జనమటు.. నేతలిటు
ఖమ్మం జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాల్లో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: ప్రజలు ఒక రాష్ట్రంలో, వాళ్లు ఎన్నుకునే ప్రజాప్రతినిధులు మాత్రం మరో రాష్ట్రంలో ఉంటారా? తెలంగాణలోని పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాలన్న కేంద్రం నిర్ణయం ఈ విచిత్ర సమస్యకు కారణమవుతోంది. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర మంత్రివర్గం తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలకు, పరిష్కార మార్గం చూపుతున్నామంటూ కొత్త సమస్యను సృష్టిస్తున్న వైనానికిఈ ఉదంతమే ప్రత్యక్ష నిదర్శనం. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ముంపునకు గురయ్యే 134 గ్రామాలు, వాటి పరిధిలోని హామ్లెట్లతో పాటు మొత్తం 205 జనావాసాలను సీమాంధ్రకు బదలాయించాలని కేంద్రం శుక్రవారం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఇవన్నీ ప్రస్తుతం తెలంగాణలోని పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్నాయి. ఈ మూడు ఎస్టీ సీట్లలో పినపాక, భద్రాచలమేమో మహబూబాబాద్ లోక్‌సభ స్థానంలోకి, అశ్వారావుపేటేమో ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తాయి. నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు ఉండబోదని విభజన బిల్లులో పేర్కొన్నారు. రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతమున్న నియోజకవర్గాలే యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. అంటే ఆ మూడు అసెంబ్లీ స్థానాల్లోని పలు గ్రామాలను సీమాంధ్రకు బదలాయిస్తున్నా, ఆయా నియోజకవర్గాలు మాత్రం తెలంగాణలోనే ఉంటాయని పేర్కొన్నారు.
ఆ లెక్కన ఎన్నికల్లోపే విభజన పూర్తయితే ఆయా గ్రామాలు, అక్కడి ప్రజలేమో సీమాంధ్ర రాష్ట్రానికి చెందుతారు. కానీ వాళ్లు ఓట్లేసి గెలిపించాల్సిందేమో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలను, ఎంపీలను! అంటే వారి ఓట్లతో గెలిచే ప్రజాప్రతినిధులు వారికి మాత్రం ప్రాతినిథ్యం వహించబోరన్నమాట!! అలాంటి పరిస్థితిలో... రేపటి రోజున ఆయా గ్రామాల వారికి సమస్యలొస్తే పరిష్కారం కోసం ఎవరిని సంప్రదించాలి? ఏ ప్రభుత్వాన్ని అడగాలి? ఒక రాష్ట్రంలోని అధికారులను వేరే రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు పురమాయించి పనులు చేయించే పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా? కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయం మున్ముందు ఇంతటి గందరగోళానికి దారితీయనుంది. ఆ గ్రామాల ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. అంతేగాక ఏ ప్రాంతం కూడా ప్రజాప్రతినిధులు లేకుండా ఉండటానికి వీల్లేదన్న ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనలకు కూడా ఇది విరుద్ధమన్న అభిప్రాయముంది.
జీవోఎం సిఫార్సుల మేరకు సవరించి ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014 ఏ ప్రాంతానికీ సంతృప్తి మిగల్చకపోగా, తొందరపాటు నిర్ణయాలతో ఇలాంటి కొత్త వివాదాలకు కారణమవుతోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు సీమాంధ్రలో, దాని ముంపు ప్రాంతం తెలంగాణలో ఉండటం విభజన అనంతరం పరిష్కరించలేని అంతర్రాష్ట్ర వివాదంగా మారవచ్చన్న అభిప్రాయం వ్యక్తం కావడం, ముంపు ప్రాంతాలనూ సీమాంధ్రలోనే కలపాలన్న డిమాండ్ తెరపైకి రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో భద్రాచలం మినహా ఆ రెవెన్యూ డివిజన్‌లోని 98 గ్రామాలనూ సీమాంధ్రకు కలుపుతున్నారు. పాల్వంచ డివిజన్ పరిధిలోకి వచ్చే పినపాక, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాల్లోని 36 గ్రామాలను కూడా సీమాంధ్రలో చేరుస్తున్నారు.
రంపచోడవరం అసెంబ్లీ, అరకు లోక్‌సభ
ఎన్నికలయ్యాక ముంపు గ్రామాలు కలిసేది వీటిలోనే
పోలవరం ముంపు గ్రామాలను సార్వత్రిక ఎన్నికల తర్వాత సీమాంధ్ర రాష్ట్రంలోని రంపచోడవరం అసెంబ్లీ, అరకు లోక్‌సభ స్థానాల పరిధిలో చేర్చనున్నారు. కేంద్ర హోం శాఖ వర్గాలను ‘సాక్షి’ సంప్రదించగా ఈ మేరకు వివరణ ఇచ్చాయి. వేలేరుపాడు, కుకునూరు, బూర్గంపాడు, భద్రాచలం, కూనవరం, చింతూరు, వరరామచంద్రపురం మండలాల్లోని ముంపు ఓటర్లను 2019 ఎన్నికల నాటికి రంపచోడవరం అసెంబ్లీ, అరకు లోక్‌సభ స్థానాల పరిధిలోకి తీసుకురానున్నట్టు తెలిపాయి. పార్లమెంటుకు సమర్పించే విభజన బిల్లులో ఈ మేరకు ప్రత్యేకంగా క్లాజును ఏర్పాటు చేయనున్నారు. అయితే రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ గ్రామాల్లోని ప్రజలు తెలంగాణలోని భద్రాచలం, పినపాక, అశ్వరావుపేట అసెంబ్లీ స్థానాల్లో.. మహబూబాబాద్, ఖమ్మం లోక్‌సభ స్థానాల్లోనే ఓటు వేయనున్నారు. ఈ మేరకు బిల్లులో ప్రతిపాదనలను పొందుపరచి పార్లమెంటు ఆమోదం తీసుకోనున్నారు.