ఏలూరు (మెట్రో) : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు గ్రామాలు ఖాళీ చేయకుండా కొంతమంది వారిని బెదిరిస్తున్నారని, ఈ విషయంలో తాను కఠినంగా ఉంటానని, వెనుకంజ వేయకుండా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్ భాస్కర్‌కు సూచించారు. రెండు రోజుల రాష్ట్ర కలెక్టర్లు, మంత్రులతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో భాగంగా రెండో రోజు జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రసంగించారు. అభివృద్ధి పనులు ఎక్కడా ఆగడానికి వీల్లేదని చెప్పారు.
ప్రాజెక్టు పనులు జరగకుండా నిర్వాసితులు ఇళ్లు ఖాళీ చేయకుండా కొంతమంది అడ్డుపడుతున్నారని, దీన్ని కలెక్టర్ ఏ మాత్రం ఉపేక్షించకుండా ప్రజలకు మేలు జరగడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి అనే సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని భూగర్భజలాలను పెంపొందించేందుకు ఇప్పటి నుండే అవసరమైన చర్యలను చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ స్థితిగతులపై ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, రానున్న వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా అన్ని చర్యలు చేపట్టామని వివరించారు. జిల్లాలో వేసిన ప్రతి పంటకు సాగునీరు అందేలా పటిష్టవంతమైన చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు వేగవంతంగా సాగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో నిర్వాసితులను ఖాళీ చేయించి పునరావాసాలకు తరలించామని కలెక్టర్ చెప్పారు. చింతలపూడి ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్లు ఇంకా పూర్తికావాల్సి ఉందని వివరించారు. పాఠశాలల్లో టాయిలెట్స్ సౌకర్యం, తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
అడ్డుకుంటే ఉపేక్షించవద్దు
Published Wed, Feb 24 2016 12:53 AM | Last Updated on Thu, Mar 21 2019 8:23 PM
Advertisement
Advertisement