
ఏపీ నేతలపై ఎన్నో సందేహాలు: పవన్
హైదరాబాద్: తమిళనాడులో జరిగిన జల్లికట్టు ఉద్యమం నుంచి ఆంధ్రులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ తరహాలోనే పవన్ కూడా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయాలని సూచించారు. మన రాజకీయ నేతలు కూడా ఇటువంటి సంఘీభావాన్ని ప్రదర్శించాలన్నారు. జల్లికట్టుపై ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ స్వాగతించింది. ఈ మేరకు పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఓ లేఖను ట్వీట్ చేశారు.
జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో 'ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా' సాధించాలని పిలుపునిచ్చారు. వ్యాపార అవసరాలు ఎక్కువగా ఉండి రాజకీయ నిబద్ధత తక్కువగా ఉన్న మన రాజకీయ నేతలు తమిళ ఉద్యమం నుంచి ఎంతవరకు స్ఫూర్తి పొందుతారనే దానిపై తనకు కొన్ని సందేహాలు ఉన్నాయన్నారు. అయితే ప్రత్యేక హోదా విషయంలో రాజకీయ నేతలు రాజీపడినా ప్రజలు మాత్రం రాజీపడబోరని తనకు గట్టి నమ్మకం ఉందని పవన్ ప్రస్తావించారు. జల్లికట్టుపై నిషేధానికి నిరసనగా లక్షలాదిమంది మెరీనా బీచ్ చేరినప్పటికీ ఎక్కడా అసాంఘిక సంఘటనలు జరగకపోవడం హర్షించదగ్గ విషయమని, మన ద్రవిడ సంస్కృతిపై తమిళుల మక్కువ, వారు దానిని కాపాడుకున్న వైనాన్ని పవన్ కొనియాడారు.
'ఇది సరైన సమయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం. జల్లికట్టు నిషేధంపై తమిళనాడులో అంకురించిన ఉద్యమం గతంలో జరిగిన హిందీ వ్యతిరేఖ ఉద్యమంలా మారకముందే కేంద్ర ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శించడంతో దేశ సమగ్రతకు భంగం తప్పింది. భారత సంస్కృతి, సంప్రదాయాల వైవిధ్యాన్ని మున్ముందు గౌరవించకపోతే ఇటువంటి ఆందోళనలు తలెత్తే ప్రమాదం ఉంది. తమిళుల పోరాట పటిమను ఈ ఉద్యమం ప్రతిబించింది. కులమతాలకు అతీతంగా తమిళులంతా ఏకమై జల్లికట్టుకు వ్యతిరేకంగా నినదించడం స్ఫూర్తిదాయకం' అని పవన్ తన లేఖలో వివరించారు.