
సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, చిత్రంలో మంత్రులు బుగ్గన, శ్రీరంగనాథ రాజు, ఎంపీ పోచా, మండలి విప్ గంగుల తదితరులు
సాక్షి, నంద్యాల: రాజకీయాలకు అతీతంగా పేదలకు ఇళ్ల స్థలాలను వచ్చే ఉగాది నాటికి ఇస్తామని, పక్కా గృహాలు సైతం మంజూరు చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. శనివారం నంద్యాలలోని వైఎస్సార్ సెంటినరీ హాలులో రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ, పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాల పంపిణీ అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు కమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, హౌసింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్, జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల నిరుపేద కుటుంబాలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలన్న దృఢసంకల్పంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకెళ్తున్నారన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 1.29 లక్షల మంది, పట్టణ ప్రాంతాల్లో 1.10 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అర్హులను అధికారులు గుర్తించారన్నారు. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో 700 ఎకరాలు, అర్బన్ ప్రాంతాల్లో 83 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో ల్యాండ్ సీలింగ్ ఉన్న భూములు, కోర్టులో పెండింగ్ ఉన్న వాటిని గుర్తించాలని, వాటికి త్వరగా పరిష్కారం చూపి ప్రజలకు ఇచ్చేందుకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. భూ రికార్డుల స్వచ్ఛీకరణ (ప్యూరిఫికేషన్)ను రెవెన్యూ అధికారులు స్పెషల్ డ్రైవ్‌గా చేపట్టాలన్నారు. రెవెన్యూ రికార్డులు సక్రమంగా లేకపోవడం, అడంగల్‌లో కొందరు అధికారులు తప్పుగా నమోదు చేయడం వల్ల రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. దీనివల్ల రెవెన్యూ శాఖకు చెడ్డపేరు రావడంతో పాటు నిజమైన రైతులు ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు.
ప్రత్యేక శ్రద్ధ చూపండి
పేదలకు నివాసయోగ్యమైన చోట ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు రెవెన్యూ, హౌసింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఆదేశించారు. భూపరిరక్షణ చట్టం మేరకు భూములన్నింటినీ రీసర్వే నిర్వహించి రికార్డుల స్వచ్ఛీకరణకు శ్రీకారం చుట్టాలన్నారు. డోన్, బేతంచర్ల ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు 1,117 తప్పుడు పట్టాదారు పాసుపుస్తకాలు సృష్టించడంతో పాటు 4,300 ఎకరాల పొలం సాగులో లేనట్లు చూపారని, దీనిపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 100 రోజుల పాలనలోనే లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేశారని కొనియాడారు. అక్టోబర్ 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఏ సమస్య వచ్చినా, ఉన్నా వలంటీర్లకు తెలియజేస్తే వెంటనే పరిష్కారం అవుతాయన్నారు.
నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లోని చెరువుల కింద ఉన్న భూములకు పట్టాలు మంజూరు చేయవద్దని అధికారులకు సూచించారు. అడంగల్‌లోని పేర్లు, రిజిస్ట్రేషన్ రికార్డులలో వ్యత్యాసాలు ఎక్కువగా ఉంటున్నాయని, ఇలాంటివి సరిదిద్దాలని అన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఓర్వకల్లు మండలంలోని భూముల వివరాలను 2016 నుంచి ఆన్‌లైన్‌లో తారుమారు చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. సోలార్ పార్కుకు భూములు కోల్పోయిన రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలన్నారు. పందిపాడు దగ్గర ఇళ్ల పట్టాలు పొందిన వారికి గృహనిర్మాణాలను ఉపాధి హామీ పథకం కింద చేపట్టేందుకు అనుమతించాలన్నారు. శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని దొరకొట్టాల సమీపంలో 1,200 ఎకరాల భూమిని సొసైటీకి ఇచ్చారని, దాన్ని సంబంధిత రైతులకు ఇచ్చి రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు.
బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లలో రెవెన్యూ రికార్డులలో పేర్లు మార్పు చేసి, ఫోర్జరీ సంతకాలతో భూములను కొందరు ఆక్రమించుకున్నారని, అలాంటి వాటిని అధికారులు గుర్తించాలని సూచించారు. ఇల్లు, ఇంటి స్థలం కావాలంటే రేషన్‌కార్డు అడుగుతున్నారని, తమ నియోజకవర్గంలో చాలా మందికి కార్డులు లేవని, కొత్తవి మంజూరు చేయాలని కోరారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణ సమీపంలోని నందమూరినగర్, వైఎస్సార్‌నగర్, శిల్పానగర్‌లో ఇళ్ల స్థలాలను కొందరు నాయకులు పంచుకున్నారన్నారు. అధికారులు గతంలో రాజకీయ ఒత్తిళ్లకు గురై ఒకే ప్లాట్‌ను ఇద్దరికి, ముగ్గురికి ఇవ్వడం వల్ల ప్రతిరోజూ అక్కడ ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. ఇళ్ల స్థలాలపై సమగ్ర విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని కోరారు.
గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్ మాట్లాడుతూ అర్బన్ అథారిటీ కింద ఉన్న 9 మండలాల పరిధిలోని 132 గ్రామాల్లో ఇళ్లులేని నిరుపేదలను గుర్తించి డిసెంబర్‌గా నివేదికలు ఇస్తే వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. పట్టణాల్లో జీప్లస్3 కింద గృహాలు నిర్మించి పేదలకు అందిస్తామని తెలిపారు. కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ జిల్లాలో భూరికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి భూరికార్డుల స్వచ్ఛీకరణపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్–2 ఖాజామొహిద్దీన్, డీఆర్‌ఓ వెంకటేశం, కర్నూలు, నంద్యాల, ఆదోని, ఆర్‌డీఓలు వెంకటేశ్వర్లు, రామకృష్ణారెడ్డి, బాలగణేశ్, హౌసింగ్ పీడీ వెంకటేశ్వర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బిల్లులు త్వరలోనే చెల్లిస్తాం
కర్నూలు జిల్లాలో 27,100 పక్కాగృహాలు నిర్మాణ దశలో ఉన్నాయని, వీటికి రూ.52 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. త్వరలోనే బిల్లులు చెల్లించనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో బినామీ పేర్లతో గృహాలకు బిల్లులు తీసుకున్నారని విమర్శించారు. జిల్లాలోని 54మండలాల్లో 9 మినహా అన్ని మండలాలను అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కిందకు తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి గృహ నిర్మాణాలకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు అవుతాయని తెలిపారు. గృహ నిర్మాణాలకు పావలా వడ్డీ కింద రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. వితంతువులు, ఒంటరిమహిళలు, దివ్యాంగులకు హౌసింగ్ శాఖ ద్వారానే గృహాలు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూ వివరాలను సంబంధిత శాసన సభ్యుల దృష్టికి తీసుకెళ్లి.. భూసేకరణలో వారినీ భాగస్వాములు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.