ఇక ‘బాబు’ మార్కు పింఛన్లు | Pensions granted by Rachabanda, Andhra Pradesh Government Decision | Sakshi
Sakshi News home page

ఇక ‘బాబు’ మార్కు పింఛన్లు

Published Wed, Aug 21 2013 2:45 AM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM

ఇక ‘బాబు’ మార్కు పింఛన్లు - Sakshi

ఇక ‘బాబు’ మార్కు పింఛన్లు

* లబ్ధిదారుడు మరణిస్తేనే కొత్తవారికి పెన్షన్
* వితంతు, వికలాంగుల పెన్షన్‌లపై ప్రభుత్వం నిర్ణయం
* టీడీపీ ప్రభుత్వం నాటి విధానాన్ని ప్రవేశపెట్టిన సర్కారు
* వృద్ధులు, గీత కార్మికులకు మొండిచేయి
* అర్హులని తేలినా పింఛన్ల మంజూరుకు నో
* రచ్చబండ ఎప్పుడు నిర్వహిస్తే అప్పుడే ఇవ్వాలని నిర్ణయం
* ఇప్పటికే 7 లక్షల మందిని అర్హులుగా తేల్చిన ప్రభుత్వం
 
సాక్షి, హైదరాబాద్: వితంతు, వికలాంగుల పెన్షనర్లు ఎవరైనా మరణిస్తే తప్ప మరొకరికి అవకాశం ఇవ్వడానికి వీల్లేదని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పింఛన్లు తీసుకుంటున్న వారిలో ఖాళీలు ఏర్పడిన పక్షంలోనే కొత్తవారికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్లు ఖాళీలు ఏర్పడితేనే కొత్త పింఛన్లు ఇవ్వాలనేది తెలుగుదేశం ప్రభుత్వ విధానం. ఇప్పుడు అదే పద్ధతిని అనుసరించాలని కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు నిర్ణయించడం గమనార్హం.

వితంతు, వికలాంగుల పెన్షన్లను.. ఖాళీలు ఏర్పడిన తర్వాతే అర్హులైన వారితో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్న సర్కారు.. వృద్ధులు, గీత కార్మికులను పూర్తిగా విస్మరించింది. వీరిలో కొత్తగా పెన్షన్లకు అర్హులని తేలినా వారికి వెంటనే ఇవ్వడానికి వీల్లేదని, ప్రభుత్వం రచ్చబండ ఎప్పుడు నిర్వహిస్తే అప్పుడు మాత్రమే పంపిణీ చేయాలని అప్పటి వరకు చెల్లించవద్దని నిర్ణయం తీసుకున్నారు. 2011 డిసెంబర్ తర్వాత మళ్లీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించలేదు.

ఇప్పటికే దాదాపు ఏడు లక్షల మందిని పింఛన్లకు అర్హులని తేల్చిన ప్రభుత్వం.. వాటిని మంజూరు చేయకుండా అట్టిపెట్టుకుంది. ఇలా అర్హులని తేలిన వారిలోనూ రెండేళ్ల కాలంలో ఎంతమంది మరణించారన్న సమాచారం కూడా ప్రభుత్వం దగ్గర లేదు. వాస్తవంగా వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వారిలో ఏటా దాదాపు 20 వేలకుపైగా లబ్ధిదారులు మరణిస్తున్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. 42 లక్షల మంది వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయాల్సి ఉంటే.. రెండేళ్లుగా ఏర్పడిన ఖాళీలే దాదాపు ఎనిమిది లక్షల వరకు ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మొత్తం 76 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు చెబుతున్నా.. అందులో నాలుగున్నర లక్షలు వైఎస్సార్ అభయహస్తం పెన్షన్లే ఉన్నాయి. వైఎస్సార్ అభయహస్తంలో మహిళలు కూడా తమ వంతు వాటా చెల్లించారు. వైఎస్ ముఖ్యమంత్రి అయినప్పుడు కేవలం 18 లక్షలు మాత్రమే పెన్షన్లు ఉంటే.. అర్హులైన అందరికీ పెన్షన్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ సంఖ్యను ఏకంగా 71 లక్షలకు చేర్చారు. అంతేకాదు వీరందరికీ ప్రతినెలా ఒకటో తేదీనే పెన్షన్ చేతికందేలా కృషి చేశారు. ఇప్పుడు ప్రభుత్వ తాజా విధానంతో గ్రామంలో పెన్షన్  లబ్ధిదారుడు చనిపోయిన  తర్వాతే ఆ గ్రామంలో మరొకరికి అవకాశం లభిస్తుందన్నమాట!
 
మీ-సేవ కేంద్రాలుగా గ్రామ సమాఖ్యలు!
గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలోని గ్రామ సమాఖ్య కార్యాలయాలను మీ-సేవ కేంద్రాలుగా మార్చే ప్రతిపాదనను పరిశీలించడానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి.భాస్కర్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో సభ్య కార్యదర్శిగా గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, సభ్యులుగా సాంఘిక సంక్షేమ శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శులు ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement