అష్ట దిగ్బంధనం, వెంకన్న భక్తులకు ఇక్కట్లు
తిరుపతి : సమైక్య సెగ తిరుమలేశుడిని తాకింది. దాంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సమైక్యాంధ్ర సాధనలో భాగంగా తిరుమతిలో అష్ట దిగ్బంధం కొనసాగుతోంది. తిరుపతి బంద్‌కు స్వచ్ఛంద, ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నేడు, రేపు ...రెండురోజుల పాటు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో తిరుపతిలో జన జీవనం పూర్తిగా స్తంభించింది. విద్యాసంస్థలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. బంద్ నేపథ్యంలో నగరంలో ద్విచక్ర వాహనాలు మినహా ఆటో, రిక్షా, జీపు, ట్యాక్సీలు, లారీలు రోడ్డెక్కలేదు.
అలాగే అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సులకు మినహాయింపు ఇచ్చినా ఫలితం కనపడలేదు. బెంగళూరు మార్గం నుంచి తిరుమలకు వచ్చే వాహనాలను బైపాస్ మీదుగా చెర్లోపల్లె, జూపార్కు మీదుగా అలిపిరికి, ఎయిర్‌పోర్టు నుంచి వచ్చే వారు కరకంబాడి మీదుగా లీలామహల్, కపిలతీర్థం అలిపిరి వరకు చేరుకుంటున్నారు.
ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం టీటీడీ 12 బస్సులను మాత్రమే ఏర్పాటు చేయటంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రైల్వే స్టేషన్ నుంచి తిరుమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీటీడీ 10 ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. బంద్ నేపధ్యంలో నగరంలో టీటీడీ బస్సుల్లో ప్రయాణించే భక్తులకు ఆహార పొట్లాలు ఉచితంగా సరఫరా చేస్తున్నారు.