
ఈ దృశ్యం చూడండి. కాకినాడ ప్రభుత్వాస్పత్రి(జీజీహెచ్)లో చికిత్స కోసం ఒకే పడకపై ఇద్దరేసి రోగులు ఉన్న దృశ్యమిది. రోగులు ఎక్కువైతే మున్ముందు విజయనగరం జిల్లా విద్యార్థుల మాదిరిగా మన జిల్లా రోగులకు ఎదురవుతుందేమో! పరిస్థితి చూస్తుంటే అవుననేలా ఉంది. జీజీహెచ్‌లో స్వైన్çఫ్లూ వార్డు ప్రస్తుతం ఖాళీగా ఉంది. అక్కడ పడకలన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. హెల్త్ ఎమర్జెన్సీ నేపథ్యంలో ప్రస్తుత జ్వరాల తీవ్రత దృష్ట్యా నిరుపయోగంగా ఉన్నవాటిని వినియోగించొచ్చు. కానీ, వాటికి నిబంధనలు అడ్డం ఉన్నాయని, వాడటానికి వీలు లేదని చెప్పి, ఒకే పడకపై ఇద్దరేసి రోగులను ఉంచుతున్నారు.
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి,కాకినాడ: రాష్ట్ర ఆర్థిక మంత్రి, మన జిల్లాకు చెందిన యనమల రామకృష్ణుడు పంటి నొప్పి ఉందని, సింగపూర్ వెళ్లి, ఎంచక్కా రూ. 2.88 లక్షల ప్రజాధనం ఖర్చు చేసి, రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చేయించుకున్నారు. కేవలం పంటి నొప్పికే అంత దూరం వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకున్న యనమలకు జిల్లాలో ప్రబలుతున్న జ్వరాలు, ఆస్పత్రుల్లో నెలకొన్న మందుల కొరత కనిపించకపోవడం విచిత్రమే! అటు జిల్లాకే చెందిన ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీరు కూడా అదేవిధంగా ఉంది. కొద్ది రో జులుగా జిల్లాలో డెంగీ, మలేరియా, విషజ్వరాలు పెద్ద ఎత్తున ప్రబలుతున్నాయి. ప్రజలు వేలాదిగా ఆస్పత్రుల పాలవుతున్నారు. అధిక సంఖ్యలో మృతి చెందుతున్నారు. గ్రామాలకు గ్రామాలే జ్వ రాల బారిన పడుతున్నాయి. కొన్నిచోట్ల జ్వరాల తీవ్రతకు ప్రజలు భయపడి, ఇళ్లు ఖాళీ చేసేసి, బయటికొచ్చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
రాష్ట్రంలోనే అత్యధికంగా డెంగీ ప్రభావం జిల్లాలో ఉందని సాక్షాత్తూ ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లోనే తేటతెల్లమయ్యింది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ మన జిల్లాకు చెందిన మంత్రులకు అదేమీ పట్టడం లేదు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై కనీసం ఆరా తీయడం లేదు. జిల్లాకు జ్వరం పట్టుకుందని పత్రికలు ఘోషిస్తున్నా కుంభకర్ణ నిద్ర పోతున్నారే తప్ప అసలేం జరుగుతోందో గమనిస్తున్న దాఖలాలు లేవు. జ్వరాల తీవ్రత నేపథ్యంలో జిల్లాలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చాలి. పంచాయతీ, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. ఇంటింటికీ వెళ్లి డెంగీ తదితర జ్వరాలు రాకుండా ప్రజలకు ముందస్తు జాగ్రత్తలను వివరించాలి. వైద్యుల కొరత ఉంటే వాటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలి. మందుల కొరత ఉంటే ప్రభుత్వ స్థాయిలో ఒత్తిడి చేసి తీసుకురావాలి. కానీ, మన మంత్రులు యనమల, చినరాజప్పలకు ఈ విషయం కనీసంగా కూడా పట్టడం లేదు. తమ వైద్యం, తమ విలాసాలు చూసుకుంటున్నారే తప్ప ప్రజల అనారోగ్యం వారికేమాత్రం కనిపించడం లేదు. కనీసం ఇప్పటివరకూ అధికారులను సమన్వయపరిచి, సమీక్షించిన దాఖలాల్లేవు. తాంబూ లాలిచ్చేశాం.. తన్నుకు చావండన్నట్టుగా అధికారులకు ఆదేశాలిచ్చాం.. వారే చూసుకుంటారనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు.
మరణాలు సమాధి
జిల్లాలో ప్రతి రోజూ చావులు చూస్తున్నాం. డెంగీ, మలేరియా, విషజ్వరాలతో చనిపోతున్నట్టు పత్రికల్లో పతాక శీర్షికన వస్తున్నాయి. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. కానీ, జిల్లా వైద్యాధికారులు మాత్రం అదంతా ఉత్తిదేనని తీసిపారేస్తున్నారు. జిల్లాలో అసలు మరణాలే లేవని తేల్చేస్తున్నారు. గత జనవరి నుంచి ఇప్పటివరకూ 1,401 మలేరియా, 277 డెంగీ పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని, మరణాలు ఎక్కడా చోటు చేసుకోలేదని అధికారులు చెబుతున్నారు. మరి పెద్ద సంఖ్యలో ప్రజలు ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారనే ప్రశ్నకు వారివద్ద సరైన జవాబు లేదు.
వేధిస్తున్న మందుల కొరత
♦ ప్రభుత్వాసుపత్రిలో ప్రధానమైన మందులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
♦ గ్యాస్ట్రిక్‌కు సంబంధించిన కాంబినేషన్ మందులైన పేంటాప్రోజల్, రేంటాడిన్, ట్రాండిన్ 150 ఎంజీ ప్రస్తుతం అందుబాటులో లేవు. ప్రతి వైద్యానికీ ఈ మందు తప్పనిసరి.
♦ చిన్న పిల్లలకు సంబంధించి ఒకటి రెండు సిరప్‌లు తప్ప ఏవీ లేవు. దగ్గు, బలానికి వాడే సిరప్‌లు లేవు.
♦ రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, ఐరన్ టాబ్లెట్లు లేవు.
♦ గుండె సంబంధిత వ్యాధి అత్యవసరమైన సార్బిట్రేట్ టాబ్లెట్లు లేవు.
♦ గుండె, మెదడుకు సంబంధించి ప్రధానమైన ఆస్పిరిన్ మందు కూడా అందుబాటులో లేదు.
♦ నొప్పులకు వాడే డైక్లోఫెనాక్ ఇంజక్షన్ ప్రభుత్వాసుపత్రిలో లేదు. దీనికి బదులు టాబ్లెట్ వాడుతున్నారు. ప్లూయిడ్స్‌లో వాడాలంటే తప్పనిసరిగా ఇంజక్షన్ ఉండాలి.
♦ దగ్గుకు వాడే సీపీఎం సిరప్ లేదు.
♦ సిప్రోఫ్లోక్సాసిన్ ఐ డ్రాప్స్ ఆసుపత్రుల్లో లేవు.
♦ మల్టీ విటమిన్ టాబ్లెట్లు కూడా ప్రభుత్వాసుపత్రిలో దొరకడం లేదు.
♦ వీటిల్లో చాలా మందులు జ్వరాలతో బాధపడుతున్న వారికి పరిస్థితులకు తగ్గట్టుగా వాడాల్సి ఉంటోంది. ఈ మందులు లేకపోవడంతో రోగులు సర్కారీ వైద్యానికి దూరమై, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి చేతి చమురు వదిలించుకోవల్సి వస్తోంది. అంత స్తోమత లేనివారికి చావే శరణ్యమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment