సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో పచ్చచొక్కా వేసుకుంటే గానీ పెన్షన్లు ఇచ్చేవారు కాదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారదర్శకంగా, అవినీతి రహితంగా పెన్షన్లు ఇస్తుంటే మాజీ సీఎం చంద్రబాబు భరించలేకపోతున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో భర్త ఉన్న వారికి కూడా వితంతు పెన్షన్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఎద్దేవా చేశారు. కనీస అర్హతలు కూడా చూడకుండా పెన్షన్లు ఇచ్చిన చరిత్ర చంద్రబాబుదేనని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ కులం, మతం, ప్రాంతం చూడకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్‌లు ఇస్తున్నారని గుర్తుచేశారు. పెన్షన్లను తీసేస్తున్నారంటూ ప్రస్తుతం చంద్రబాబు గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.
అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఎంపిక
పెన్షన్ల మంజూరు విషయంలో గతంలో ఉన్న అర్హతలను కూడా సడలించి మరింత ఎక్కువ మందికి మేలు చేసేలా చర్యలు తీసుకున్నామని పెద్దిరెడ్డి తెలిపారు. అవినీతికి తావు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. ఎంపికైన వారి జాబితాలను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచామని చెప్పారు. ఎవరైనా అర్హులు మిగిలిపోతే ఎలా దరఖాస్తు చేయాలన్న వివరాలను సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నామని వెల్లడించారు. వలంటీర్లు రేపటి నుంచి ఇంటివద్దకే వెళ్లి పెన్షన్లు అందజేస్తారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 54.65 లక్షల మందికి ఒకే రోజు పింఛన్లు ఇస్తున్నామని మంత్రి తెలిపారు.
టీడీపీ హయాంలో పచ్చచొక్కాలకే పెన్షన్లు
Published Sat, Feb 1 2020 5:11 AM | Last Updated on Sat, Feb 1 2020 5:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment