పులివెందుల రూరల్ : పట్టణంలోని ఇందిరాగాంధీ ఉన్నతస్థాయి పరిశోధన కేంద్రం(ఐజీకార్ల్)లో ఉన్న పెండింగ్ పనులకు సంబంధించి వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఐజీ కార్ల్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పరిశోధన భవనాలు, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు.
పెండింగ్‌లో ఉన్న అడ్వాన్స్ బయో సెక్యూరిటీ ల్యాబ్(ఏబీఎస్‌ఎల్-3), బయో సెప్టిల్యాబ్, పశువుల పరిశోధన కేంద్రంలోని పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేసి అప్పగించాలని ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ సుబ్రమణ్యంను ఆదేశించారు. బీఎస్‌ఎల్-3, ఏబీఎస్‌ఎల్ ల్యాబ్‌ల పైభాగంలో యంత్రాలు, గాలీవాన, ఎండకు మరమ్మత్తులకు గురయ్యే అవకాశం ఉన్నందున వెంటనే టార్పాలిన్ పట్టతో కప్పి వేయాలని సూచించారు. ఐజీ కార్ల్‌లో తాగు, ల్యాబ్‌లకు అవసరమైన నీటి లభ్యతపై చర్చించారు. కేంద్రంలో ఉన్న బోర్ల మరమ్మతులు, విద్యుత్‌కు సంబంధించి 100కిలో వాట్లకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
దొడ్ల పాల డెయిరీ పరిశీలన :
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాలతో జీవీసీ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న దొడ్ల పాల డెయిరీని మన్మోహన్ సింగ్ పరిశీలించారు. దేశంలో రాజస్థాన్ తర్వాత పులివెందులలో ఏర్పాటు చేసిన సెంటర్ ఫివోట్ ఇరిగేషన్ సిస్టం అమలుపై దొడ్ల డెయిరీ ఎండీ సునీల్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విదేశాలనుంచి తెప్పించిన అధునాతన యంత్రాలు, గడ్డి నిల్వ చేసే కేంద్రాలు, ఆవుల కోసం ఏర్పాటు చేసిన షెడ్డును పరిశీలించారు.
కార్యక్రమంలో తిరుపతి ఎస్‌వీ యూనివర్శిటీ డీన్ చంద్రశేఖరరావు, జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ వెంకట్రావు, ఏపీఐఐసీ డీజీఎం సుబ్రమణ్యం, జినోమిక్స్ బయోటెక్‌సీవో, ఎన్‌ఆర్‌ఐ పోలవరపు రత్నగిరి, ఏపీడీడీసీ డీడీ శ్రీనివాసులు, ఐజీ కార్ల్ డిప్యూటీ సీఈవో కేడీ ప్రసాద్, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి డీడీ మదన్‌మోహన్, పశుసంవర్థక శాఖ ఏడీ శ్రీనివాసులరెడ్డి, ఐవీఆర్‌సీఎల్ సెట్ ఇన్‌ఛార్జి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
త్వరలో నూతన పశువైద్య కళాశాల ప్రారంభం
ప్రొద్దుటూరు: నూతనంగా నిర్మించిన ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలను వీలైనంత త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పశుసంవర్ధకశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం స్థానిక పశువైద్య కళాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పరిశ్రమాభివృద్ధికి రూ.200కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.
పెండింగ్ పనులపై ప్రతిపాదనలు
Published Fri, Nov 28 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM
Advertisement