ప్లీజ్.. ఆగండి సీఎం పార్టీ వస్తోంది..!
=పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ నేతలు
=తొందరపడవద్దని ఎంపీ లగడపాటి హితబోధ
=అసెంబ్లీ సమావేశాల తర్వాత సీఎం పార్టీ వస్తుందని వెల్లడి
సాక్షి, విజయవాడ : ‘జనవరిలో అసెంబ్లీ సమావేశాలు పూర్తికాగానే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీ పెడుతున్నారు. అప్పుడు మనమంతా చేరదాం. అప్పటి వరకూ ఓపిక పట్టండి. తొందరపడవద్దు.’ అంటూ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తమ పార్టీ నేతలకు హితబోధ చేస్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు పార్టీ మారాలనే ప్రయత్నాలు ఉన్నారు. దీంతో ఆ వలసను అడ్డుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం గుడ్డిగా రాష్ట్ర విభజన నిర్ణయంతో ముందుకు సాగడంతో ఆ పార్టీకి సీమాంధ్రలో పుట్టగతులు ఉండవనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఆ పార్టీ నేతలు కూడా దాన్నే గట్టిగా విశ్వసిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తమ రాజకీయ ప్రస్థానానికి ఇబ్బందిలేని, ప్రజాదరణ ఉన్న పార్టీల్లోకి చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అత్యధికులు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్‌లో కీలకస్థానాల్లో ఉన్న నేతలు, ప్రజాప్రతినిధులు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ వలసలను ఏ విధంగానైనా నిలువరించాలని కాంగ్రెస్ నాయకత్వం ఒక వైపు ప్రయత్నాలు చేస్తుంటే, ముఖ్యమంత్రి వర్గం మాత్రం అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకూ ఓపిక పట్టాలని ఆ నేతలకు నచ్చచెప్పేందుకు శ్రమిస్తోంది.
ఇటీవల పార్టీ మారిన వారికి లగడపాటి రాజగోపాల్ స్వయంగా ఫోన్లు చేసి మాట్లాడినట్లు తెలిసింది. వారిలో కొందరు తాము పదవుల కోసం పార్టీ మారడం లేదని, ఇప్పటి వరకూ మిమ్మల్ని నమ్ముకుని ఉన్నందుకు అవమానాలే మిగిలాంటూ ఎంపీపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలో పార్టీ వీడతార ని భావిస్తున్న వారందరితో ఎంపీ వ్యక్తిగతంగా ఫోన్‌లో మాట్లాడుతూ తొందరపడవద్దని కోరుతున్నట్లు తెలిసింది.
అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కంకణం కట్టుకున్న విషయం అందరికి అర్ధం అవుతోందని, ఇప్పటి వరకూ విభజనకు సహకరించి తర్వాత కొత్త పార్టీ పెడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పలువురు నేతలు స్పష్టం చేస్తున్నట్లు ఆ పార్టీ వారే చెబుతున్నారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి బుధవారం నగరానికి రానుండటంతో ఈ అంశంపై చర్చ సాగే అవకాశం కనిపిస్తోంది.