చిరు జీతగాళ్లకు ఆన్‌లైన్ చిక్కులు
=సమ్మె కాలపు అడ్వాన్సులకు ఆటంకం
=ట్రెజరీల్లో ఆగిన తీరు
=300 మంది వీఆర్‌ఏల ఎదురుచూపులు
=ఉన్నతాధికారులు పట్టించుకోవాలని వేడుకోళ్లు
గుడివాడ, న్యూస్‌లైన్ : అసలే అత్తెసరు జీతాలు.. ఆపై సమ్మెకాలపు అడ్వాన్సులు పొందడానికి ఆటంకాలు.. ఆన్‌లైన్ వ్యవస్థలో పేర్లు నమోదు చేయకపోవడమే దీనికి కారణం కాగా.. అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి దారితీసిందని వెల్లడవుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రెవెన్యూ శాఖలో పనిచేసే వీఆర్‌ఏలు సమ్మెలో పాల్గొన్నారు.
సమ్మె ముగిసిన అనంతరం ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చల్లో భాగంగా ట్రెజరీ ద్వారా జీతాలు పొందే ఉద్యోగులకు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జీతం అడ్వాన్సుగా పొందేందుకు ప్రభుత్వం నవంబరులో జీఓ విడుదల చేసింది. 010 పద్దు ప్రకారం జీతం పొందే వీఆర్‌ఏలకు కూడా రెండు నెలల జీతం అడ్వాన్సుగా పొందే అవకాశం ఉంది. వీరి జీతం నెలకు రూ.3,500 చొప్పున రెండు నెలలకు రూ.7 వేలు అడ్వాన్సుగా ఇవ్వాల్సి ఉంది.
ఆన్‌లైన్‌లో లేవని సబ్‌ట్రెజరీల్లో తిరస్కరణ...
రాష్ట్రంలో 010 పద్దు కింద జీతాలు పొందే ఉద్యోగులు ప్రతి ఒక్కరూ హెచ్‌ఆర్‌ఎంఎస్ విధానం ప్రకారం ఉద్యోగుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఈ మేరకు డిసెంబర్‌లో జీఓ నంబర్ 334 ద్వారా ఉత్తర్వులిచ్చారు. దీని ప్రకారం ఉద్యోగులు అడ్వాన్సులు పొందాలంటే తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో ఉద్యోగి వివరాలు నమోదై ఉండాలి. ఈ విధానాన్ని డిసెంబర్ 9 నుంచి అమలు చేయాల్సిందిగా ఖజానా అధికారులకు ఆదేశాలిచ్చారు. జిల్లాలోని వీఆర్‌ఏల వివరాలు నేటివరకు ఆన్‌లైన్ కాలేదు.