సాక్షి, అమరావతి: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) భావజాలం, తమ పార్టీ భావజాలం ఒక్కటేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. 2014 ఎన్నికల తరువాత బీజేపీతో ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాప్ ఇప్పుడు తొలగిపోయిందని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ గురించి బీజేపీ నేతలు వివరిస్తుంటే దానివల్ల ఎంత ఉపయోగమో తెలిసిందని పేర్కొన్నారు. ఇకనుంచి ఎలాంటి షరతులూ లేకుండా బీజేపీతో కలసి పని చేస్తామని తేల్చిచెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గతంలో ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారని పవన్ గుర్తు చేశారు.
బీజేపీ, జనసేన పార్టీల ముఖ్యనేతలు గురువారం విజయవాడలో సమావేశమయ్యారు. ఇక నుంచి రాష్ట్రంలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. రాష్ట్రానికి బీజేపీ అవసరం ఎంతో ఉందని చెప్పారు. ఇకపై ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దేవ్‌ధర్ నేతృత్వంలో పని చేస్తామని వెల్లడించారు. గతంలో మీరు బీజేపీకి వ్యతిరేకంగా వామపక్షాలతో కలసి పనిచేశారు కదా! అని విలేకరుల ప్రశ్నించగా.. ‘నేను ఏమైనా వామపక్షాలకు బాకీ ఉన్నానా’ అని తీవ్రస్వరంతో బదులిచ్చారు.
బీజేపీ విధానాలకు మద్దతు ఇస్తున్నాం..
రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకుని తీరుతామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆ సత్తా, తెగువ తమకు ఉన్నాయన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)తోపాటు బీజేపీ విధానాలన్నింటికీ తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఆ చట్టం వల్ల మన దేశంలో ఉన్న ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ విశ్వవిద్యాలయం రూపొందించిన నివేదిక చదవడంతో తనకు తెలిసిందన్నారు. అందరూ ఆ నివేదిక చదవాలని సూచించారు. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ, జనసేన కలిసి పని చేస్తాయని పవన్ కల్యాణ్ చెప్పారు.
ఏపీలో బీజేపీ బలపడుతుంది: సునీల్ దేవ్‌ధర్
జనసేన పార్టీతో పొత్తు వల్ల ఏపీలో బీజేపీ బలపడుతుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దేవ్‌ధర్ చెప్పారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్రంలో తృతీయ ప్రత్యమ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. అన్ని స్థాయిల్లోనూ రెండు పార్టీలు కలిసి పనిచేసేందుకు ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. టీడీపీతో గానీ, వైఎస్సార్‌సీపీతో గానీ తమకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఎలాంటి పొత్తు ఉండదని పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ... ఎలాంటి షరతులూ లేకుండా తమతో కలిసి పనిచేసేందుకు పవన్ కల్యాణ్ సమ్మతించారని చెప్పారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకుంటామన్నారు. ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా ఏర్పడటమే తమ లక్ష్యమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు దగ్గుబాటి పురందేశ్వరి, సోము వీర్రాజు, జనసేన పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, శివశంకర్, రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
.
Comments
Please login to add a commentAdd a comment