సాక్షి, కొత్తగూడెం: ఏజెన్సీలో పోడు భూములపై గిరిజనేతరుల కన్నుపడింది. కౌలు ఇస్తామని గిరిజనులను నమ్మించి సారవంతమైన భూములను సాగుచేస్తూ... తీరా పంట పండిన తర్వాత వారికి రిక్తహస్తం చూపుతున్నారు. పలు మండలాల్లో ఈ దందా సాగుతున్నా అధికారులు మాత్రం పట్టనట్లే ఉంటున్నారు. గిరిజనేతర బడా రైతులు చేయి తడపడంతో.. పోడు భూములను గిరిజనులే సాగు చేసుకుంటున్నారంటూ అధికారులు రికార్డులు చూపుతుండడం గమనార్హం.
జిల్లాలోని 29 మండలాల్లో సుమారు 4 లక్షల ఎకరాలు పోడు కొట్టి సాగుకు అనువుగా ఉన్నాయి. ఇందులో 2 లక్షల ఎకరాల వరకు గిరిజనులకు హక్కుపత్రాలిచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ భూములను గిరిజనులే సాగు చేసుకోవాలి. పోడు కొట్టుకున్న గిరిజనుడు ఏపంటైనా సాగు చేసుకోవచ్చు. హక్కు పత్రాలు ఇవ్వకున్నా గిరిజనులు సాగు చేసుకోవచ్చు. జిల్లాలో చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, పాల్వంచ, బూర్గంపాడు, ఇల్లెందు, పినపాక, గుండాల, కారేపల్లి, కొత్తగూడెం, చండ్రుగొండ, అశ్వారావుపేట, వేలేరుపాడు, కుక్కునూరు, చండ్రుగొండ, ముల్కలపల్లి, గార్ల, దమ్మపేట, బయ్యారం, మణుగూరు మండలాల్లో ఎక్కువగా ఈ పోడు భూములు సాగవుతున్నాయి.
అయితే, పలు మండలాల్లోని గిరిజనులు పోడు కొట్టి సారవంతం చేశాకా... గిరిజనేతరులు రంగంలోకి దిగుతున్నారు. గిరిజనులకు కౌలు ఇస్తామంటూ నమ్మబలుకుతున్నారు. కౌలు వేలరూపాయల్లో కుదుర్చుకొని తీరా పంట అంతా నూర్పిడి జరిగిన తర్వాత పంట పండలేదని వారికి కౌలు చెల్లించడం లేదు. తమకు కౌలు చెల్లించడం లేదని గిరిజనం అధికారులకు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ఎక్కువగా గిట్టుబాటునిచ్చే పంటలనే గిరిజనేతరులు సాగు చేస్తున్నారు. పత్తి, పొగాకు, మొక్కజొన్న, అరటి పంటలతో లక్షలు అర్జిస్తున్నా.. గిరిజనులకు మాత్రం నయా పైసా కౌలు చెల్లించడం లేదు. అశ్వారావుపేట నియోజకవర్గంలోనే ప్రధానంగా జామాయిల్, పొగాకు, మొక్కజొన్న, పత్తి , అరటి పంటలను గిరిజనుల భూముల్లో గిరిజనేతరులు సాగుచేస్తున్నారు. మిగతా మండలాల్లో పత్తి, జామాయిల్ సాగవుతోంది.
కౌలు కుదర్చడంలో దళారులే కీలకం...
గిరిజనుల నుంచి పోడు భూములను గిరిజనేతరులకు కౌలు కుదర్చడంలో దళారులే ప్రధానపాత్ర పోషిస్తున్నారు. జిల్లాతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన బడా రైతులను ఈ దళారులు ఆశ్రయించి పోడు భూముల విషయం చెబుతూ వారికి గిరిజనులతో కారు చౌకకు కౌలుకు ఇప్పించి బడా రైతుల నుంచి కమీషన్ పుచ్చుకుంటున్నారు. బోరు సౌకర్యం లేని మెట్ట భూమిలో జామాయిల్ వేసేందుకు ఎకరాకు ఏడాదికి రూ. 2వేల నుంచి రూ. 3 వేలు, పత్తి, పొగాకు, మొక్కజొన్న చేలకు ఎకరాకు ఏడాదికి రూ. 7వేల వరకు కౌలు చెల్లిస్తామని మాటగా చెబుతారు. ఈభూములలో పండించిన పొగాకును మార్కెట్ చేసుకునేందుకు దళారి వ్యవస్థతో సంబంధం లేకుండా జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం-2లో విక్రయించాల్సి ఉంది. అక్రమంగా గిరిజనుల భూములు కౌలుకు తీసుకున్నవారు బినామీ లెసైన్స్‌ల పేరుతో బోర్డులో విక్రయిస్తున్నారు. అలాగే గిరిజనుల హక్కు పత్రాలు జిరాక్సు చూపించి నేరుగా బడా రైతులు సీసీఐకే పత్తిని విక్రయిస్తుండడం గమనార్హం.
అశ్వారావుపేటలో యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమం..
అశ్వారావుపేట నియోజకవర్గంలో ఈ దందా బహిరంగంగానే సాగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాతపట్టాలున్న గిరిజనుల వద్ద ఖాళీగా ఉన్న భూములను ఏలూరుకు చెందిన ఓబడా రైతు స్వాధీన పరుచుకొని మొద్దులు తీయించి, వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. తద్వారా పొలాన్ని చదును చేసేందుకు అయిన ఖర్చు చేతికి వచ్చింది. ప్రభుత్వం నుంచి గిరిజన రైతులకు అందాల్సిన సబ్సిడీలతో విద్యుత్ లైన్, ట్రాన్స్‌ఫార్మర్, బోరు, డ్రిప్ వంటి వాటిని అమర్చారు. ఆతర్వాత నాలుగేళ్లపాటు అరటి పంటను సాగుచేసి ఆతర్వాత గిరిజనులకు అప్పగించి వదిలేయాలన్నది అతని నిర్ణయం. గత ఐదేళ్లుగా సదరు బడా రైతు ఇలా భూములను కౌలుకు చేస్తూ గిరిజనులను మోసం చేస్తున్నాడని ఆరోపణలున్నాయి. భూసారాన్ని మొత్తం పీల్చి పిప్పి చేసే విధంగా అధిక మోతాదులో రసాయనాలు వాడితే ఆతర్వాత గిరిజనులచేతికి చిక్కినా సాగుకు యోగ్యకాకుండా ఈభూములు మిగులుతాయి. ఇలా జిల్లాలో ఏజెన్సీలో పోడు కౌలు పేరుతో గిరిజనం పొట్ట కొడుతున్న బీనామీ దందాపై అధికారులు ఇప్పటికైనా దష్టి సారించాల్సిన అవసరం ఉంది.
పోడుపై బినామీ గద్దలు
Published Wed, Oct 23 2013 2:51 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement