► పెట్రోల్ బంకుల్లో భారీ మోసం
► లీటరుకు 100 మిల్లీలీటర్ల కోత
► ప్రశ్నించినవారిపై సిబ్బంది దాడులు
► మామూళ్ల మత్తులో అధికారులు
మచిలీపట్నం సబర్బన్ : పెట్రోల్, డీజిల్ బంకుల యజమానులు, సిబ్బంది భారీ మోసానికి తెరతీశారు. ఏడాది కాలంగా తనిఖీలు లేకపోవటంతో చేతివాటం యథేచ్ఛగా సాగుతోంది. చేతివాటంను ప్రశ్నిస్తున్న వాహన చోదకులపై బంకుల్లోని సిబ్బంది ఎదురుదాడికి దిగుతున్న సంఘటనలు పట్టణంలో తరుచూ చోటు చేసుకుంటున్నాయి. మచిలీపట్నం పట్టణం పరిధిలో ప్రస్తుతం ఏడు బంకులు ఉండగా, మండలంలో నాలుగు బంకులున్నాయి. చమురు సంస్థల నుంచి ఈ బంకులకు రోజుకు సగటున 8 ట్యాంకర్లు( ఒక్కో ట్యాంకర్ కెపాసిటీ 12 వేల లీటర్లు) ద్వారా పెట్రోల్, డీజిల్ సరఫరా జరుగుతోంది. నియోజకవర్గంలోని వాహన చోదకులు ప్రతి రోజూ 96 వేల లీటర్ల డీజిల్, పెట్రోల్‌ను బంకుల నుంచి కొనుగోలు చేస్తున్నారు.
మోసం ఇలా..: సాధారణంగా నెలకోమారు ఆయా కంపెనీలకు చెందిన సేల్స్ ఆఫీసర్‌లు, ఫిట్టర్‌లు వచ్చిన యంత్రంలో రహస్యంగా ఉన్న కొన్ని స్క్రూలను సరిగ్గా అమర్చి వెళుతుంటారు. అనంతరం ఆ బాక్స్‌కు ఒక సీల్ వేసి వెళ్లిపోతారు. తదుపరి తూనికలు, కొలతలు అధికారులు ఆ సీల్ ఎలా ఉంది, స్క్రూ సెట్టింగ్, సీల్ ఎలా ఉందని పర్యవేక్షిస్తుండాలి. కానీ అధికారులు యాజమాన్యం చేతిలోనే ఉండటంతో కంపెనీ సిబ్బంది వేసిన సీల్‌ను తొలగించి యాజమాన్యం కొన్ని స్క్రూలను వారికి నచ్చినట్లుగా అమర్చుకుని దోపిడికి తెగబడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీని ద్వారా యజమానికి లీటరుకు 50 మిల్లీగ్రాములు మిగులుబాటు లభిస్తోంది.
ఇదిలా ఉంటే అరకొర జీతాలతో పని చేస్తున్న సిబ్బంది సైతం పొట్ట నింపుకొనేందుకు భారీ మోసానికి తెగబడుతున్నారు. రీడింగ్ మీటర్ నుంచి గన్ లివర్‌కు ఉన్న కనెక్షన్‌ను ముందుగానే వారికి నచ్చినట్లు సెట్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. గన్‌కు ఉన్న లివర్‌కు మూడు స్టెప్‌లు ఉంటాయి. మూడు స్టెప్‌లు గట్టిగా నొక్కితేనే పెట్రోల్ డీజిల్ సరిగ్గా వస్తోందని సిబ్బంది చెబుతున్నారు. కానీ సిబ్బంది ముందుగా కొంత ఆయిల్‌ను వదిలిన తరువాత కొన్ని స్టెప్‌లను తగ్గించుకుంటూ వస్తుండటంతో వినియోగదారుడు చెల్లించిన నగదుకు సరిపరా ఆయిల్ రావటం లేదని పలువురి ఆరోపణ. ఈ విధంగా చేయటం వల్ల లీటర్‌కు మరో 50 మిల్లీలీటర్ల ఆయిల్ తగ్గుతోంది. అంతే లీటరుకు వినియోగదారులు 100 మిల్లీలీటర్ల పెట్రోల్ డీజిల్‌ను కోల్పోతున్నాడు. ఇదిలా ఉంటే మండలంలోని ఓ పెట్రోల్ బంకులో వాహనం ఆయిల్ ట్యాంక్‌లో ఆయిల్ పడకుండానే మీటర్ రీడింగ్ చూపించే సాంకేతికతను సిబ్బంది కనుగోని నయా మోసానికి పాల్పతున్నాడనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనితో పాటు ఆకువీడు నుంచి కల్తీ ఆయిల్ సరఫరా నియోజకవర్గంలోని బంకులకు జరుగుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
సిబ్బంది దూకుడు...: కళ్లముందే జరుగుతున్న కనికట్టను ప్రశ్నించిన వినియోగదారులపై బంకుల్లోని సిబ్బంది ఎదురుదాడికి దిగుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో అనేకం చోటు చేసుకున్నాయి. మండల పరిధిలోని పెదయాదర గ్రామానికి చెందిన ఓ రైతు మండల ఆయిల్ తక్కువగా వచ్చిందని ప్రశ్నించినందుకు బంకులోని సిబ్బంది అతనిపై దాడికి దిగారు. సదరు రైతు ఈ విషయం గ్రామస్తులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వటంతో గ్రామస్తులు ట్రాక్టర్‌పై వచ్చి బంకు సిబ్బందిని నిలదీశారు. ఇదే తరహాలో నెలకుర్రు, భోగిరెడ్డిపల్లి గ్రామస్తులు బంకు సిబ్బందిని ఇటీవల ప్రశ్నించారు. తాజాగా రుద్రవరం గ్రామానికి చెందిన వివాహిత అదే గ్రామంలోని బంకులో జరుగుతున్న మోసాన్ని ప్రశ్నించినందుకు సిబ్బంది ఆమెను దుర్భాషలాడారు.
మద్యం తాగి దుర్భాషలాడారు: మా గ్రామంలోని బంకుల్లో నిత్యం మోసం జరుగుతూనే ఉంది. లీటరుకు 100 మిల్లీలీటర్ల పెట్రోల్ తగ్గిపోతుంది. మీటర్ రీడింగ్‌లోనూ మోసం ఉంది. ఈ విషయాన్ని అడిగితే అక్కడ పని చేసే సిబ్బంది నన్ను దుర్భాషలాడారు. ఆ సమయంలో వారు మద్యం తాగి ఉన్నారు. ప్రతి రోజూ అక్కడి సిబ్బంది ఏవరో ఒకరితో గొడవ పడుతూనే ఉంటారు. -- ఉచ్చుల భార్గవి, రుద్రవరం
తనిఖీలు నిర్వహిస్తాం
గడిచిన ఏడాది కాలంలో బంకులపై తనిఖీ చేయలేదు. 2015వ సంవత్సరంలో మచిలీపట్నంలోని బంకులపై 11 కేసులు నమోదు చేశాం. సిబ్బంది తక్కువగా ఉండటంతో పని ఒత్తిడితో తనిఖీలు చేయలేదు. ఎలాంటి అవినీతికి పాల్పడటం లేదు. త్వరలోనే మచిలీపట్నంలోని బంకులపై దాడులను నిర్వహిస్తాం. --- భానుప్రసాద్, తూనికలు, కొలతల శాఖ, జిల్లా అధికారి
చేతి చమురు వదులుతోంది !
Published Tue, Feb 28 2017 3:17 PM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM
Advertisement
Advertisement