సాక్షి, భైంసా : ‘‘రోడ్డుపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్త వహించండి.. మనం సక్రమంగా వెళ్తున్నా.. ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి.. మీ మీదే ఆశలు పెట్టుకుని, మీ కోసమే మీ ఇంట్లో ఎదురుచూసే వారుంటారు. జాగ్రత్తగా ప్రయాణించండి.. జాగ్రత్తగా ఇంటికి చేరండి.’’ అంటూ గతేడాది సరిగ్గా స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మృతి చెందిన తన సోదరుడి జ్ఞాపకార్థం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భైంసా మండలం బడ్‌గాంకు చెందిన భోస్లే రాధాకిషన్ పాటిల్ గతేడాది ఆగస్టు 15న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.
తన గ్రామం నుంచి ప్రతిరోజు భైంసాకు పాలు తీసుకొచ్చే రాధాకిషన్ ఆ రోజు సైతం ఉదయం పాలతో బైక్‌పై వస్తుండగా, భైంసాలోని సాత్‌పూల్ వంతెన సమీపంలో లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున విషాద ఘటన జరగడంతో ఆయన మృతిని జీర్ణించుకోలేని అతని కుటుంబ సభ్యులు గురువారం రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాధాకిషన్ సోదరుడు బాజీరావు పాటిల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. అతని సోదరుడు మృతి చెందిన ఏడాది గడిచిన సందర్భంగా భైంసా పట్టణంలో ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించి, అనంతరం ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ద్విచక్ర వాహన దారులు వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఫలితంగా ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో భైంసా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్‌రెడ్డి, వైద్యులు రామకృష్ణగౌడ్, పట్టణ ఎస్సై బాలకృష్ణ, విష్ణుప్రకాశ్, మోహన్‌రావు పటేల్, టీఎన్జీవోస్ పట్టణ అధ్యక్షులు ఎండపెల్లి అశోక్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment