పింఛన్ల లబ్ధిదారుల ఎంపికలో పేదలకు అన్యాయం చేయొద్దు
గూడూరు రూరల్ : పింఛన్ల ఎంపికలో టీడీపీ ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదని గూడూరు, సూళ్లూరుపేట, బద్వేలు ఎమ్మెల్యేలు పాశం సునీల్‌కుమార్, కిలివేటి సంజీవయ్య, జయరాములు హెచ్చరించారు. శుక్రవారం గూడూరులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడారు. పాశం మాట్లాడుతూ రాజకీయాలు పక్కనపెట్టి 65 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేయాలన్నారు. వికలాంగులందరికీ శాతం పేరిట పింఛన్ల మొత్తంలో కోత విధించడం సరికాదన్నారు. రేషన్ కార్డుల్లో వయస్సు తప్పుగా ఉందని, వాటిని సరిచేసి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందేలా చూడాల్సిన బాధ్యత కమిటీ సభ్యులపై ఉందన్నారు. డిసెంబరు వరకు రుణమాఫీని వాయిదా వేయడం చూస్తే రుణమాఫీ అమలయ్యే పరిస్థితి లేదన్నారు. బెల్టు షాపులు నియంత్రిస్తామని చెప్పినా గూడూరు నుంచి నెల్లూరు వరకు డాబాల్లో మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారన్నారు. పార్టీలు మారే సంస్కృతి తమది కాదన్నారు. సంజీవయ్య మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించకుండా టీడీపీ 100 రోజుల పాలనపై సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పింఛన్ లబ్ధిదారుల ఏరివేత మొదలు పెట్టి టీడీపీ కార్యకర్తలకు ఇచ్చేలా ఆదేశాలు రావడం సిగ్గు చేటన్నారు. కమిటీలో అన్ని పార్టీల వారిని సభ్యులుగా నియమించి ఉంటే బాగుండేదన్నారు. జయరాములు మాట్లాడుతూ టీడీపీ ప్రజల ఆదరణ కోల్పోతోందన్నారు. రాష్ట్రంలో 48,11,385 మందికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పింఛన్లు అందించారన్నారు. బడ్జెట్‌లో పింఛన్లకు కోత విధించడాన్ని తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించినా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం జీఓ నంబరు 135ను తీసుకువచ్చి గ్రామాల్లో ప్రజల మధ్య కక్షలు పెంచుతుందన్నారు.