పుష్కరాలు వచ్చేస్తున్నాయ్
► జూలై 31 నుంచి ఆగస్ట్ 11 వరకు అంత్య పుష్కరోత్సవం
► తీర్థ విధులు, పితృకార్యాలకు మరో అవకాశం
► ఒక్క గోదావరి నదికే సొంతం
► ఏర్పాట్లపై దృష్టి పెట్టని సర్కారు
కొవ్వూరు : గోదావరి అంత్య పుష్కరాల వేళ సమీపిస్తోంది. దేశంలోని ఏ నదికీ లేనివిధంగా గోదారమ్మకు మాత్రమే ఆది, అంత్య పుష్కరాలు నిర్వహిం చడం సంప్రదాయం. గత ఏడాది జూలై 14నుంచి 25వ తేదీ వరకు ఆది పుష్కరాలు నిర్వహించగా.. ఈ ఏడాది జూలై 31 నుంచి ఆగస్ట్ 12వ తేదీ వరకు 12 రోజులపాటు అంత్య పుష్కరాలు నిర్వహించేందుకు ముహూర్తం నిర్ణయమైంది. ఈ పుష్కరాల్లోనూ తీర్థ విధులు, పితృదేవతా కార్యక్రమాలు, పూజలు, దానధర్మాలు వంటివి నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. తద్వారా ఆది పుష్కరాల్లో పొందిన ఆధ్యాత్మిక ఫలాలను అంత్య పుష్కరాల్లోనూ పొందవచ్చని పేర్కొంటున్నారు.
గోదావరి నదిలో పుష్కరుడు జలరూపుడై ఏడాదిపాటు ఉంటాడని ప్రతీతి. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లోని రాజ మండ్రి, కొవ్వూరు, నరసాపురం, పెనుగొండ మండలం సిద్ధాంతంతోపాటు నది వెంబడి ఉన్న తాళ్లపూడి, పోల వరం, నిడదవోలు, పెరవ లి, ఆచంట, పెనుగొండ, యలమంచిలి మండలాల్లోనూ అంత్య పుష్కరాలు నిర్వహిస్తారు. జిల్లాలో మొత్తంగా 94 స్నానఘట్టాలు ఉన్నాయి.
ఒడిశా యాత్రికులు రాక
అంత్య పుష్కరాల సమయంలో ఒడిశా యాత్రికులు అధిక సంఖ్యలో ఇక్కడకు వచ్చి నదీ స్నానం ఆచరించి తీర్థవిధులు నిర్వర్తిస్తారు. ఒడిశా భక్తులు ఆది పుష్కరాల కంటే.. అంత్య పుష్కరాలకే అధిక ప్రాధాన్యం ఇస్తారు.
ఏర్పాట్లపై దృష్టి ఏదీ
గత ఏడాది జరిగిన ఆది పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి కోటిన్నర మంది జిల్లాలోని పుష్కర ఘాట్లకు వచ్చి స్నానాలు ఆచరించారు. అంత్య పుష్కరాల్లో కనీసం 30 శాతం మంది అంటే 45 లక్షల మంది జిల్లాలోని వివిధ పుష్కర ఘాట్లకు వస్తారని అంచనా వేస్తున్నారు. అంత్య పుష్కరాలు ముగిసిన మరునాటి నుంచి (ఆగస్ట్ 12 నుంచి) కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ దృష్ట్యా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు గోదావరి అంత్య పుష్కరాల్లో స్నానమాచరించి, ఆ తరువాత కృష్ణా పుష్కరాలకు వెళుతుంటారు. ఈ నేపథ్యంలో గోదావరి తీరం వెంబడి మలి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాల్సి ఉండగా, ప్రభుత్వం ఇప్పటివరకు ఆ దిశగా దృష్టి సారించకపోవడం విమర్శలకు దారితీస్తోంది.