పీహెచ్‌డీ రామకృష్ణ సింహపురి సింగంగా వినుతికెక్కారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులు, వ్యక్తులపై ఉక్కుపాదం మోపారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, నేరస్తులు ఎంతటి వారైనా కటకటాలు లెక్కించాల్సిందేనని తన చర్యలతో నిరూపించారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు అవినీతి, అక్రమాలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటూ సక్సెస్ ఫుల్ ఎస్పీగా అందరి మనన్నలు పొందుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తోనే సమస్యలు పరిష్కరించవచ్చని, నిస్వార్థ సేవతో పనిచేసే వారిని ప్రజలు ఎన్నటికి మరిచిపోరంటున్న జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ పాలనకు ఏడాది పూర్తయిన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
నెల్లూరు: జిల్లా 41వ ఎస్పీగా పీహెచ్‌డీ రామకృష్ణ గతేడాది జూన్ 26వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందించడంతో పాటు సమాజంలో వేళ్లూనుకొని ఉన్న అసాంఘిక శక్తులు, కార్యకలాపాలను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగారు. ప్రధానంగా ఎన్నో కుటుంబాలను బలి తీసుకొన్న క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై దృష్టి సారించారు. బెట్టింగ్ మూలాలను వెలికి తీశారు. జిల్లా వ్యాప్తంగా 85 కేసులను నమోదు చేసి 439 మందిని కటకటాల వెనక్కి పంపారు. వారిలో 15 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి బుకీలు, 40 మంది సబ్ బుకీలు, ఫెనాన్షియర్లుపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీంతో క్రికెట్ బెట్టింగ్‌కు బ్రేక్ పడింది.
ఎర్రచందనంఅక్రమ రవాణా కట్టడిపై దృష్టి
ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో కట్టడి చేసే దిశగా చర్యలు చేపట్టి రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాను మొదటి స్థానంలో ఉంచారు. ఏడాది కాలంలో 63 కేసులు నమోదు చేసి 860 మందిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు పాత కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న 400 మంది ఎర్రదొంగలను కటకటాల వెనక్కి పంపారు. వారి వద్ద నుంచి రూ.35 కోట్లు విలువ చేసే సుమారు 27 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా చైనా, టిబెట్, హాంకాంగ్, నేపాల్ దేశాలకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లతో పాటు, జాతీయ స్థాయిలో పేరొందిన స్మగ్లర్లందరిని దాదాపు కటకటాల వెనక్కి పంపారు. తీరుమారని 8 మంది ఎర్రస్మగ్లర్లపై పీడీ యాక్ట్‌లు నమోదు చేసి వారి ఆస్తులను సైతం జప్తు చేశారు. దీంతో స్మగ్లర్లు బెంబేలెత్తిపోయారు. అనంతపురం, నెల్లూరు జిల్లా మీదుగా ఎర్రచందనం అక్రమ రవాణా సాగుతుందన్న విషయాన్ని పసిగట్టి అంతర్ రాష్ట్ర ముఠాను ఇటీవల అరెస్ట్ చేశారు.
సిలికా..ఇసుకాసురులపై..
జిల్లాలో ఇసుక, సిలికా అక్రమరవాణాను సాధ్యమైనంత మేర కట్టడి చేశారు. సిలికా, ఇసుక రవాణాచేసే వాహనాలకు జీపీఎస్‌ను అమర్చి అక్రమరవాణాకు గండికొట్టారు. ఈ క్రమంలో కొన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ఎట్టిపరిస్థితుల్లోనూ సిలికా, ఇసుక అక్రమరవాణాను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అక్రమ రవాణాకు సహకరించే మైనింగ్ యజమానులపై సైతం కేసులు నమోదు చేయడం, పోలీసు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు పరుగెత్తించారు.
అవినీతి,అక్రమార్కులపై రామాస్త్రం
అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న, సహకరిస్తున్న సిబ్బందిపై రామాస్త్రాం సంధించారు. ఎన్నో ఏళ్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో పాతుకుపోయిన మినిస్టీరీయల్ సిబ్బందిపై బదిలీ వేటు వేసి తనదైన ముద్రవేసుకొన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జీడీలపై వేటు వేశారు. ఇద్దరు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, ఏడుగురు ఎస్సైలను సస్పెండ్ చేశారు. అనేక మందిని సిబ్బందిని వీఆర్‌కు పంపారు. ఒక వైపు అవినీతి సిబ్బంది ఆటలు కట్టిస్తూనే మరోవైపు సిబ్బంది సంక్షేమానికి తనవంతు కృషి చేస్తున్నారు. సిబ్బంది సమస్యల పరిష్కారానికి వారధి కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చారు. తద్వారా వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్, సీసీని ఏర్పాటు చేసి వారి ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా పోలీసు కుటుంబాల్లోని చిన్నారులకు సైతం ఫీజు రాయితీపై కార్పొరేట్ విద్యనందించేలా చర్యలు తీసుకున్నారు. పారదర్శకంగా సిబ్బంది బదిలీలు నిర్వహించి అందరి మనన్నలు పొందారు. సిబ్బంది అందరికి అన్ని విభాగాల్లో శిక్షణనిచ్చి సుక్షితులైన సైన్యంగా తీర్చిదిద్దారు.
ఇంకా మరెన్నో చర్యలు
♦ గుట్కా విక్రయాలపై కఠినంగా వ్యవహరించారు. జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి 143 కేసులు నమోదు చేసి 283 మంది గుట్కా విక్రేతలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2.50 కోట్లు విలువ చేసే గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు.
♦ రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ప్రమాదాలకు మితిమీరిన వేగం, డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడపడం, మద్యం మత్తులో వాహనాలు నడపడం తదితర కారణాలను గుర్తించి వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. డ్రైవింగ్ లైసెన్సు లేని 8 వేల మందిపై కేసులు నమోదు చేశారు. దీంతో జిల్లాలో 60 వేల మంది వాహనచోదకులు ఏడాది కాలంలో లైసెన్సులు తీసుకున్నారు. పోలీసు చర్యలతో గతంతో పోల్చి చూస్తే ఈ ఏడాది ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. ఈ ఏడాది జనవరి నుంచి చేపట్టిన జాతీయ రహదారిపై స్టాఫ్ వాష్ అండ్ గో కార్యక్రమం సత్ఫలితాలిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
♦ నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్ వ్యవస్థలో మార్పులు చేసి పూర్తిస్తాయిలో క్రమబద్ధీకరించారు.
♦ శాంతిభద్రతల పరిరక్షణలో రాజీలేని ధోరణి ప్రదర్శిస్తున్నారు. అసాంఘిక శక్తులపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపారు. ఫలితంగా నేరాలు కొంత మేర తగ్గుముఖం పట్టాయి. ప్రాపర్టీ కేసులను గణనీయంగా తగ్గించారు. ఏడాది కాలంలో 700 మంది నేరస్తులను అరెస్ట్ చేసి రూ.7 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. లాక్డ్‌హౌస్ మానిటరింగ్ సిస్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిíßంచి ప్రజలను చైతన్యవంతులను చేశారు.
♦ సైబర్‌ల్యాబ్‌కు జిల్లాకు రూ.2.50 కోట్లు ని«ధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పరిపాలనాపరమైన ఆమోదముద్ర లభించకపోవడంతో నిధులు విడుదల కాలేదు. దీంతో సైబర్‌ల్యాబ్ ఆవశ్యకతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రూ.30 లక్షలతో ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో సైబర్‌ల్యాబ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అటు ప్రజలు, ఇటు పోలీసు సిబ్బందిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.
డాదిపాలన సంతృప్తికరం
జిల్లాలో పోలీసు విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిది. అయినప్పటికి అన్ని వర్గాల ప్రజల సహకారంతో ఏడాది పాలనను పూర్తి చేయడం సంతృప్తినిచ్చింది. ప్రధానంగా ప్రజల బతుకులను ఛిద్రం చేస్తోన్న క్రికెట్ బెట్టింగ్, బెల్టు షాపులు, గుట్కా, పేకాట తదితరాలను సాధ్యమైనంత మేరకు కట్టడి చేశాం. అన్ని ఒత్తిళ్లను అధిగమిస్తూ ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందిస్తున్నా. సిబ్బంది సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. తాను ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాజకీయ పోస్టింగ్‌లు లేవు. అర్హత, సీనియార్టీ ప్రాతిపదికన పోస్టింగ్‌లు వేశా. అవినీతి పరులు ఏ స్థాయిలో ఉన్న ఉపేక్షించేదిలేదు. ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించడమే ప్రధాన లక్ష్యం.– పీహెచ్‌డీ రామకృష్ణ, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment