
తూటాలతో ఆటలా!
ఏఆర్ కానిస్టేబుల్ నిర్వాకం
సినీ ఫక్కీలో పిస్టల్ తిప్పిన వైనం
దూసుకొచ్చిన తూటాతో తప్పిన ముప్పు
విజయవాడ సిటీ : కమిషనరేట్ సాయుధ పోలీసుల క్రమశిక్షణ గాడితప్పుతోంది. జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఆయుధాలను ఆకతాయితనంగా ఉపయోగిస్తున్నారు. దీంతో తరచూ తుపాకీ తూటాలు బయటకు దూసుకొస్తున్నాయి. మూడు రోజుల కిందట మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద తుపాకీ పేలిన విషయం మరిచిపోకముందే నగర సాయుధ విభాగంలో ఆదివారం రాత్రి మరో ఘటన చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్ సినీ ఫక్కీలో పిస్టల్ తిప్పడంతో తూటా బయటకు దూసుకొచ్చి త్రుటిలో ప్రమాదం తప్పింది. రాష్ట్ర మంత్రి పీతల సుజాత ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో నగరానికి వచ్చారు.
ఆమెకు ఎస్కార్టుగా ఓ ఆర్‌ఎస్‌ఐ సహా ఆరుగురిని పంపారు. తిరిగి వచ్చిన తర్వాత వీరు ఆర్మర్ విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ కుమారస్వామికి ఆయుధాలు అందజేశారు. వాటిని తీసుకున్న స్వామి తనకు ఏఆర్ ఎస్‌ఐ ఇచ్చిన 9 ఎంఎం పిస్టల్‌ను సినీ స్టైల్లో చేత్తో తిప్పారు. ప్రమాదవశాత్తు చే యి తగిలి బుల్లెట్ బయటకు దూసుకొచ్చింది. అక్కడున్న సిబ్బంది మధ్య నుంచి తూటా దూసుకెళ్లడంతో సిబ్బంది చాకచక్యంగా తప్పుకున్నారు. సమాచారం తెలిసిన వెంటనే ఏఆర్ అధికారులతో పాటు డీసీపీ (పరిపాలన) జి.వి.జి.అశోక్‌కుమార్ ఆయుధగారానికి చేరుకుని విచారణ జరిపారు. ఆ తర్వాత స్వామిని ఆర్మర్ విధుల నుంచి తప్పించారు. సమగ్ర విచారణ జరిపిన తర్వాత నిర్లక్ష్యం వెల్లడైతే శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఇటీవల వరుస ఘటనలు చోటు చేసుకోవడంపై ఏఆర్ అధికారులపై కమిషనరేట్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడుపులకు అలవాటుపడిన ఏఆర్ అధికారులు ప్రాధ్యాతన కలిగిన చోట్ల సైతం అనుభవం లేని వారిని నియమిస్తున్నారనే విషయం అధికారుల దృష్టికి వచ్చింది. ఏదో ఒక వంకతో ఏళ్లతరబడి ఉద్యోగులు ఇక్కడే తిష్ట వేస్తున్న విషయం అధికారులు గుర్తించారు.
అవగాహన కల్పించాలి: డీసీపీ
ఆయుధాల వాడకం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు నిర్ణయించినట్టు డీసీపీ అశోక్‌కుమార్ చెప్పారు. జరిగిన ఘటనపై ఆయన సాక్షితో మాట్లాడుతూ ఆదివారం రాత్రి కానిస్టేబుల్ తప్పిదం వల్ల తూటా బయటకు వచ్చిందని చెప్పారు. ఇటీవల మంత్రి దేవినేని ఇంట్లో కూడా ఇదే తరహాలో జరిగిన విషయాన్ని ఆయన పేర్కొన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఆయుధాల వాడకం, శుభ్రం చేయడం వంటి అంశాలపై సిబ్బందికి అవగాహన కలిగించాల్సి ఉందని గుర్తించామన్నారు. ఇందుకు సంబంధించి నగర పోలీసు కమిషనర్ నుంచి తగిన అనుమతి రాగానే కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.