వెలగపూడి ఇలాకాలోనే పవన్‌ కవాతు | Pawan Kalyan To Undertake Long March In Visakhapatnam | Sakshi
Sakshi News home page

వెలగపూడి ఇలాకాలోనే పవన్‌ కవాతు

Published Sun, Nov 3 2019 6:15 AM | Last Updated on Mon, Nov 4 2019 1:13 PM

Pawan Kalyan To Undertake Long March In Visakhapatnam - Sakshi

పవన్‌ కల్యాణ్‌ పదేళ్ళ రాజకీయ ప్రస్థానం చూస్తే ’సాధింపులు’ ఎక్కువగా ఉంటాయి. ఔను... సాధింపులే.. ఓ రకంగా కొందరు అత్తలు.. కోడళ్ళను సాధించే బాపతన్నమాట. ఐదేళ్ళ కిందట పవన్‌ పెళ్లిళ్ల గురించి ప్రత్యర్థి పార్టీల నేతలు మాట్లాడితే.. ఇదిగో మీ అందరి తెర వెనుక భాగోతాలు బయటపెడతానంటూ హడావుడి చేశారు. కానీ.. ప్చ్‌.. ఒక్కరి గుట్టు విప్పితే ఒట్టు.! ఎప్పుడో ఎక్కడో ఎందుకు.. తాజా ఉదాహరణే చూద్దాం. సత్తెనపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత అంబటి రాంబాబు ఇటీవల రాజకీయపరంగా విమర్శలు చేస్తే.. ‘నేను మీ అమ్మాయి పెళ్ళికి వచ్చానంటూ’ పవన్‌ సంబంధం లేని మాటలు మాట్లాడారు..
ఇక సినీనటుడు ఆలీతో వివాదం తెలిసిందే. ఆలీకి ఎంతో చేస్తే తనను మోసం చేశాడని పవన్‌ ఎన్నికల సమయంలో అన్నారు. దానికి ఆలీ గట్టిగా కౌంటర్‌ ఇచ్చాడు. నేను యమలీలలో హీరోగా చేసిన సమయంలో మీరు హీరో కూడా కాదు.. నేను స్వతంత్రంగానే పరిశ్రమలో ఎదిగాను.. మీరు మెగాస్టార్‌ తమ్ముడిగా వచ్చి ఎదిగారు.. మీరు నాకు సినిమాలు ఇప్పించారా.. డబ్బు సాయం చేశారా.. ఇలా చాలా చాలా ప్రశ్నలు వేసి గట్టిగా రిటార్ట్‌ ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకనుకుంటున్నారా.. పవన్‌ కల్యాణ్‌ భవన నిర్మాణ కార్మికుల పేరుతో విశాఖలో చేపట్టిన లాంగ్‌మార్చ్‌కు ఎవ్వరి మద్దతూ కూడగట్టలేకపోయారు. చివరికి ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన వామపక్షాలూ కలిసి రాలేదు. ఇక ఎవ్వరూ లేకున్నా..  2014లో బహిరంగంగా.. 2019 లోపాయికారీగా మద్దతిచ్చిన టీడీపీ ఉంది కదా.. వాళ్ళు మాత్రం మద్దతిచ్చారు. ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు.. అందరూ అనుకున్నదే. ఇప్పుడు అసలు విషయమేమిటంటే.. పవన్‌కల్యాణ్‌ లాంగ్‌మార్చ్‌ మొదలుపెట్టే ప్రాంతం.. నడిచే ప్రాంతంలో ఎక్కువ భాగం.. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమే. అయితే ఏంటి? అనుకుంటున్నారా.. ఒక్కసారి లోపలికి రండి.. పూర్తి వివరాలు చూద్దాం.
– సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు రాత్రి..  వెలగపూడి రామకృష్ణబాబు విజయోత్సవ ర్యాలీలో గెలుపు ఊపుతో ఏమేం మాట్లాడారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌నుద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పత్రికల్లో రాయలేని భాషలో పవన్‌ను తిట్టిపోశారు. ‘ఒక్క చోట కూడా  గెలవలేని....... మళ్ళీ రెండు చోట్ల పోటీ చేశాడు.. ఆ ము.... రెండు చోట్లా ఓడిపోయాడు.. ’ అని దారుణంగా మాట్లాడారు. వాస్తవానికి రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలు ఒకరినొకరు తిట్టిపోసుకోవడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఒకప్పుడు సిద్ధాంతపరమైన విమర్శలకు పరిమితమైన నేతలు ఇప్పుడు శృతిమించి వ్యక్తిగత దూషణలకూ వెళిపోతున్నారు. ఇవన్నీ ఇప్పుడు మూమూలేనని దాదాపు అందరూ సర్దుకుపోతున్నారు.

కానీ పవన్‌ కల్యాణ్‌ మాత్రం ఆ టైపు కాదని అందరికీ తెలుసు. ఎప్పుడెప్పుడి విషయాలో తవ్వి మరీ  విపక్ష నేతలపై విమర్శలు చేస్తుంటారు. ప్రజారాజ్యం నుంచి ఇతర పార్టీలకు వెళ్ళిన నేతలు మొదలు.. తన మద్దతుతోనే 2014లో టీడీపీ నేతలందరూ గెలిచారని భావిస్తూ.. ఆయా నేతలందరినీ ఆయన ఆడిపోసుకుంటుంటారు. మన జిల్లాలో గంటా శ్రీనివాసరావు మొదలు పీఆర్పీ నుంచి వచ్చిన నేతలందరినీ టార్గెట్‌ చేస్తుంటారు. ముఖ్యంగా గంటాపైన ఎన్నికల వేళ తీవ్ర విమర్శలు చేశారు. ఎప్పుడో తనను ఉద్దేశించి అన్న మాటలను మైండ్‌లో రికార్డ్‌ చేసుకుని మరీ గంటాను తిట్టిపోశారు. ఒక్క గంటానే కాదు.. తనను విమర్శించిన నేతలందరినీ గుర్తించుకుని మరీ తిట్టిపోయడం పవన్‌ రాజకీయాలు చూసిన వారెవరికైనా ఎరుకే.

వెలగపూడి జోలికి వెళ్తారా?
ఇప్పుడు తనను తిట్టిపోసిన వెలగపూడి ఇలాకాలోనే పవన్‌కల్యాణ్‌ లాంగ్‌మార్చ్‌ మొదలుపెట్టనున్నారు. మరి వెలగపూడిని టార్గెట్‌ చేస్తారా అన్నదే ఇప్పుడు  చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి తనను అవమానకరంగా దూషించిన వెలగపూడి కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే ఆయన లాంగ్‌మార్చ్‌ చేయాల్సి వస్తోంది. ఇసుక విషయమై తాను చేస్తున్న పోరాటానికి కలిసిరావాలని విపక్ష పార్టీలన్నంటినీ  పవన్‌ అభ్యర్ధించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని సైతం ఆహ్వానించారు. అయితే బీజేపీ నేతలు పవన్‌ వినతిని చాలా లైట్‌గా తీసుకున్నారు.  ఇక గడిచిన ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసిన వామపక్షాలు సైతం ఆయన ఆహ్వానాన్ని మన్నించలేదు. ఇప్పటికే తాము ఇసుక విషయమై ఉద్యమాలు చేసినందున జనసేన మార్చ్‌కు దూరంగా ఉంటామని తేల్చిచెప్పాయి. దీంతో పవన్‌ ఏకాకిగానే మార్చ్‌ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే టీడీపీ నేతలు మాత్రం పవన్‌ షోకి ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు పవన్‌ స్వయంగా ఫోన్‌ చేసి మద్దతు కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలను ఆదివారం నాటి లాంగ్‌మార్చ్‌కు వెళ్ళాల్సిందిగా బాబు ఆదేశించినట్టు సమాచారం.

టీడీపీ నేతలకు టీడీ జనార్ధన్‌ ఫోన్లు
పవన్‌ కల్యాణ్‌ ఆదివారం చేపట్టిన లాంగ్‌మార్చ్‌కు వెళ్ళాలని పార్టీ అధినేత చంద్రబాబు  చెప్పారంటూ ఆ పార్టీ ముఖ్య నాయకుడు టీడీ జనార్ధన్‌ జిల్లాకు చెందిన కొందరు నేతలకు ఫోన్‌ చేసినట్టు చెబుతున్నారు. మాజీ మంత్రులు గంటాశ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడులను కచ్చితంగా వెళ్ళాలని కోరినట్టు తెలుస్తోంది.. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా అయ్యన్న వెళ్ళే అవకాశాలున్నప్పటికీ గంటా హాజరుపై మాత్రం అనుమానాలున్నాయి. వాస్తవానికి జనసేన నేతలు కూడా వ్యక్తిగతంగా గంటాను ఆహ్వానించినట్టు చెబుతున్నారు. కానీ టీడీపీ సమావేశాలకే డుమ్మా కొడుతున్న గంటా.. ఆ పార్టీ మద్దతిస్తున్న జనసేన షోకు వెళ్ళడం ప్రశ్నార్ధకంగానే ఉంది.

పవన్‌ గాజువాక వెళ్తారా...
పోటీ చేసి ఓడిపోయిన తర్వాత గాజువాక వైపు పవన్‌ కన్నెత్తి చూడలేదు. దాదాపు ఆరు నెలల తర్వాత విశాఖ వస్తున్న ఆయన ఇప్పుడైనా తనకు ఓట్లు వేసి కనీసం రెండోస్థానంలో నిలబెట్టిన గాజువాక వైపు తొంగిచూస్తారా లేదా అనేది జనసేన శ్రేణులు కూడా చెప్పలేని అయోమయ పరిస్థితే ఉంది.

కొసమెరుపు
రెండురోజుల కిందట రాజ్యసభ సభ్యుడు, ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి విజయసాయిరెడ్డి విశాఖలో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ఇంకా పవన్‌కల్యాణ్‌ పొలిటికల్‌ కాల్‌షీట్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు. పవన్‌ సినిమా కాల్‌షీట్లు ఎవరికైనా ఇస్తున్నారో లేదో గానీ పొలిటికల్‌ కాల్‌షీట్లు మాత్రం బాబు వద్దనే ఉన్నాయన్నారు. అందుకే బాబు చెప్పినట్టుగానే ఇప్పటికీ పవన్‌ యాక్ట్‌ చేస్తున్నాడని విమర్శించారు. ఆ రాజకీయ విమర్శలేమో గానీ సరిగ్గా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు నిజమనిపించేలానే ఎవ్వరూ రాకున్నా జనసేన, టీడీపీనే కలిసి నేడు షో చేయనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement