రౌడీషీటర్ జన్మదిన వేడుకల్లో గూడూరు ఎమ్మెల్యే
మూడు హత్య కేసులున్న వ్యక్తికి కేక్ తినిపించిన పాశం సునీల్‌కుమార్
రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న వైనం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ‘అరాచకాలు సృష్టించడం.. రౌడీయిజం చేయడం.. దందాలకు పాల్పడటం లాంటివి చేస్తే ఎవరినైనా, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు’ గత ఎన్నికల ప్రచారంలో గూడూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్‌కుమార్ చెప్పిన మాటలు ఇవి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే సునీల్‌కుమార్ వాటన్నిటినీ పక్కన పెట్టేశారు. లోకేశ్ చెప్పిన విధంగా ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటాయో వారికే తమ పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
గత వారం గూడూరుకు చెందిన రౌడీషీటర్ కనుపూరు శ్రీహరి (జెమిని) పుట్టిన రోజు వేడుకల్లో ఎమ్మెల్యే సునీల్‌కుమార్ పాల్గొన్నారు. అతడికి కేక్ తినిపించి మరీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. జెమిని పట్టణంలో దందాలు చేస్తూ రౌడీషీటర్‌గా ఉన్నాడు. అతడిపై ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మూడు మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే రౌడీషీటర్లను పెంచి పోషించేలా వారి పుట్టిన రోజు వేడుకలకు హాజరు కావడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.
మనవాళ్లే వదిలేయండి!
గూడూరు నియోజకవర్గంలో అధికారం చేట్టిన రోజు నుంచి రౌడీలతోనే పాలన కొనసాగించేలా సంకేతాలు ఇస్తున్న ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ గ్రావెల్, మట్టి, ఇసుక తరలింపులను నేరుగా ప్రోత్సహిస్తూ కమీషన్ల రూపంలో రూ.లక్షలు దండుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రౌడీషీటర్ల ద్వారా గంజాయి, పేకాట, జూదం (డైమండ్ డబ్బా) ఆటలు నిర్వహిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. ఎక్కడైనా పట్టబడితే పోలీసులకు ‘మన వారే వదిలేయండి’ అని ఆదేశాలు ఇస్తున్నట్టు పబ్లిక్ టాక్. ఈ క్రమంలోనే పట్టణంలోని పాత నేరస్తులను చేరదీసి వారికి ఏరియాలను అప్పగించినట్టు సమాచారం. దీంతో వారు ఆడిన ఆటకు అటు పోలీసులు కూడా అడ్డు చెప్పడం లేదు.
ఆ విషయం తెలియదు
జెమినిపై ఉన్న కేసుల విషయమై పట్టణ ఎస్‌ఐ, సీఐలను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. తాము వారం క్రితమే బదిలీల్లో భాగంగా వచ్చామని చెప్పారు. ఎవరిపై రౌడీషీట్లు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయనే విషయాలపై ఇంకా దృష్టి పెట్టలేదని సమాధానం దాటవేశారు.
Comments
Please login to add a commentAdd a comment