తమ్ముడు రాజకీయ ప్రత్యర్థే..: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: జనసేన పార్టీని స్థాపించిన సోదరుడు పవన్ కల్యాణ్‌కు అన్నగా తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, కేంద్ర మంత్రి చిరంజీవి పేర్కొన్నారు. ఒకే కుటుంబానికి చెందినంత మాత్రాన తమ సిద్ధాంతాలు ఒకటే కావాలనేమీ లేదన్నారు. పవన్‌కు తొలినుంచీ కొన్ని సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఉందని, వాటి ప్రకారమే ఆయన జనసేన పార్టీని స్థాపించారన్నారు. గురువారం ఇందిరాభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్‌కల్యాణ్ ‘కాంగ్రెస్ హటావో’ అన్నా తాను మాత్రం కాంగ్రెస్‌ను పటిష్టంచేసి ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వారంతా తమకు ప్రత్యర్థులేనన్నారు.
కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు
తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు నిండాకే కిందకు నీళ్లు వదులుతామని, సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులంతా వెళ్లిపోవలసిందేనంటూ కేసీఆర్ బెదిరింపులకు దిగడం సరికాదని చిరంజీవి అన్నారు. ఎన్నికల సమయం కావటంతో ఓట్లు దండుకోవడానికి ఇలాంటి బెదిరింపులకు దిగుతున్నారని, ఆయన తాటాకు చప్పుళ్లకు సీమాంధ్రులెవరూ భయపడబోరని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ది మొదటినుంచీ మోసపూరిత వైఖరేనన్నారు.