పోర్టు అనుబంధ పరిశ్రమల భూసేకరణ నోటిఫికేషన్‌తో ఆందోళనలో ఉన్న రైతుల తరఫున ఉద్యమం చేస్తుంటే టీడీపీ నాయకులు అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు.
మచిలీపట్నం : పోర్టు అనుబంధ పరిశ్రమల భూసేకరణ నోటిఫికేషన్‌తో ఆందోళనలో ఉన్న రైతుల తరఫున ఉద్యమం చేస్తుంటే టీడీపీ నాయకులు అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రౌడీయిజం చేస్తేనే తనపై కేసులు పెట్టారని మంత్రి కొల్లు రవీంద్ర చెబుతున్నారని, భూ సేకరణ ఉద్యమానికి సంబంధించిన వీడియోటేప్‌లు పోలీసుల వద్ద ఉన్నాయని వాటిని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు 3వ తేదీన భూసేకరణ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా హుస్సేన్‌పాలెం వద్ద రైతులంతా రాస్తారోకో చేస్తుంటే తనను ఆహ్వానించారని, రోడ్డుపైనే కూర్చుని తాను కదలకున్నా పోలీసులపై దాడి చేసినట్లు కేసు నమోదు చేశారన్నారు. తనతో పాటు సీపీఎం పట్టణ కార్యదరి కొడాలి శర్మ, మరో 80 మందిపై ఆ రోజు కేసు నమోదు చేశారని వీరంతా రౌడీయిజం చేసినట్లేనా అని ఆయన ప్రశ్నించారు.
పొట్లపాలెంలో మీ ఇంటికి - మీభూమి కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని రైతులు ప్రశ్నిస్తే, తహసీల్దార్ రైతులను తొక్కుకుంటూ, తోసుకుంటూ వెళ్లారన్నారు. దీంతో ఆగ్రహం చెందిన రైతులు షామియానా, కుర్చీలు తీసివేసి ఆందోళన నిర్వహిస్తే ఈ కార్యక్రమంలో తాను లేకపోయినా పాల్గొన్నట్లు కేసు నమోదు చేశారన్నారు. హుస్సేన్‌పాలెం, పొట్లపాలెం, ఎక్సైజ్ సీఐ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనకు సంబంధించిన వీడియోలను పోలీసులు తీశారని, వీటిని పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు. అక్రమ కేసులకు తాను భయపడేది లేదని, రైతుల తరఫున పోరాటానికి వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, పలువురు సర్పంచులు పాల్గొన్నారు.