ఎన్నికల తర్వాత పత్తా లేని జనసేన అధినేత | Janasena Party Activists are Disappoint With Pawan Kalyan Absence in Gajuwaka after Election Results 2019 - Sakshi
Sakshi News home page

ఎన్నికల తర్వాత పత్తా లేని జనసేన అధినేత

Published Sat, Aug 17 2019 7:57 AM | Last Updated on Sat, Aug 17 2019 12:39 PM

Pawan Kalyan Not Seen Gajuwaka After Elections - Sakshi

గెలిచినా ఓడినా గాజువాకను వదిలేది లేదు.. నెలలో కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను.. ఎన్నికల ముందు రాష్ట్రమంతటా తిరగాల్సి రావడంతో గాజువాకకు తక్కువగా వచ్చాను.. ఇకపై తరచూ వస్తాను.... ఇది సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తర్వాత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రకటన. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఓ పత్రికలో ఇదే సారాంశంతో వాణిజ్య ప్రకటన విడుదల చేశారు.. ఓడిపోయినప్పటికీ నాకు ఓట్లేసిన గాజువాక ప్రజలను త్వరలోనే కలుసుకుంటానని ప్రకటించారు. ఇవి జరిగి దాదాపు మూడు నెలలైంది. జనసేన ‘పవనం’ పత్తా లేదు. గాజువాక వైపు అస్సలు చూడలేదు సరికదా.. ఎక్కడా ఆ ఊసే ఎత్తలేదు. గాజువాకతో పాటు పోటీ చేసి ఓడిపోయిన భీమవరం నియోజకవర్గానికి మాత్రం పవన్‌కల్యాణ్‌ వెళ్లారు. ముందుగా అక్కడి శ్రేణులను విజయవాడ పిలిపించుకుని మాట్లాడారు కూడా.. అయితే గాజువాకకు రాకుంటే రాకపోయె.. కనీసం ఇక్కడి నేతలనైనా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. తన కోసం గాజువాక సీటు త్యాగం చేసి.. పెందుర్తికి తరలిపోయిన మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యను కూడా ఇంతవరకు పవన్‌ పలకరించలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గాజువాకను ‘గ్లాసు’వాక చేసేస్తామంటూ ఎన్నికల ముందు జనసేన శ్రేణులు ఉబలాటపడిపోయారు.పవన్‌ కల్యాణ్‌ సినిమా క్రేజ్‌ చూసి గాజువాకలో గెలుపుపై లెక్కలు వేసుకున్నారు. అభిమానుల హడావుడి అలా ఉంటే.. పవన్‌ కల్యాణేమో కుల లెక్కలు.. 2009లో పీఆర్పీ అభ్యర్ధిగా చింతలపూడి వెంకట్రామయ్య అనూహ్య గెలుపును గుర్తుచేసుకొని.. ఆశల గుర్రంపై ఊరేగుతూ గాజువాకకు అర్ధంతరంగా దిగుమతైపోయారు. అయితే అక్కడి ప్రజలు ఫలితాల రూపంలో ఆయనకు చుక్కలు చూపించారు. భారీ ఓట్ల తేడాతో పరాజయం రుచి చూపించారు. ఈ ప్రాంతంతో ఎటువంటి అనుబంధం లేకుండా.. ఇక్కడి సమస్యలపై ఏమాత్రం అవగాహన చేసుకోకుండా.. ఎన్నికల ప్రచారానికే సరిగ్గా రాకుండా.. ఇక్కడే ఉంటానని అద్దెకు తీసుకున్న ఇంట్లో ఒక్కరోజు కూడా బస చేయని పవన్‌ కల్యాణ్‌ విషయంలో గాజువాక ప్రజ సరైన తీర్పునిచ్చింది. భీమవరంలో కంటే కూడా ఎక్కువ ఓట్ల తేడాతో ఓడించింది. ఫలితాలు వచ్చిన మరుసటి రోజే పవన్‌కల్యాణ్‌ గాజువాక ప్రజలనుద్దేశించి ఓ వాణిజ్య ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే గాజువాక వచ్చి తనకు ఓట్లేసిన వారిని కలుసుకుంటానని ప్రకటించారు. ఆ మేరకు వస్తారని అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆశించారు. కానీ ఫలితాలు వచ్చి దాదాపు మూడు నెలలు కావొస్తున్నా ఆయనగారి జాడ లేకపోవడంపై జనసేన వర్గాల్లోనే చర్చకు దారితీసింది.

అడపాదడపా జేడీ పర్యటన..
ఇక విశాఖ లోక్‌సభ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన జేడీ అలియాస్‌ వీవీ లక్ష్మీనారాయణ మాత్రం అడపాదడపా నగర వాసులకు కనిపిస్తున్నారు. గాజువాకలో అధినేత పవన్‌కల్యాణ్‌ తీసుకున్న అద్దె ఇంటితో సహా పార్టీ కార్యాలయాల్లో చాలావరకు మూతపడిన నేపథ్యంలో జేడీ పర్యటనలు మాత్రం అడపాదడపా కొనసాగుతున్నాయి. అయితే జేడీని పార్టీ పొలిట్‌బ్యూరోలోకి తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పొలిట్‌ బ్యూరోలో జేడీ కంటే అర్హులెవరంటూ ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఇక జనసేనకు జేడీ దూరమంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిపై జేడీనే ఘాటుగా స్పందించడంతో ఆ ప్రచారానికి తెరపడింది. ఇప్పుడు విషయమేమిటంటే.. ఎన్నికల ప్రచార సమయంలో పవన్‌ను అభినవ వివేకానందుడితో పోల్చిన జేడీ.. పోటీ చేసి ఓడిపోయిన గాజువాకను కనీసంగా కూడా తలవని పవన్‌ నిర్వాకంపై ఎటువంటి అభిప్రాయం వెల్లడిస్తారన్నదే జిల్లా జనసేన నేతలు ఎదురుచూస్తున్నారు. మొత్తంగా ఇప్పటివరకు గాజువాక గురించి ప్రస్తావించని పవన్‌ తీరుతో జేడీ, జనసేన నేతలేమో గానీ క్యాడర్‌ మాత్రం తల పట్టుకుంటోంది.

ఇప్పటివరకు ఆ ఊసెత్తని పవన్‌..
దారుణ పరాభవంతో కొద్దిరోజులు బయటకు రాని పవన్‌కల్యాణ్‌.. ఆ తర్వాత విజయవాడ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో నియోజకవర్గాల వారీగా భేటీ అవుతూ వచ్చారు. ఆ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లాలో తాను పోటీ చేసిన భీమవరం శ్రేణులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత స్వయంగా భీమవరంలో పర్యటించారు. వివిధ నియోజకవర్గాల శ్రేణులతోనూ సమావేశమవుతూ వస్తున్నారు. కానీ భీమవరంతో పాటు పోటీచేసి ఓడిపోయిన గాజువాక గురించి మాత్రం ఇప్పటివరకు ఆయన పెదవి విప్పలేదు. ఫలానా సమయంలో రావొచ్చని కానీ, అసలు వస్తానని గానీ పార్టీ నేతలకు ఇప్పటివరకు సమాచారం ఇవ్వలేదు. పోనీ రాకుంటే రాకున్నారు.. కనీసం గాజువాక నేతలను, కార్యకర్తలను విజయవాడకు పిలిపించి మాట్లాడారా.. అంటే అదీ లేదు. భీమవరం నేతలను, శ్రేణులకు పిలిపించి మాట్లాడి.. ఆ తర్వాత అక్కడి వెళ్ళిన పవన్‌కు గాజువాక మీద ఎంత ప్రేమ ఉందో అర్ధమవుతోందని స్వయంగా జనసేన నేతలే మధనపడుతున్నా బహిరంగంగా అనలేక నోరునొక్కుకుంటున్నారు. అంతెందుకు తన కోసం గాజువాక సీటు వదిలి.. పెందుర్తికి వెళ్ళి నష్టపోయిన గాజువాక తొలి ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యను కూడా ఇంతవరకు పవన్‌ పలకరించలేదంటేనే ఇక... ఆ పార్టీ శ్రేణుల పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement