
సాక్షి, అమరావతి : ల్యాండ్ సర్వే సక్రమంగా లేని కారణంగా అనేక వివాదాలు నెలకొంటున్నాయని, రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే చేయాలని సీఎం జగన్ నిర్ణయించారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఆధ్వర్యంలో బిల్డింగ్ న్యూ ఇండియా లేవరేజింగ్ జియో స్పేషియల్ టెక్నాలజీ వర్క్‌షాప్‌లో ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ 111 సంవత్సరాల క్రితం భూముల సర్వే జరిగిందని, ప్రస్తుతం సర్వే చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరణాల వ్యవస్థ ఉన్నప్పుడు భూమి రికార్డ్స్ సక్రమంగా ఉండేవని, 1983 ఎన్టీఆర్ హయాంలో కరణం వ్యవస్థ రద్దు కారణంగా రికార్డుల నిర్వహణ నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు.
ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెవెన్యూశాఖ ద్వారా భూములు ఎన్ని ఉన్నాయనే దానిపై సర్వే చేస్తున్నామని, సర్వే చేసిన వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని తెలిపారు. ‘సాక్ డిపార్ట్‌మెంట్ ద్వారా భూములు సర్వే చేస్తున్నాం. వ్యవసాయరంగానికి ఈ సర్వే ఉపయుక్తంగా ఉంటుంది. భూగర్భజలాలు పెంపొందించుకోవడానికి ఈ సర్వే ఉపయోగపడుతుంది. ఐటీ శాఖ ఈ సర్వేకి సహకారం అందిస్తోందని’ మంత్రి వివరించారు.