జన కోటి.. భక్తిని చాటి
జిల్లాలో 1.21 కోట్లకు చేరిన పుష్కర యాత్రికుల సంఖ్య
మహాపర్వం ముగిసే నాటికి కోటిన్నరకు చేరుతుందని అంచనా
ఆది.. అంత్య పుష్కరాలనేవి గోదావరి నదికి మాత్రమే సొంతం. పావన వాహిని మహాపర్వంలో తొలి అంకమైన ఆది పుష్కరాలు రెండు రోజుల్లో పరిసమాప్తం కానున్నాయి. పుష్కర ఏడాదిలో ఏ రోజున గోదావరి స్నానం చేసినా సంపూర్ణ ఫలం దక్కుతుందనేది పండితుల ఉవాచ. అయినా.. భక్తులు మాత్రం ఆది పుష్కర పర్వంలోనే నదీ స్నానం చేయాలనే తలంపుతో గడచిన పది రోజులుగా గోదారమ్మ చెంతకు పోటెత్తి వస్తూనే ఉన్నారు. జలజ్జననిపై తమకున్న అపార భక్తిని చాటుతున్నారు. జిల్లాలోని 97 ఘాట్లలో పుష్కర పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య గురువారం కోటి దాటింది.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఆది పుష్కరాలు ముగింపు దశకు చేరుకోవడంతో గోదావరి చెంతకు యాత్రికులు వెల్లువలా తరలివస్తున్నారు. గురువారం రాత్రికి జిల్లాలోని 97 పుష్కర ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య 1.21 కోట్లకు చేరింది. శుక్ర, శనివారాల్లో ఈ సంఖ్య కోటిన్నరకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో గురువారం పుష్కర స్నానం ఆచరిం చారు. కొవ్వూరులో మధ్యాహ్నం నుంచి యాత్రికుల రద్దీ పెరగడంతో పట్టణం కిక్కిరిసిపోయింది. రానున్న రెండురోజుల్లో రద్దీ విపరీతం కానున్న దృష్ట్యా ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎస్పీ భాస్కర్ భూషణ్ వెల్లడించారు.
బస్సులు తిరిగే రహదారి పక్కన ప్రత్యేకంగా ఇనుప గడ్డర్లను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లపరంగా గోష్పాద క్షేత్రం ప్రాంతాన్ని మూడంచెలుగా విభజించి రద్దీని నియంత్రిస్తున్నారు. యాత్రికులు ఐదు నిమిషాలకు మించి ఘాట్లలో ఉండకుండా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ఇదిలావుండగా, గురువారం పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో పుష్కరాల ఏర్పాట్లు, యాత్రికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఘాట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నామని చెప్పారు. కొవ్వూరు వీఐపీ ఘాట్‌ను మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్, పీతల సుజాత గురువారం పరిశీలించి సౌకర్యాలపై ఆరా తీశారు.
నరసాపురంలో రద్దీ రెట్టింపు
గోదావరి పుష్కర సంబరం ముగింపు దశకు చేరుకోనుండటంతో నరసాపురంలో భక్తుల తాకిడి గంటగంటకూ పెరుగుతోంది. గడచిన నాలుగు రోజులతో పోలిస్తే గురువారం రద్దీ రెట్టింపైంది. వలంధర రేవులో స్నానాలు చేయడానికి గంటకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పిండ ప్రదానాల షెడ్డు సరిపోక ఉదయం వచ్చిన వారు మధ్యాహ్నం వరకు వేచి ఉన్నారు. వారం రోజులుగా పిండ ప్రదాన షెడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులకు సంబంధించిన ఏర్పాట్లు అరకొరగా ఉన్నప్పటికీ సరిదిద్దే ప్రయత్నం చేయలేదు. పారిశుధ్య పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడకపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు.
ట్రాఫిక్ విషయంలో పోలీసులు మళ్లీ చేతులెత్తేశారు. పాలకొల్లు రహదారి మీదుగా వచ్చే వాహనాలను అదుపు చేయకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రైవేటు బస్సులలో వచ్చిన వారు పట్టణానికి చేరుకునే వీలులేక చించినాడ, యలమంచిలి ఘాట్లకు వెళ్లారు. గురువారం రాత్రి గోదావరి మాతకు హారతి ఇచ్చే కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
పెనుగొండలోనూ పోటెత్తిన భక్తులు
పెనుగొండలో రాత్రి పొద్దుపోయే వరకు భక్తులు పోటెత్తారు. పిండ ప్రదానాల షెడ్లు, దుస్తులు మార్చుకునే గదులకు సంబంధించి ఇబ్బందులు తప్పలేదు. పిండ ప్రదానాలు జరిగేచోట ఒక కుటుంబం గోదానం ఇచ్చే సందర్భంలో అపశృతి చోటుచేసుకుంది. గోవు జనంలోకి పరుగు తీయడంతో స్వల్పతొక్కిసలాట జరిగి ఇద్దరు గాయపడ్డారు. ఆచంట మండలంలోని ఘాట్లకు బస్ సర్వీసులు లేక యాత్రికులు అవస్థలు పడుతున్నారు. మండలంలోని కరుగోరుమిల్లి, భీమలాపురం, పెదమల్లం ఘాట్లకు ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేదు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి రావడంతో యాత్రికుల జేబులకు చిల్లు పడుతోంది.
పట్టిసీమ క్షేత్ర దర్శనం లేదు
గోదావరి నీటిమట్టం పెరగడంతో పట్టిసీమ క్షేత్రానికి భక్తులు చేరుకునే వీలులేకపోయింది. లాంచీల రాకపోకలను ఇంకా పునరుద్ధరించలేదు. భక్తుల రద్దీ బాగా పెరిగింది. ఇదే సందర్భంలో సీఎం చంద్రబాబు పర్యటన పుష్కర యాత్రికులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు కొయ్యలగూడెం, పోలవరం నుంచి వచ్చే మార్గాల్లో చంద్రబాబు పర్యటన కారణంగా ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దీంతో భక్తులు ఎక్కడికక్కడ నిలిచిపోయి మూడు గంటల ఆలస్యంగా ఘాట్లకు చేరుకున్నారు.