
సాక్షి, పశ్చిమ గోదావరి : అవినీతి రహిత పరిపాలన అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశంలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవరత్నాలను ఏపీ ప్రజలందరికీ అంద చేయడమే తొలి లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలను అధికారులు గుర్తించి పనిచేయాలని సూచించారు. ఎన్నికల హామీలను అమలు చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అధికారులు కూడా సహకరించాలని కోరారు.
అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు
అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడమే తమ లక్ష్యమని గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు అన్నారు. జిల్లాలోని ప్రజలకు సురక్షిత తాగునీరు ఇవ్వడానికి ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్ విద్యార్ధులకు సైతం అమ్మ ఒడి అందిస్తున్నామని తెలిపారు. గోదావరి డెల్టాకు మరో వెయ్యి క్యూసెక్కుల నీరు పెంచాలని, కొల్లేరుకు కూడా నీరు అందించాలన్నారు. ప్రజలందరికీ మేలు చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమన్నారు.