అర్హులెందరున్నా.. ఒక్కరికే పింఛన్!
- బీడీ కార్మికుల‘ఆసరా’కు మార్గదర్శకాలు సిద్ధం
- రాష్ట్రంలో 4 లక్షలమంది బీడీ కార్మికులున్నట్లు గుర్తింపు
- రెండ్రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఒక కుటుం బంలో బీడీ కార్మికులు ఎంతమంది ఉన్నప్పటికీ ఆ కుటుంబంలో ఒక్కరికే పింఛన్‌ను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సామాజిక భద్రతా పింఛన్ల పథకం ‘ఆసరా’ను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీడీ కార్మికులకు కూడా వర్తింప చేయనున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే రూపొం దించిన సర్కారు రెండ్రోజుల్లో ఉత్తర్వులను కూడా జారీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 4,74,438 మంది బీడీ కార్మికులున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. వీరిలో 46,578మంది ఇప్పటికే ‘ఆసరా’ పింఛన్ పొందుతున్నారని, ఎటువంటి పింఛన్ పొందని వారు 4,27,860 మంది ఉన్నారని సమాచారం.
మార్గదర్శకాలు ఇలా..!
తాజా మార్గ్గదర్శకాల మేరకు ఒక కుటుంబంలో బీడీ కార్మికులు ఎంతమంది ఉన్నప్పటికీ ఒక్కరికే పింఛన్ అందించాలని నిర్ణయించారు.
సదరు కార్మికుడు/కార్మికురాలికి ఇప్పటికే ఏదేని పింఛన్ (వృద్ధాప్య, వితంతు, వికలాంగ..తదితర) అందుతున్నట్లైతే అతను/ఆమెకు కొత్తగా మరో పింఛన్ ఇవ్వరు.
అయితే.. బీడీ కార్మిక కుటుంబంలో కార్మికులు కానివారు ఆసరా పింఛన్ (వృద్ధాప్య, వితంతు, వికలాంగ..తదితర) పొందుతున్నప్పటికీ బీడీ కార్మికుడు/కార్మికురాలికి కొత్తగా పింఛన్‌ను మంజూరు చేస్తారు.
18ఏళ్లు నిండిన బీడీ కార్మికులు పింఛన్ పొందేందుకు అర్హులు. వారి కుటుంబ వార్షికాదాయం రూ.రెండు లక్షలకు మించకూడదు.
కార్మికుడు / కార్మికురాలు బీడీల తయారీకి అవసరమైన ముడిసరకును లెసైన్స్‌డ్ కాంట్రాక్టరు వద్ద నుంచి కొనుగోలు చేస్తున్న వారై ఉండాలి.