యుడికి కులమతప్రాంతీయ భేదాలు ఉండవని స్పష్టంచేశారు. తన 30 సంవత్సరాల వైద్యవృత్తిలో నల్గొండ, నిజామాబాద్‌లో పోలియోతో బాధపడుతున్న రోగులకే ఎక్కువ సేవలు చేశానని తెలిపారు. ఆసుపత్రిలో కూడా తెలంగాణ ఉద్యోగుల పూర్తి సహకారం ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధిలోనికి రాని రోగాలను కూడా పేద రోగులకు ఏ విధంగా అందించాలి అనే విషయంపై దృష్టిపెడతామని తెలిపారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. వైద్య బృందంతో కలిసి సుమారు పది నిమిషాలపాటు జగన్‌తో మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి కూడా తాను వైద్యం అందించానని నరేంద్రనాథ్ గుర్తుచేశారు. బలమైన ఆహారం తీసుకోవాలని జగన్‌కు సూచించారు. మంత్రి దానం నాగేందర్‌తో కలిసి క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలిసి తనను నిమ్స్ డెరైక్టర్‌గా నియమించడంపై కృతజ్ఞతలు తెలిపారు.