అటకెక్కిన స్మార్ట్‌కార్డుల వ్యవస్థ
Published Sun, Aug 25 2013 5:19 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
జైపూర్, న్యూస్‌లైన్ : పింఛన్లు, ఉపాధి కూలీల వేతనాల పంపిణీలో అవినీతి, అక్రమాలను అరికట్టి నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్‌కార్డుల వ్యవస్థ అటకెక్కింది. స్మార్ట్‌కార్డులు, టెర్మినల్ యంత్రాలు మూలనపడ్డాయి. పంపిణీ కోసం నియమించిన సీఎస్‌పీలను తొలగించడంతో ఈ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఈ వ్యవస్థ ప్రవేశపెట్టినప్పటి నుంచీ ప్రభుత్వం ఆచరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ దుస్థితి నెలకొందన్న ఆరోపణలున్నాయి. సీఎస్‌పీల శిక్షణ, టర్మినల్ యంత్రాలు, స్మార్డుల కోసం వెచ్చించిన లక్షలాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరైంది. జిల్లాలో 866 మంది సీఎస్‌పీలను నియమించాల్సి ఉండగా పూర్తి స్థాయిలో నియమించలేదు.
మండలంలో 24 మందికి గాను తొమ్మిది మందినే విధుల్లోకి తీసుకుని పనులు చేయించారు. వారికి టర్మినల్ యంత్రాలు అందజేసి పింఛన్ లబ్ధిదారులు, ఉపాధి హామీ పథకం కూలీలకు స్మార్ట్‌కార్డులు ఇచ్చారు. కార్డులు ఆలస్యంగా రావడంతో కొన్ని మండలాల్లో పంపిణీకి నోచుకోలేదు. స్మార్ట్‌కార్డుల వ్యవస్థ అటకెక్కడంతో మళ్లీ గ్రామ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది పింఛన్లు పంపిణీ చేస్తుండగా, ఉపాధి వేతనాలు పోస్టాఫీసుల ద్వారా అందజేస్తున్నారు. ఫలితంగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకోవడంతో లబ్ధిదారులు నష్టపోతున్నారు. మండలంలోని మద్దికల్, భీమారం గ్రామాల్లో గత నెలలో పంచాయతీ సిబ్బంది పింఛన్లు స్వాహా చేశారు. 50శాతం కంటే ఎక్కువగా పంపిణీకి నోచుకోలేదు.
బాధితుల ఫిర్యాదు మేరకు అధికారులు సిబ్బంది నుంచి పింఛన్ డబ్బులు రికవరీ చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాగా, స్మార్ట్‌కార్డులతో ఉపాధి కూలీలకు వేతనాలు, సామాజిక పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నియమించిన సీఎస్పీలను రెండేళ్లు గడవక ముందే తొలగించడంతో ఉపాధి కోల్పోయారు. విధులు నిర్వర్తించిన రెండేళ్ల కాలానికి వేతనాలు కూడా అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
ఉపాధి కూలి పంపిణీ అస్తవ్యస్తం
సీఎస్పీల తొలగింపుతో ఉపాధి కూలి పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. డబ్బులను సీఎస్పీలు బ్యాంకు ఖాతాల్లో నుంచి డ్రా చేసుకున్న అనంతరం తొలగించడంతో పంపిణీ నిలిచిపోయింది. తమను విధుల్లోకి తీసుకుంటేనే వేతనాలు పంపిణీ చేస్తామని డిమాండ్ చేస్తుండడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. కేసులు నమోదు చేయిస్తామని అధికారులు హెచ్చరించడంతో కొంతమంది వేతనాలు పంపిణీ చేయగా.. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో అందలేదు. మండలంలోని కొత్తపెల్లి గ్రామంలో ఇప్పటికీ వేతనాలను సీఎస్పీ పంపిణీ చేయకపోవడం గమనార్హం.
విధుల్లోకి తీసుకోవాలి
ప్రభుత్వం మాకు తీరని అన్యాయం చేసింది. సీఎస్పీలుగా నియమించి రెండేళ్లు తిరుగకముందే తొలగించింది. మేము విధులు నిర్వర్తించినప్పటికి ఒక రూపాయి కూడా వేతనాలు చెల్లించలేదు. మళ్లీ విధుల్లోకి తీసుకొని ఉపాధి కల్పించాలి. మాకు రావాల్సిన వేతనాలు, కమీషన్లు వెంటనే విడుదల చేసి న్యాయం చేయాలి.
- ఎం.సునీత, సీఎస్పీ, జైపూర్
Advertisement
Advertisement