ప్రాజెక్టుల పెండింగ్ పనులు రద్దు | pending irrigation projects works cancel | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టుల పెండింగ్ పనులు రద్దు

Published Thu, Sep 12 2013 2:46 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM

ప్రాజెక్టుల పెండింగ్ పనులు రద్దు

ప్రాజెక్టుల పెండింగ్ పనులు రద్దు

సాక్షి, హైదరాబాద్: సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాల్లో వివిధ కారణాలతో నిలిచిపోయిన ప్యాకేజీల పనులను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనుల్ని పూర్తి చేయడం కష్టమనే అంచనాకు వచ్చిన ప్రభుత్వం ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టుల వారీగా నిలిచిపోయిన పనుల్ని గుర్తించి, అందులో ఇప్పట్లో పూర్తి చేయలేని పనుల్ని రద్దు చేయాలని నిర్ణయించారు. ఇటీవల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన భారీ నీటిపారుదల మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో సమీక్షించారు. పలు ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నా.. పెండింగ్ పనులను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నామనే అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. ముఖ్యంగా పలు ప్రాజెక్టుల్లో పనులు గత రెండు మూడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. మహేంద్ర తనయ ప్రాజెక్టుకు సంబంధించి డ్యాం, వరదనీటి కాల్వ, సొరంగం పనులను కొంతవరకు చేసి వదిలేశారు. గత మూడేళ్లుగా ఒక్క అడుగు ముందుకు పడలేదు. అలాగే పుష్కరం ప్రాజెక్టులో చివరి కాల్వలకు సంబంధించి భూ సేకరణ కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి.
 
 అలాగే ఝంజావతి ప్రాజెక్టులో ప్యాకేజీ-2లో కాల్వ పనులు నిలిచిపోయాయి. ఇలాగే పలు ప్రాజెక్టుల్లో కొద్దిపాటి విస్తీర్ణమైనా భూమిని సేకరించకపోవడం, కోర్టు కేసులు ఉండడం, అటవీ భూములకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడం, నేషనల్ హైవే, రైల్వే లైన్లనుంచి కాల్వల తవ్వకానికి అనుమతులు లేకపోవడం వంటి కారణాలను చూపిస్తూ పలు ప్రాజెక్టుల్లో పనులను నిలిపి వేశారు. దీంతో పనులు 90 శాతం పూర్తయినా...నీటిని సరఫరా చేయడం సాధ్యం కావడం లేదు. కాగా మంత్రితో భేటీ అనంతరం అధికారులకు ఒక మెమో రూపంలో కొన్ని ఆదేశాలు జారీ అయ్యాయి. చిన్న చిన్న కారణాలతో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులను గుర్తించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా వీటి రద్దుకు వెంటనే సిఫారసు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే మహేంద్ర తనయ ప్రాజెక్టు నిర్మాణ పనులను 61 సెక్షన్ కింద రద్దు చేయాలని నిర్ణయించారు. అయితే రద్దయిన పనులకు మళ్లీ టెండర్లు పిలవాలా? లేక పూర్తిగా రద్దు చేయాలా? అనే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement