
సాక్షి, న్యూఢిల్లీ: కేపీ ఉల్లి ఎగుమతులకు త్వరలోనే అనుమతి ఇవ్వనున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మీడియాకు తెలిపారు. ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, తలారి రంగయ్య, ఎన్.రెడ్డెప్పలతోపాటు అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య తరఫున సమాఖ్య కార్యదర్శి బండ్లపల్లె మదన్‌మోహన్‌రెడ్డి, సలహాదారు బొమ్మారెడ్డి కోటిరెడ్డి, కేపీ ఉల్లి రైతులు ఎ.వెంకటరామిరెడ్డి, ఎ.దస్తగిరిరెడ్డి తదితరులు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తో సోమవారం సమావేశమయ్యారు.
అనంతరం పార్లమెంటు ఆవరణలో మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో చిన్న సైజ్‌లో ఉండే కేపీ ఉల్లిగడ్డలను ఎగుమతి చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశాం. ఇదివరకే పలుమార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. కేపీ ఉల్లిగడ్డ దేశీయంగా వినియోగం తక్కువ. కర్ణాటకలో ఇదేతరహా ఉల్లికి ఎలాగైతే ఎగుమతులకు అనుమతి ఇచ్చారో ఆంధ్రప్రదేశ్‌లో పండిస్తున్న కేపీ రకం ఉల్లి ఎగుమతులకు అనుమతివ్వాలని కోరాం. మంత్రి సానుకూలంగా స్పందించారు.’ అని వివరించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ ‘నవంబర్ నుంచి కేపీ ఉల్లి రైతులు ఎగుమతులకు అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరుతూ వస్తున్నారు. మూడు వారాలుగా ఢిల్లీలోనే ఉన్న కేపీ ఉల్లి రైతులతో కలిసి మంత్రిని కలిశాం. కచ్చితంగా సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఒకటి రెండు రోజుల్లోనే అనుమతి ఇస్తారన్న విశ్వాసం ఉంది..’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment