సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కాపుల్ని ఏకాకుల్ని చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పేర్ని నాని ధ్వజమెత్తారు. కాపులు బీసీలో, ఈబీసీలో అర్థం కాని గందరగోళ పరిస్థితిని కల్పించారని మండిపడ్డారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల పేరుతో కాపులను ఎన్నిసార్లు మోసం చేస్తారని ప్రశ్నించారు. రిజర్వేషన్ల డ్రామాతో కాపులకు, బీసీలకు మధ్య ఇప్పటికే చిచ్చు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు తాజాగా ఇతర అగ్రకులాల వారితోనూ తగాదా పెట్టేందుకు కుట్ర పన్నారన్నారు.
కులాల మధ్య చిచ్చు పెడుతూ చంద్రబాబు చలి కాచుకుంటున్నాడని ఆరోపించారు. చంద్రబాబు చేసే మోసాన్ని ఎల్లో మీడియా కూడా ఆకాశానికి ఎత్తుతున్నాయని మండిపడ్డారు. 2014లో అధికారం కోసం కాపులను బీసీల జాబితాలో చేరుస్తానని మాట ఇచ్చి నమ్మించి మోసం చేశాడన్నారు. ముద్రగడ పద్మనాభంలాంటి పెద్దల్ని రోడ్డెక్కించారని, ఆయన రోడ్డు ఎక్కిన తర్వాతే కాపు రిజర్వేషన్ గురించి చంద్రబాబు మాట్లాడలేదని వివరించారు. మంజునాథ కమిషన్ ఏర్పాటు చేసి సాగదీసే ప్రక్రియకు తెరతీశారని, జస్టిస్ మంజునాథకు సంబంధం లేకుండా, తన కోటరీ ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, తీర్మానం చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపి కాపుల్ని బీసీలలో చేర్చామని తన మనుషులతో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాపులు బీసీలయ్యారని హడావిడి చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఈబీసీ కోటాలో రిజర్వేషన్లు కల్పిస్తామంటున్నారని, అసలింతకీ కాపులు బీసీలా లేక ఈబీసీలా? వారికి ఎన్నిసార్లు రిజర్వేషన్లు ఇస్తారు? అని నిలదీశారు. గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు ప్రధాని ఇచ్చిన పది శాతం ఈబీసీ కోటాలో కాపుల్ని చేర్చి వారికి ఇతర కులాలలోని పేదలకు మధ్య అగాధం సృష్టిస్తారా? అని మండిపడ్డారు. ఈ మోసాన్ని కాపులు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఇది వంచనతో కూడిన కార్యక్రమం అని ఆరోపించారు.
ఐదేళ్లుగా దళిత క్రిస్టియన్లు గుర్తుకురాలేదా?
కాపుల మాదిరే దళిత క్రిస్టియన్లనూ మోసం చేసేందుకు చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేశారన్నారు. ఐదేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ దళిత క్రిస్టియన్లను ఎస్సీలలో చేర్చే విషయాన్ని పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు వాళ్లను ఎస్సీలలో చేరుస్తానంటూ సరికొత్త నాటకానికి తెరలేపారన్నారు. 350 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఒక్కసారైనా నరేంద్ర మోదీతో దళిత క్రిస్టియన్ల వ్యవహారాన్ని చర్చించారా? అని ప్రశ్నించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను అమలు చేయాలంటే అమెరికా బడ్జెట్ కూడా చాలదన్న ముఖ్యమంత్రి ఇప్పుడు వాటిలోని పథకాలను ఎలా కాపీ కొడుతున్నారని నిలదీశారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో అవ్వాతాతలకు నెలకు రూ.2 వేల పెన్షన్ ఇస్తానని జగన్ 2017లోనే ప్రకటిస్తే ముఖ్యమంత్రి ఇప్పుడు నిస్సిగ్గుగా పింఛన్ పథకాన్ని కాపీ కొట్టారన్నారు.
మీ నోటితో హోదా కావాలని చెప్పించిందే జగన్
ప్రతిపక్షం లేని అసెంబ్లీలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌పై అవాకులు చేవాకులు పేలారని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి చెప్పినట్టు వైఎస్సార్‌సీపీ వాళ్లు నిందితులే అయితే ఆయన చెప్పుచేతల్లో ఉన్న పోలీసు వ్యవస్థ తమలో ఒకర్ని అయినా ముద్దాయిలుగా ఎందుకు చూపలేకపోయిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఏ అసెంబ్లీలోనైతే ప్రత్యేక హోదా వద్దన్న నోటితోనే హోదా ఆంధ్రుల హక్కు అని చెప్పించిన ఘనత వైఎస్ జగన్‌దేనన్నారు. ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ ఊరూవాడా పోరాటం చేస్తుంటే నరేంద్ర మోదీకి భయపడి చేష్టలుడిగిన వ్యక్తిగా మిగిలిపోయింది చంద్రబాబేనన్నారు.
నాలుగేళ్ల తర్వాత బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత ప్రత్యేక హోదా కోసం పోరాటం అంటూ హడావిడి చేస్తున్నది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. హోదా అంటే జైల్లో వేస్తామన్న చంద్రబాబు నోటితోనే ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినదించేలా చేసింది జగనేనన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని చంద్రబాబు గుండెల మీద బ్యాడ్జి పెట్టించిన నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment