ఎవడబ్బ సొమ్మని మీ వాళ్లకే ప్లాట్లు ఇప్పిస్తారు? | People Fire On TDP MLA Damacharla Jnardhanrao | Sakshi
Sakshi News home page

ఎవడబ్బ సొమ్మని మీ వాళ్లకే ప్లాట్లు ఇప్పిస్తారు?

Published Thu, Mar 14 2019 10:37 AM | Last Updated on Thu, Mar 14 2019 10:37 AM

People Fire On TDP MLA Damacharla Jnardhanrao - Sakshi

కమిషనర్‌తో వాగ్వాదానికి దిగిన లబ్ధిదారులు

సాక్షి, ఒంగోలు టౌన్‌: ‘గతంలో జరిగిన ఎన్నికల్లో మేమంతా ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా గెలిచాడు. ఐదేళ్లపాటు మమ్మల్ని పట్టించుకోలేదు. చివరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇళ్లను కూడా పేదలమైన మాకు రాకుండా చేశాడు. ఎవడబ్బ సొమ్మని మీ పార్టీ వాళ్లకే ఇప్పిస్తారు. మేము మనుషులం కాదా? మీకు ఓట్లు వేసి గెలిపించలేదా? మమ్మల్ని ఇంత దారుణంగా మోసగిస్తారా? అంటూ ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్‌రావు తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలోని ప్రజలకు జీ ప్లస్‌ త్రీ కింద ఇళ్లు నిర్మిస్తామంటూ లబ్ధిదారుల నుంచి నగర పాలక సంస్థ డీడీల రూపంలో డబ్బులు కట్టించుకొంది. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో దామచర్ల జనార్ధన్‌రావు హడావుడిగా ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ నిర్వహించాలని నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు.

అయితే ఎక్కువ శాతం ప్లాట్లు తెలుగుదేశం పార్టీ అనుయాయులకే దక్కాయి. లబ్ధిదారులకు సంబంధించిన జాబితాను ఆ పార్టీ డివిజన్‌ అధ్యక్షులు తీసుకొని తమ పార్టీకి అనుకూలమైన వారికే ప్లాట్లు వచ్చేలా చేశారు. అయితే దీనికి మాత్రం ప్రజల సమక్షంలో లాటరీ వేసి ప్లాట్లు కేటాయిస్తామంటూ ప్రకటించారు. దాంతో పెద్ద సంఖ్యలో ప్రజలు నగర పాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. 14,656 ప్లాట్లకు సంబంధించి రూ.500, రూ.12,500, రూ.25 వేల చొప్పున లబ్ధిదారులను ఎంపికచేసి వారి నుంచి వాటా ధనాన్ని కట్టించుకున్నారు. అయితే స్థల సమస్యను సాకుగా చూపించి కేవలం 4512 మందిని మాత్రమే లబ్ధిదారులుగా గుర్తించారు. అయితే ప్లాట్ల కేటాయింపునకు సంబంధించి లాటరీ ప్రక్రియ చేపట్టినప్పటికీ ఆ 4512 మంది లబ్ధిదారులను ప్రకటించలేదు.

ఉదయం నుంచి రాత్రి వరకు లబ్ధిదారులచే పడిగాపులు కాయించారు. నాలుగు రోజులు గడిచేసరికి ఎన్నికల కోడ్‌ వచ్చి పడింది. ఆ సమయానికే అధికారపార్టీ నాయకులు సూచించిన వారికే ఎక్కువ భాగం ఇళ్ల ప్లాట్లను కేటాయించేశారు. ఆదివారం ఎన్నికల కోడ్‌ వచ్చింది. ఎన్నికల కోడ్‌ కారణంగా లబ్ధిదారుల ప్లాట్ల కేటాయింపుపై నగర పాలక సంస్థ అధికారులు వివరణ ఇవ్వలేదు. దాంతో అంతకు ముందుగా ప్రకటించినట్లుగా సోమవారం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు నగర పాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు రావడంతో బుధవారం రావాలని చెప్పారు. దాంతో బుధవారం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు చేరుకున్నారు. నగర పాలక సంస్థ కమిషనర్‌ చాంబర్‌ నుంచి బయట ఉన్న టౌన్‌ ప్లానింగ్‌ విభాగం వరకు భారీ క్యూ నిలబడింది.

అవాక్కైన కమిషనర్‌
ఉదయం తన చాంబర్‌కు చేరుకున్న కమిషనర్‌ శకుంతల ఆ జనాన్ని చూసి అవాక్కయ్యారు. ఎందుకు ఇంతమంది వచ్చారని తన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అప్పటికే లబ్ధిదారుల్లో సహనం కోల్పోయి ఆగ్రహంతో ఉన్నారు. పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు ఉండటంతో వారిని నియంత్రించలేక పోవడంతో చివరకు పోలీసులను పిలిపించారు. పోలీసులు వచ్చిన తర్వాత నగర పాలక సంస్థ కమిషనర్‌ చాంబర్‌ పక్కన ఉన్న టెడ్‌కో విభాగం నుంచి బలవంతంగా బయటకు పంపించడంతో అప్పటి వరకు కొంతమేర శాంతంగా ఉన్న లబ్ధిదారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొంది.

వెనుదిరిగిన కమిషనర్‌
దామచర్ల జనార్ధన్‌రావు తన పార్టీ వారికే ప్లాట్లు కేటాయించి తమకు అన్యాయం చేశారంటూ బాధితులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తాము మనుషులం కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా వాతావరణం వేడెక్కడంతో వారిని శాంతింపచేసేందుకు కమిషనర్‌ శకుంతల వచ్చారు. డబ్బులు కట్టిన వారందరికీ ప్లాట్లు ఇస్తామని, కొంచెం సమయం పడుతోందని, ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఏమీ చేయలేమంటూ చెప్పడంతో లబ్ధిదారులు రగిలిపోయారు. కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు. దామచర్ల తమకు అన్యాయం చేశారంటూ పలువురు కన్నీటి పర్యంతమైనారు. లబ్ధిదారులంతా ఒకే గొంతుక వినిపించడంతో కమిషనర్‌ సమాధానం చెప్పలేక వెనుదిరిగారు.

నా భర్తను మసీదులో పెట్టారు
నా భర్త మరణించడంతో అద్దె ఇంట్లో ఉంచనీయకపోవడంతో మసీదులో పెట్టారు. చివరిచూపు కూడా సరిగా చూసుకోనీయలేదు. అదే సొంత ఇల్లు ఉంటే ఇంటి వద్దనే కొంతసేపు ఉంచేవారు. ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే పట్టించుకోలేదు. ఓటు అయితే వేయించుకున్నారుగాని ఇళ్లు మాత్రం ఇవ్వలేదు.
– షేక్‌ ఖాదర్‌బీ, కొండమిట్ట

పార్టీ కార్యకర్తలకే ప్లాట్లు
ఏడాది క్రితం ఇంటి కోసం డిపాజిట్‌ కట్టాను. అద్దె ఇళ్లల్లో బాడుగలు చెల్లించలేక ఎప్పుడు ఇళ్లు ఇస్తారా అని ఎదురు చూశాను. ప్లాట్ల కేటా యింపు లాటరీకి ప్రతిరోజూ ఇక్కడకు వచ్చాను. ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్నప్పటికీ ప్లాటు రాలేదు. టీడీపీ కార్యకర్తలకే ప్లాట్లు కేటాయించారు.
– గొల్లా పావని, సత్యనారాయణపురం

నాలుగు రోజుల నుంచి పసిబిడ్డను వేసుకొని తిరుగుతున్నా
నాలుగు రోజుల నుంచి పసిబిడ్డను చంకేసుకొని తిరుగున్నాను. నా పేరు పిలుస్తారని ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురు చూశాను. కొంతమందికే ప్లాట్లు ఇచ్చారు. నా పేరు రాలేదు. మూడు రోజులు పసిబిడ్డతో ఆటోలో వచ్చాను. నాలుగోరోజు డబ్బులు లేక అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చా.
– ఎం మల్లీశ్వరి

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement