- జూడాల విజ్ఞప్తికి అంగీకరించిన సీఎం
- 600 మంది హౌస్‌సర్జన్లకు ప్రయోజనం
సాక్షి, హైదరాబాద్: వైద్యవిద్యకు సంబంధించి పీజీలో ప్రవేశాలు పొందేందుకు తమకు అవకాశం కల్పించాలన్న జూనియర్ డాక్టర్ల (జూడా) వినతికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సానుకూలంగా స్పందిం చారు. వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి, డీఎంఈ శ్రీనివాస్‌తో కలసి జూడాల ప్రతినిధులు ఆదివారం ముఖ్యమంత్రిని కలిశారు. సమ్మె చేసిన రెండు నెలల కాలానికి సరిపడా కోర్సు వ్యవధిని మే 31 వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జూడాల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ సమ్మె కొనసాగించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. హైకోర్టు చెప్పినా వినకుండా, పర్యవసానాలు ఆలోచించకుండా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు వచ్చాయని అన్నారు. భవిష్యత్తులో ఇలా జరగదని, విద్యా సంవత్సరం నష్టపోకుండా కాపాడాలని జూడాలు సీఎంను కోరారు.
600 మంది హౌస్‌సర్జన్లకు ప్రయోజనం..
సీఎం ఆదేశాల నేపథ్యంలో పీజీ ప్రవేశ పరీక్షకు అర్హత పొందేలా తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన అవగాహనకు రావాలని అధికారులను మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. వచ్చే నెల ఒకటో తేదీన పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్ష రాసేందుకు అర్హత కోల్పోతామన్న భయంలో హౌస్‌సర్జన్లు ఉన్నారు. అయితే, సీఎం తాజా నిర్ణయంతో ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్‌కు చెందిన 600 మంది హౌస్‌సర్జన్లు పీజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హత పొందుతారు. జూడాల మిగతా డిమాండ్లను ప్రభుత్వం ఇదివరకే అంగీకరించిందని వాటిని అమలుచేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా ‘సాక్షి’కి తెలిపారు. కాగా, జూడాల భద్రతకు సంబంధించి ప్రభుత్వం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.
‘దరఖాస్తుకు రెండు రోజుల గడువు పెంచండి’
వైద్య పీజీ ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు మరో రెండ్రోజులు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని కోరింది. దరఖాస్తుకు ఈ నెల 16 (సోమవారం) చివరి తేదీ. పీజీ పరీక్ష రాసి, అడ్మిషన్ పొందేందుకు హౌస్ సర్జన్లకు అనుమతి ఇస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం సానుకూలత వ్యక్తంచేసిన నేపథ్యంలో అధికారులు ఈ మేరకు గడువు పొడిగించాలని కోరారు.