P. sudarshan reddy
-
మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి డల్లాస్ లో సన్మానం
టెక్సాస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డిని ప్రవాస తెలుగు రాష్ట్రాల వాసులు ఘనంగా సన్మానించారు. మంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా సన్మానించేందుకు తెలుగు వారు ఓ కార్యక్రమం నిర్వహించారు. 2009లో నిజామాబాద్ జిల్లా నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆయన రికార్డు సృష్టించారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన నీటిపారుదల, ఆరోగ్యశాఖలను నిర్వర్తించారు. నిజామాబాద్ మాజీ ఎంపీ డా.ఆత్మ చరణ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి సేవలను కొనియాడారు. అజయ్ రెడ్డి ఏలేటి, రఘువీర్ బండారు, ఇతర ముఖ్యనేతలు ఈ కారక్యమంలో పాల్గొన్నారు. సోషల్ యాక్టివిస్ట్ గానూ మంచి గుర్తింపున్న నేత సుదర్శన్ రెడ్డిని సుదర్శనచక్రంతో పోల్చారు. నీటిపారుదల మంత్రిగా సేవలకుగానూ ఆయనను అపర భగీరథుడిగా పిలుస్తారు. సమాజ సేవ అవార్డును ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీదర్ రెడ్డి కొర్సపాటి, ప్రమోద్ పొద్దుటూరి, రావ్ కల్వల, రామ్ కాసర్ల, ప్రసాద్ తోటకూర, శ్రీనివాస్ గుర్రం, సతీష్ రెడ్డి, సుబ్బు జొన్నలగడ్డ, మహేందర్ కమిరెడ్డి, రాజ్ గోందీ, ప్రవీణ్ బిల్లా, ఎన్ఎంఎస్ రెడ్డి, అల్ల శ్రీనివాస్ రెడ్డి, ఉపేందర్ తెలుగు, అశోక్ కొండల, మహేశ్ ఆదిబట్లలు పాల్గొన్నారు. ప్రజా సేవలో సుదర్శన్ రెడ్డి గారు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనను సన్మానించినట్టు రామ్ అన్నాడి పేర్కొన్నారు. -
మాజీ మంత్రి పార్టీ వీడరు: డీసీసీ అధ్యక్షుడు
నిజామాబాద్: మాజీ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ తెలిపారు. మాజీ మంత్రి టీఆర్ఎస్లో చేరుతున్నారంటూ వారం రోజులుగా వస్తున్న కథనాలను తాహెర్ ఖండించారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొందరు నాయకులు ఆయన పార్టీని వీడుతున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ఆదివారం సుదర్శన్‌రెడ్డి జన్మదిన వేడుకలకు హైదరాబాద్‌కు వెళ్లినపుడు, తాను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వెళ్లటం లేదని ఆయన స్పష్టం చేశారని పేర్కొన్నారు. -
నరకయాతన
కర్నూలు (హాస్పిటల్), న్యూస్‌లైన్ : కర్నూలు సర్వజనాస్పత్రిలో ‘అనంత’ క్షతగాత్రుల హాహాకారాలు.. వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వేసవి సెలవుల్లో స్వగ్రామానికి వచ్చి ప్రమాదానికి గురైన వారు కొందరైతే.. ప్రతి ఏటా జాతరకు వచ్చి మొక్కులు తీర్చుకునే వారు మరికొందరు. విషాదం నింపిన సుంకులమ్మ తిరుణాల ఘటనలో తీవ్రంగా గాయపడిన వారు నరకయాతన అనుభవిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాశేపల్లిలో శుక్రవారం రాత్రి సుంకులమ్మ బండి శిల తిరుణాల సందర్భంగా శిడిబండి లాగుతుండగా విద్యుత్ వైర్లు తగిలి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా.. మూడు ఎద్దులు చనిపోయాయి. శుక్రవారం రాత్రి గుత్తి ప్రభుత్వాసుపత్రి నుంచి 16 మందిని మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకొచ్చారు. వీరిలో ఇద్దరిని ప్రైవేటు ఆసుపత్రులకు, 14 మంది ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. క్యాజువాలిటీలో ప్రథమ చికిత్స అనంతరం శనివారం తెల్లవారుజామున వీరిని కాలిన రోగుల వార్డుకు మార్చారు. రామరాజుపల్లెకు చెందిన పరమేశ్వరాచారి కుమారుడు మాణిక్యాచారి(18), వెంకటరెడ్డి కుమారుడు పి.సుదర్శన్‌రెడ్డి (16), పెద్దవడుగూరుకు చెందిన బాబయ్య కుమారుడు డి.వన్నూరువలి (12), పెద్దవడుగూరు మండలం కాశేపల్లి గ్రామానికి చెందిన చెన్నారెడ్డి కుమారుడు జి.సుమంత్‌రెడ్డి(7), యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన ఎస్.వెంకటనారాయణరెడ్డి కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి (20)కి 80 నుంచి 90 శాతం శరీరం కాలిపోవడంతో వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పెద్దవడుగూరుకు చెందిన బాలిరెడ్డి కుమారుడు బాబురెడ్డి(45)కి ఐదు శాతం, ఆదిరెడ్డి కుమారుడు కె.లక్ష్మినారాయణరెడ్డి(35)కు 20 శాతం, రామరాజుపల్లె గ్రామానికి చెందిన సూర్యనారాయణరెడ్డి కుమారుడు సుధాకర్‌రెడ్డి(20)కి 40 శాతం, మడమకులపల్లికి చెందిన శ్రీరామిరెడ్డి(35)కి 20 శాతం, పెద్దవడుగూరు మండలం కాసిపల్లె గ్రామానికి చెందిన చెన్నారెడ్డి కుమారుడు జి.ప్రభాకర్‌రెడ్డి(15)కు 20 శాతం, అనంతపురంలోని హెచ్ఎల్సీ కాలనీకి చెందిన వి.ప్రవీణ్‌కుమార్(18)కు 30 శాతం, పెద్దవడుగూరుకు చెందిన ఆదినారాయణ కుమారుడు సత్యనారాయణ(35)కు 40 శాతం, చెన్నారెడ్డి కుమారుడు జి.సుధీర్‌రెడ్డి(10), రంగనాయకులు కుమారుడు రామచంద్ర(25)కు 40 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న 14 మందిలో నలుగురిని శనివారం కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రిలో 10 మంది, ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నారు. -
ప్రాజెక్టుల పెండింగ్ పనులు రద్దు
సాక్షి, హైదరాబాద్: సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాల్లో వివిధ కారణాలతో నిలిచిపోయిన ప్యాకేజీల పనులను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనుల్ని పూర్తి చేయడం కష్టమనే అంచనాకు వచ్చిన ప్రభుత్వం ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టుల వారీగా నిలిచిపోయిన పనుల్ని గుర్తించి, అందులో ఇప్పట్లో పూర్తి చేయలేని పనుల్ని రద్దు చేయాలని నిర్ణయించారు. ఇటీవల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన భారీ నీటిపారుదల మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో సమీక్షించారు. పలు ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నా.. పెండింగ్ పనులను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నామనే అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. ముఖ్యంగా పలు ప్రాజెక్టుల్లో పనులు గత రెండు మూడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. మహేంద్ర తనయ ప్రాజెక్టుకు సంబంధించి డ్యాం, వరదనీటి కాల్వ, సొరంగం పనులను కొంతవరకు చేసి వదిలేశారు. గత మూడేళ్లుగా ఒక్క అడుగు ముందుకు పడలేదు. అలాగే పుష్కరం ప్రాజెక్టులో చివరి కాల్వలకు సంబంధించి భూ సేకరణ కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. అలాగే ఝంజావతి ప్రాజెక్టులో ప్యాకేజీ-2లో కాల్వ పనులు నిలిచిపోయాయి. ఇలాగే పలు ప్రాజెక్టుల్లో కొద్దిపాటి విస్తీర్ణమైనా భూమిని సేకరించకపోవడం, కోర్టు కేసులు ఉండడం, అటవీ భూములకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడం, నేషనల్ హైవే, రైల్వే లైన్లనుంచి కాల్వల తవ్వకానికి అనుమతులు లేకపోవడం వంటి కారణాలను చూపిస్తూ పలు ప్రాజెక్టుల్లో పనులను నిలిపి వేశారు. దీంతో పనులు 90 శాతం పూర్తయినా...నీటిని సరఫరా చేయడం సాధ్యం కావడం లేదు. కాగా మంత్రితో భేటీ అనంతరం అధికారులకు ఒక మెమో రూపంలో కొన్ని ఆదేశాలు జారీ అయ్యాయి. చిన్న చిన్న కారణాలతో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులను గుర్తించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా వీటి రద్దుకు వెంటనే సిఫారసు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే మహేంద్ర తనయ ప్రాజెక్టు నిర్మాణ పనులను 61 సెక్షన్ కింద రద్దు చేయాలని నిర్ణయించారు. అయితే రద్దయిన పనులకు మళ్లీ టెండర్లు పిలవాలా? లేక పూర్తిగా రద్దు చేయాలా? అనే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.