
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగి దాదాపు రెండు వారాలవుతోంది. వివిధ ప్రాంతాల ప్రజలు జననేత ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేమంగా ఉండాలని ప్రార్థనలు చేస్తున్నారు. నిన్నటి దాకా తమ మధ్య తిరిగిన వ్యక్తికేనా ఇటువంటి హాని తలపెట్టింది.. అంటూ కుమిలిపోతున్నారు. నలుగురు గుమికూడిన ప్రతి చోటా ఇదే చర్చ. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన ఇప్పటి వరకు రాష్ట్రంలోని 11 జిల్లాల్లో పాదయాత్ర ముగించుకుని 12వ జిల్లాలో పర్యటిస్తున్నారు.
గత నెల 25న విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం చప్పబుచ్చమ్మ పేట నుంచి పేకపాడు వరకు పాదయాత్ర చేసి హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి వెళ్లారు వైఎస్ జగన్. విమానాశ్రయంలోని హోటల్‌లో పనిచేసే శ్రీనివాసరావు కత్తితో జననేతపై హత్యాయత్నం చేశాడు. ఈ దాడిలో గాయపడిన జగన్ తన భుజం నుంచి రక్తస్రావం అవుతున్నా ధీరోదాత్తునిగా నిలిచి.. తనకు ఏమీ కాలేదని.. ఎవ్వరూ ఆందోళన చెందవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ విమానం ఎక్కారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మంగళవారం నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే..
అయ్యో.. ఆ బాబుకేటి ఇలా జరిగింది? పగస్తుడికైనా పాపం తలపెట్టని బిడ్డపై ఇలా సేత్తారా ఓరైనా.. పానం తీస్తరా. ఓటు కోసం ఇలా పొడిసేయడమేటి?
– విజయనగరం జిల్లా మక్కువ గ్రామానికి చెందిన ఓ అవ్వ ఆందోళన
ఏడుపొచ్చేత్తాంది .. ఆ గుంటడెవడో కత్తితో పొడిసేసిండంట.. బాబు పానానికి పర్వాలేదు కదా.. దేవుడున్నడు. మంచోళ్లకు ఎప్పుడూ మంచే జరుగుద్ది మరి..
– గడివలస గ్రామానికి చెందిన ఓ మహిళ
కుట్రలు పన్ని చంపేయత్నం చేశారు
రాజన్న బిడ్డపై కుట్రలు పన్ని చంపేయత్నం చేశారు. అదృష్టవశాత్తు ఆ బిడ్డ ప్రాణాలతో బయటపడ్డాడు. అదే ఆ కత్తి మెడకు తగిలుంటే అమ్మో.. ఊహించుకుంటేనే భయమేస్తోంది. ఇదంతా టీడీపీ వాళ్ల పనేనని అందరికీ తెలుసు. జగన్ త్వరగా కోలుకుని పాదయాత్ర మొదలెట్టాలని అల్లాను ప్రార్థిస్తున్నా.
– మౌలాన్‌బీ, కడప.
ఇంతకంటే దారుణం ఉంటుందా?
ప్రజలకు మేలు చేయాలని వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న జగన్‌పై హత్యాయత్నం దారుణం. రాష్ట్రానికి మేలు చేసేందుకు ముందుకొచ్చిన ప్రజా నాయకుడికి కూడా ప్రభుత్వం భద్రత కల్పించకపోవడం అన్యాయం. ఇంతకంటే దారుణం ఉంటుందా? దేవుడి దయ వల్లే జగన్ ప్రాణాలతో బయటపడ్డాడు.
– కొమ్ము సావిత్రి, గృహిణి, లక్కవరం.. పశ్చిమగోదావరి జిల్లా
రాజకీయంగా ఎదుర్కోలేకే..
జననేతను అంతమొందించేందుకు యత్నించడాన్ని తట్టుకోలేకపోతున్నా. కన్నీళ్లు ఆగడం లేదు. కుటుంబాన్ని సైతం వదిలి ప్రజల కోసం తపన పడుతున్న నేతను చంపాలనుకోవడం దారుణం. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా మట్టుబెట్టాలని చూడటం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ.
– మారూరి నరేంద్రరెడ్డి, ముప్పాళ్ల మండలం, గుంటూరు జిల్లా
జగన్‌ను కాపాడుకుందాం..
రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. తమను కష్టాల నుంచి గట్టెక్కించే నాయకుడని గుండెల్లో పెట్టుకున్నారు. అలాంటి నాయకుడిపై కక్షగట్టి.. పథకం ప్రకారం హత్యచేసే ప్రయత్నం జరిగింది. పక్కా ప్రణాళికతో తెలుగుదేశం నాయకులు ఈ కుట్ర పన్నారు. ఇప్పుడు దానిని ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జననేతను ప్రజలే కాపాడుకోవాలి. ఆయన సీఎం అయ్యాక అద్భుతమైన పాలన అందిస్తారని జనం నమ్ముతున్నారు.
– ప్రొఫెసర్ కె.రత్నయ్య, ద్రవిడ వర్సిటీ మాజీ వీసీ, తిరుపతి
ఇంతలా దిగజారిపోయాయా?
సింగపూర్, మలేసియా, జపాన్ అన్నీ కలిస్తే ఎలా ఉంటుందో.. రాజధాని అమరావతిని అలా నిర్మిస్తామని బాబుగారు అరచేతిలో స్వర్గం చూపారు. ఆయన మాటలు నమ్మి మా భూములిచ్చాం. నాలుగున్నరేళ్లుగా ఆ భూములు బీడుగానే ఉన్నాయి. ఒక్క ఇటుకా పడింది లేదు. చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఇతర నేతలు దోచుకోవడమే తప్ప మరోటి ఆలోచించడం లేదు. మా కష్టాలు, బాధలు వైఎస్ జగన్‌గారు అర్థం చేసుకున్నారు. అండగా నిలిచారు. ఆయన వస్తేనే.. మాకు న్యాయం జరుగుతుంది. ఆయన పోరుబాట గిట్టని పాలకపార్టీ పెద్దలు కుట్రపన్ని ఆయనను అంతమొందించాలనుకోవడం దారుణం. రాజకీయాలు ఇంతగా దిగజారిపోయినందుకు సిగ్గుపడాల్సి వస్తోంది.
– ఆలూరి శ్రీను, రాజధాని రైతు, మందడం.
ఓర్వలేకనే హత్యాయత్నం
పాదయాత్రతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఎక్కడ చూసినా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది జీర్ణించుకోలేకనే ఆయనను హత్య చేయాలనుకున్నారు. దేవుడి దయ వల్లే ఆయన బతికారు.
– తాతిరెడ్డి, రైతు, మర్తాడు, అనంతపురం జిల్లా
జనం దీవెనలే ఆయనకు శ్రీరామరక్ష
రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిపై జరిగిన ఈ కుట్ర వెనుక కథ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. జనం దీవెనలే ఆయనకు శ్రీరామరక్ష. అవి ఉన్నంత వరకు ఆయనను ఎవరూ ఏమీ చేయలేరు. ఆయన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
– ఎన్.రమేష్‌కుమార్, స్టీల్‌ప్లాంట్ వీఎస్‌ఈయు నాయకుడు
టీవీల్లో చూడగానే గుండె నీరైపోయింది..
జగన్‌పై హత్యాయత్నం చేశారంటూ టీవీల్లో వార్త చూడగానే గుండె నీరైపోయింది. ఆయనకు ఏమవుతుందోనని భయమేసింది. భగవంతుని దయ వల్ల ఆయనకు ప్రాణాపాయం లేదని కుదుటపడ్డా. జగన్ జొన్నల్లంక వచ్చినప్పుడు అగ్నికుల క్షత్రియులంఆయనను కలిశాం. మాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు.
– సందాడి రాజగోపాల్, ఉపాధ్యక్షుడు, అగ్నికుల క్షత్రియ యువజన సేవా సంఘం, తూర్పుగోదావరి జిల్లా
ఆయన ఓపికకు మొక్కాలనిపించింది..
జగన్ ఓపికకు మొక్కాలనిపిస్తోంది. పొద్దుట్నుంచి సాయంత్రం దాకా అలుపూ సొలుపూ లేకుండా నడుస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న మనిషిపై హత్యాయత్నం జరగడం విస్మయం కలిగించింది. పాదయాత్రగా వచ్చినప్పుడు గంటిపెదపూడిలో నాయీ బ్రాహ్మణ సంఘం సభ్యులం కలిసి కష్టాలు చెప్పుకొన్నాం. మా బాధలు ఓపికగా విని న్యాయం చేస్తానన్నారు.
– కాజులూరి రామారావు, గౌరవాధ్యక్షుడు, శ్రీబాలబాలాజీ దేవస్థానం కల్యాణకట్ట నాయీ బ్రాహ్మణ సేవా సంఘం, తూర్పుగోదావరి జిల్లా
ఆ మాటలింకా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయ్..
ప్రజల కోసం పరితపిస్తున్న మనిషిని చంపాలని చూస్తారా? వాళ్లసలు మనుషులేనా.. కుట్రకాకపోతే ఏంటిది? ఆయన మా ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రత్యేకించి మా గనికార్మికుల సమస్యలపై ఇచ్చిన హామీ ఇప్పటికీ మా చెవుల్లో మార్మోగుతూనే ఉంది. క్వారీలకు విద్యుత్‌లో 50 శాతం రాయితీ ఇవ్వడమే కాకుండా.. రాయల్టీ ఫీజును కూడా తగ్గిస్తానన్నాడు రాజన్న బిడ్డ.
– వెంకటేశ్వర్లు, గని కార్మికుడు, కర్నూలు జిల్లా
ప్రజాదరణను చూడలేకే..
వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంతో తీవ్రంగా కలత చెందాం. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రతి చేనేత కుటుంబం భగవంతుడిని ప్రార్థిస్తోంది. జననేతకు వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేకే స్వార్థపర శక్తులు ఆయనను మట్టుబెట్టాలనుకున్నాయి. ఎన్ని కుట్రలు పన్నినా జగనే సీఎం అని ప్రజలు నిర్ణయించుకున్నారు.
– మల్లికార్జున్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, నెల్లూరు జిల్లా
మా కొట్లో టీ తాగాడు
ప్రజా సంకల్ప యాత్ర ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు ఆయప్ప (జగన్) మా టీ స్టాల్‌కు వచ్చి టీ తాగాడు. నాతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నాడు. జనం కష్ట సుఖాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతుంటే.. తట్టుకోలేక దుష్టులు చంపాలనుకున్నారు. నిత్యం ప్రజల కోసం పరితపించే ఆ బిడ్డకు ఇలా జరిగిందంటే చాలా బాధగా ఉంది. అల్లా మేలు చేస్తాడు.. తొందరగా కోలుకుని మళ్లీ పాదయాత్ర చేస్తాడు.
– యాసిన్, టీ స్టాల్ యజమాని, వైఎస్సార్ జిల్లా
రాజన్న బిడ్డ కోసం రోజూ అల్లాను ప్రార్థిస్తున్నా..
రాజన్న బిడ్డను చంపేందుకు ప్రయత్నించారని తెలిసి ఎంతో బాధపడ్డా. ఏం జరుగుతుందోనని ఆందోళన చెందా. ఇప్పటికీ ఆయన పరిస్థితి ఎలా ఉందోనని నిత్యం టీవీలో చూస్తున్నా.. ఆయన కోలుకోవాలని అల్లాను ప్రార్థిస్తున్నా. దేవుడు గొప్పోడు.. మా ప్రార్థన తప్పక వింటాడు.
– షేక్ మహుబూబీ, ఎర్రగుంట్ల, వైఎస్సార్ జిల్లా
ఆయన మళ్లీ మా పల్లెలకు రావాల..
రాజన్న బిడ్డ వస్తున్నాడని మా ఊరు రోడ్డుకు వెళ్లాను. అందరినీ ప్రేమతో పలకరించాడు. నా తల నిమిరాడు.. తాతా బాగున్నావా.. అన్నాడు. ఎంతో సంబరమేసింది. ఇంటికి వెళుతుంటే ఎవరో కత్తితో పొడిచారని విని కంగారుపడ్డా. ఆ బిడ్డను టీవీలో చూశాకగానీ మనసు కుదుటపడలేదు. మళ్లీ ఆ బిడ్డ మా జిల్లా రావాలా.. మా పల్లెల్లో తిరగాలా.. మేం సూడాల.
– అంబటి నారాయణ, చిన భీమవరం, విజయనగరం జిల్లా
వాళ్లే నాశనమైపోతారు..
పాదయాత్రలో జగన్ బాబు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. నీ ఆరోగ్యం జాగ్రత్త అవ్వా.. మనమొచ్చాక అంతా బాగుంటుందన్నాడు. నా మనసుకు చాలా హాయిగా అనిపించింది. అంత మంచి మనిషిని చంపాలనుకున్నారని తెలిసి తల్లడిల్లిపోయాను. మా మనవడ్ని నాశనం చేయాలనుకున్న వారే నాశనమైపోతారు. మా రాజన్నలా.. ఈ బిడ్డ కూడా సీఎం కావాల.
– చొక్కాపు సూరమ్మ, విజయనగరం జిల్లా
కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నాం..
రాజన్న బిడ్డ శ్రీకాకుళం జిల్లాకు వచ్చినప్పుడు మత్స్యకారుల సమస్యలను చెప్పాలనుకుంటున్నాం. విశాఖలో ఆయనపై హత్యాయత్నం జరిగిందని తెలిసి కంగారుపడ్డాం. మళ్లీ ఆయన మా మధ్యకు ఎప్పుడు వస్తాడా.. అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నాం. రాజన్నలాగే ఆయన బిడ్డ కూడా మత్స్యకారులకు న్యాయం చేస్తాడని నమ్ముతున్నాం.
– కొమర నారాయణరావు, మత్స్యకారుడు, శ్రీకాకుళం జిల్లా
ప్రజానాయకుడిపై కుట్రలా!
జగనన్నపై హత్యాయత్నం దారుణం. ప్రజల మధ్యనే ఉంటూ.. వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న ప్రజా నాయకుడిని మట్టుబెట్టాలనుకోవడం అత్యంత హేయం. ఇంత జరిగినా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. తనే చేయించుకున్నాడని అధికార పార్టీ నాయకులు ప్రచారం చేయడం హాస్యాస్పదం. కుట్ర వెనుక సూత్రధారులను వెలికితీయాలి.
– వాక యశోద, శాంభవి మహిళా మండలి గ్రూపు సభ్యురాలు, మర్రిపూడి, ప్రకాశం జిల్లా
ఇంత ఘోరం చేస్తారని అనుకోలేదయ్యా..
జగన్‌పై ఇంత ఘోరానికి ఒడిగడతారని నేననుకోలేదయ్యా.. పాదయాత్రప్పుడు ఎంత ఆప్యాయంగా మాట్లాడాడో. ఎవరికి ఏం అన్యాయం చేశాడని ఆ బిడ్డను చంపాలనుకున్నారు? కుట్ర చేసిన వాళ్లను పట్టుకోవాలి. ఆ బిడ్డ త్వరగా కోలుకుని మళ్లీ జనం మధ్యకు రావాలని దేవుడిని వేడుకుంటున్నా.
– గొల్లపల్లి నాగమ్మ,, రైతు కూలీ, ప్రకాశం జిల్లా
ఆయన మా మధ్యకు వచ్చే రోజుకోసం ఎదురు చూస్తున్నాం..
ఎప్పుడూ ప్రజల్లో ఉండే జగన్‌ను చంపే ప్రయత్నం చేయడానికి వాళ్లకు మనసెలా వచ్చింది? గాయం నుంచి కోలుకుని మళ్లీ మా మధ్యకు వచ్చే రోజు కోసం మేం ఎదురు చూస్తున్నాం. ఆయనకు మంచి పేరొస్తుందనే ఇలా చేశారు. ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నినా మేమంతా జగన్ వెంటే..
– వీరమ్మ, వైఎస్సార్ జిల్లా
రాక్షస క్రీడ
రాజకీయం.. రాక్షస క్రీడయింది
రాబందుల రెక్కల చప్పుడయింది
క్రౌర్యం పెద్దపులి పంజా విసురుతోంది
గోముఖ వ్యాఘ్రం జాతి గోవునంటూ..
‘పచ్చ’దనంతో పళ్లికిలిస్తూ పరిహాసం చేస్తోంది
తంత్రాలు, కుతంత్రాలు, ద్వేషాలు
మాయాజాలాల మహా మంత్ర క్రీడలాడుతోంది
అరచేతిలో వైకుంఠాన్ని చూపుతోంది
అపురూపాల అద్భుతాలంటూ
అభినయాలు చేస్తోంది,
హాలాహలం చిమ్ముతోంది!!
అప్పుడు.. అప్పుడే..
అసలైన సిసలైన అసలుసిసల నికార్సైన
ఓ కాంతి పుంజం దూసుకొచ్చింది
వెలుగుని తీసుకొస్తూ, వెలుతురు తోసుకొస్తూ
నువ్వు నేనై, నువ్వూ నేనూ మనమై
మనం మనం జనమై
జనం జనం ప్రభంజనమై
ప్రచంఢమై ప్రజ్వలితమై
హితమై సహితమై సమ్మోహితమై,
జన నినాదమై జగన్నినాదమై
నాదంగా నిదానంగా.. ఓ నినాదంగా
జన శ్వాసే తన శ్వాసగా ధ్యాసగా
తనలోని ఘోషగా..
మనసు మనసుని తడుముకుంటూ
భుజం భుజం కలుపుకుంటూ
ప్రతి మనిషినీ కలుసుకుంటూ
ప్రతి మనసునీ హత్తుకుంటూ
రాజన్న కలల్ని నెమరేసుకుంటూ
నవరత్నాల్ని మోసుకుంటూ
భవిష్యత్ ద్వారాలు తెరుస్తున్నాడతడు
అదేఅదే జగనన్న ప్రజా సంకల్పయాత్ర
భావి బాధలను తొలగించే
మహాద్భుతాల మాత్ర
అతడికి తోడవుదాం, నీడవుదాం
అక్కున చేర్చుకుందాం అతణ్ణి ఆదరిద్దాం
అతణ్ణి అనుసరిద్దాం ఆశీస్సులందిద్దాం
ఆశీర్వదిద్దాం...
అందాలని, ఆనందాలని
సంతోషాలను సంరంభాలను
అందించే రేపటి అందాలను ఆవిష్కరిద్దాం
ఆగామి కాలాల ఆమని కోయిలల్ని ఆహ్వానిద్దాం
–ప్రొఫెసర్ రమాప్రసాద్ ఆదిభట్ల, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment