హైకోర్టులో జనవిజ్ఞాన వేదిక పిల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్ క్యారేజీ వాహనాలుగా తిరుగుతున్న అన్ని ప్రైవేటు బస్సుల్ని నిరోధించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు బస్సు ఆపరేటర్లైపై కఠిన చర్యలు తీసుకోవాలని.. రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. రాష్ట్రంలో రవాణా వ్యవస్థ తీరు తెన్నులపై అధ్యయనానికి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా వాటిలో కోరారు. జన విజ్ఞాన వేదికతోపాటు హైదరాబాద్‌కు చెందిన జె.కె.రాజు వేర్వేరుగా వీటిని దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రవాణా కమిషనర్, డీజీపీ, ఆర్టీసీ ఎండీ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్న ఈ పిటిషన్లను సోమవారం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది. అక్టోబర్ 30న మహబూబ్‌నగర్ జిల్లా, పాలెం వద్ద 45 మంది సజీవదహనానికి కారణమైన వోల్వో బస్సు నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్ క్యారేజీగా తిరుగుతోందని పిటిషనర్లు తెలి పారు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 31 నాటికి కాంట్రాక్ట్ క్యారేజీ అనుమతి పొందిన బస్సులు 6,530 ఉన్నాయని, దాదాపు అవన్నీ స్టేజ్ క్యారేజీ వాహనాలుగా తిరుగుతున్నాయని తెలిపారు. అధికారుల అలసత్వంతో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్నా రు. మోటారు వాహన చట్టంలోని నిబంధనలను కఠినంగా అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు.