పింఛన్లు స్వాహా ! | Pensions corruption in Komarada | Sakshi
Sakshi News home page

పింఛన్లు స్వాహా !

Published Thu, May 12 2016 12:31 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

Pensions corruption in Komarada

పింఛన్ లబ్ధిదారులు చనిపోతే ఆయన పండగ చేసుకుంటాడు. వారి మరణాన్ని రికార్డుల్లో నమోదు చేయడు. సర్కారు వారికి అందించే మొత్తాలను ఎంచక్కా సొంతానికి వాడుకుంటాడు. ఒకటికాదు.. రెండు కాదు... గడచిన మూడేళ్లుగా ఈయన స్వాహా పర్వం కొనసాగుతున్నా... ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఓ అధికార పార్టీ నాయకుడి అండ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలి సామాజిక తనిఖీ బృందం పరిశీలనలో వెల్లడైన అంశాలు వింటే ఎవరికైనా మైండ్‌బ్లాంక్ అవుతుంది.
 
 కొమరాడ: మండలంలోని విక్రమపురానికి చెందిన వీఆర్‌ఓ ధనుంజయరావు ఆయన పరిధిలోని గ్రామాల్లో మృతి చెందిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు వస్తున్న పింఛన్ మొత్తాలను ఎంచక్కా భోంచేస్తున్నాడు. బతికున్నవారికి కూడా మంజూరవుతున్న పింఛన్లు చెల్లించకుండా సొంతానికి వాడుకుంటున్నాడు. ఎన్నో నెలలుగా ఈ తతంగం జరుగుతున్నా... గడచిన కొద్దిరోజులుగా చేపట్టిన సామాజిక తనిఖీల్లో ఈ భాగోతం వెలుగు చూసింది. దీనిపై బుధవారం విక్రమపురంలో నిర్వహించిన గ్రామసభలో మరికొందరు లబ్ధిదారులు వాస్తవాలు వెల్లడించి... తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
 
 మరణించినవారి మొత్తాలు స్వాహా...
 నందాపురం గ్రామానికి చెందిన కొండగొర్రి చిన్నమ్మి మూడేళ్ల క్రితమే మరణించింది. ఆమెకు రావాల్సిన వృద్ధాప్య పింఛన్ 39 నెలలకు సంబంధించి రూ. 21వేలు వీఆర్‌ఓ కాజేశారు. గాదపు అప్పలస్వామి మృతి చెంది ఎనిమిది నెలలు కావస్తున్నప్పటికీ ఆయన పేరున వస్తున్న పింఛన్ రూ.8వేలు తినేశారు. సురగాపు చిన్నంనాయుడు మృతిచెంది మూడు నెలలు కావస్తున్నా ఆయన పేరున వస్తున్న పింఛన్ డ్రా చేసేస్తున్నారు.
 
 బతికున్నవారి మొత్తాలు మాయం
 రాముద్ర గుంపమ్మ వితంతువు అయినప్పటికీ ఆమెకు ఇవ్వకుండా ఐదునెలల పింఛన్ తినేశారు. బొమ్మాన విశ్వనాధం వృద్ధాప్య పింఛన్ నాలుగునెలలుగా ఇవ్వడంలేదు. సారికి సింహాచలం వృద్ధాప్య పింఛన్ మార్చి నెలకు సంబంధించి ఇవ్వలేదు. సురగాపు సోములు వృద్ధాప్య పింఛన్ ఇవ్వలేదు. పిచ్చుక శాంతారావుకు చేనేత పింఛన్ మార్చినెలది, సైలాడ సూరినాయుడు వృద్ధాప్య పింఛన్ రెండు నెలలకు ఇవ్వలేదు. బాధితులు గ్రామసభకు వచ్చి అధికారులకు ఈ విషయాన్ని స్వయంగా వచ్చి చెప్పారు.
 
 తక్షణమే తమకు పింఛన్లను అందించి భవిష్యత్‌లో ఇటువంటి తప్పిదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కాగా ఈయనకు స్థానిక అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నందువల్లే ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.  దీనిపై ఎంపీడీఓ కె.విజయలక్ష్మి సాక్షితో మాట్లాడుతూ స్వాహా చేసిన మొత్తాలను ముందస్తుగా రికవరీ చేసి అనంతరం ఆయనపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement