ఒంగోలు టౌన్: ‘మహిళా శిశు అభివృద్ధి సంస్థకు సంబంధించిన కార్యక్రమాలను సమీక్షిస్తానని ముందుగానే చెప్పాను.. పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారు.. కాగితాలపై ఒకరకంగా, చెప్పేటప్పుడు ఇంకో రకంగా ఉన్నాయి.. మీ పనితీరు సక్రమంగా లేకపోవడంతో పేదలకు అంగన్‌వాడీ కేంద్రాల సేవలు అందడం లేదని’ మహిళా శిశు సంక్షేమశాఖా మంత్రి పీతల సుజాత ఆ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం స్థానిక సీపీఓ కాన్ఫెరెన్స్ హాలులో జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ఆమె సమీక్షించారు.
జిల్లాలో ఎన్ని ప్రాజెక్టుల్లో అమృతహస్తం పథకం అమలవుతుంది? ఎంతమంది లబ్ధిదారులున్నారో మంత్రి పలువురు సీడీపీఓలను అడిగారు. అయితే వారినుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమృతహస్తం పథకానికి సంబంధించి అటెండెన్స్, ఎన్‌రోల్‌మెంట్‌లో తేడా ఉందని, ఎందుకు తేడా ఉంటుందని సంబంధిత ప్రాజెక్టుల సీడీపీఓలను ప్రశ్నించారు. కొంతమందికే ‘అమృతహస్తం’ అందిస్తున్నారు, మిగిలిన వారికి ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.
బేస్తవారపేట సీడీపీఓ మాట్లాడుతూ తమ ప్రాజెక్టు పరిధిలో కొంతమంది గొప్పోళ్ల పిల్లలు ఉన్నారని, వారు అమృత హస్తం తీసుకునేందుకు రావడం లేదని చెప్పడంతో వారిని ఎందుకు నమోదు చేశారని మంత్రి ప్రశ్నించారు. పేదోళ్లకు ఈ పథకం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలామృతం పథకానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి వివరాలు లేకపోవడంపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆర్‌డీడీ, పీడీల మధ్య సమన్వయం లేదు
మహిళా శిశు సంక్షేమశాఖ రీజనల్ డిప్యూటీ డెరైక్టర్, జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ల మధ్య సమన్వయం కొరవడిందని మంత్రి గుర్తించారు. కీలకమైన ఇద్దరు అధికారుల మధ్య సమన్వయం లేకుంటే శాఖపనితీరు ఏవిధంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చన్నారు. జిల్లాలోని సీడీపీఓల పనితీరు నివేదికలు ఎందుకు ఇవ్వలేదని ప్రాజెక్టు డెరైక్టర్‌ను ప్రశ్నించారు.
ఇప్పటివరకు నెలవారీగా నివేదికలు అందిస్తున్నారని, ఇకనుంచి ఏరోజుకారోజు నివేదికలు తీసుకుంటామన్నారు. ప్రాజెక్టు డెరైక్టర్, సీడీపీఓలు రోజుకో అంగన్‌వాడీ కేంద్రాన్ని విధిగా తనిఖీ చేయాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేసే పౌష్టికాహారంలో నాణ్యత తక్కువగా ఉంటే ఆ కాంట్రాక్టును రద్దుచేసి మరొకరికి ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ మాట్లాడుతూ శిశుగృహల్లోని చిన్నారుల నిర్వహణకు ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇస్తుందని, దాన్ని రెండువేల రూపాయలకు పెంచాలని మంత్రిని కోరారు.
కిశోర బాలికలకు శిక్షణా కార్యక్రమాలకు సంబంధించి బడ్జెట్ నిధులు పెంచాలన్నారు. గృహహింస వంటి కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు.
ఏమిటీ లెక్కలు?
Published Fri, Sep 26 2014 3:22 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM
Advertisement
Advertisement