
ప్రభుత్వంపై పెద్దిరెడ్డి ఫైర్
అమరావతి :
సవాళ్లు, ప్రతి సవాళ్లు పార్లమెంటరీ సంప్రదాయంలో ఉన్నాయా అని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసెంబ్లీలో ధ్వజమెత్తారు. అలా ఉంటే రూలింగ్ ఇవ్వండన్నారు. నిన్న జరిగిన దాని గురించి ప్రభుత్వం మాట్లాడుతోంది. ఎమ్మెల్యేల అనర్హత, రాజీనామాల గురించి తాము ఏడాదిగా అడుగుతున్నామని చెప్పారు. ఈ విషయమై వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభలో చాలా సార్లు సవాల్ చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఎప్పుడు స్పందించలేదన్నారు.
పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్ చేస్తే ఎందుకు స్పందించలేదని నిప్పులు చెరిగారు. ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికి పోయారన్నారు. మన వాళ్లు బ్రీఫ్‌డ్ మీ అని చంద్రబాబు గొంతు ఆడియోలో రికార్డయింది. ఆ గొంతు చంద్రబాబుది అవునో కాదో చెప్పడంలేదని మండిపడ్డారు. ముందుగా వాటన్నింటిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.