నిధులు ఫుల్.. పనులు నిల్
- 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.11.89 కోట్లు విడుదల
- 13వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.35 కోట్ల పనులు పెండింగ్
- నిధుల విడుదలకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ మెలిక పెట్టిన ప్రభుత్వం
- హడావుడి పనులకు అధికారుల శ్రీకారం
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో విచిత్ర పరిస్థితి నెలకొంది. నిధులు వరదలా వస్తుంటే పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.11.89 కోట్లు నగరపాలక సంస్థకు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 13వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్‌ను అందిస్తేనే 14 ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తామని మెలిక పెట్టింది. దీంతో పాలకులు, అధికారుల్లో హైరానా మొదలైంది. పెండింగ్ పనుల్ని యుద్ధప్రాతిపదికన నిర్వహించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. 13వ ఆర్థిక సంఘం కింద 2009-10 నుంచి 2014-15 మధ్య కాలానికి కార్పొరేషన్‌కు రూ.61 కోట్లు విడుదలయ్యాయి.
ఇందులో రూ.26 కోట్ల మేర మాత్రమే పనులు జరిగాయి. రూ.35 కోట్ల పనులు జరగాల్సి ఉంది. కొన్ని పనులైతే టెండర్ల దశ దాటలేదు. గంగిరెద్దుల దిబ్బ పటమట ప్రాంతానికి కృష్ణా జలాలను తరలించేందుకు పైప్‌లైన్ పనులకు రూ.9 కోట్లు కేటాయించారు. సర్కిల్-2లో రూ.3.50 కోట్లతో, వన్‌టౌన్ ప్రాంతంలో రూ.9 కోట్లతో సంప్ నిర్మాణ పనుల్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. వర్క్ ఆర్డర్ ఇచ్చారు. పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
నాణ్యతపై అనుమానాలు
14వ ఆర్థిక సంఘం నిధుల్ని అందిపుచ్చుకొనేందుకు అధికారులు మాస్టర్‌ప్లాన్ వేశారు. 13వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన పనుల్ని ప్రారంభించడంతో పాటు నిధుల వినియోగానికి సంబంధించి ఖర్చును చూపేందుకు సిద్ధమవుతున్నారు. చేపట్టిన పనుల్ని రెండు, మూడు నెలల వ్యవధిలో పూర్తిచేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హడావిడి పనుల వల్ల నాణ్యతా ప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వన్‌టౌన్‌లో స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్, వివిధ గ్రాంట్లతో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత సన్నగిల్లిందన్న విమర్శలు ఉన్నాయి. వన్‌టౌన్ ప్రాంతంలో పర్యటన సందర్భంగా మేయర్ కోనేరు శ్రీధర్ ఈ విషయాన్ని ధృవీకరించారు. పనుల్లో నాణ్యత ఉన్నట్లు ముగ్గురు స్థానికులు ధృవీకరిస్తేనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అధికారులు హడావిడిగా చేసే పనుల్లో నాణ్యత ఎంతమేర ఉంటుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఆడిట్‌పై దృష్టి
ఇంజనీరింగ్ విభాగం పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలున్నాయి. రూ.50 లక్షలు దాటిన వ ర్క్స్‌పై సూపరింటెండెంట్ ఇంజనీర్, ఆలోపు అయితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయిలో చెక్ మెజర్‌మెంట్స్ ఇవ్వాలి. కానీ అలా జరగడం లేదు. ఎం(మెజర్‌మెంట్) బుక్స్‌ను తప్పనిసరిగా మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. నగరపాలక సంస్థలో అత్యధిక శాతం పనులకు సంబంధించి ఎంబుక్స్ లేవని సమాచారం. 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులపై సాధ్యమైనంత త్వరలో ఆడిట్ పూర్తి చేసి 14వ ఆర్థిక సంఘం నిధుల్ని అందిపుచ్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు.