‘బెల్టు’ వదల్లేదు
సాక్షి, ఏలూరు: ప్రమాణ స్వీకారం రోజునే బెల్టు షాపుల్ని రద్దు చేస్తూ ఫైల్‌పై సంతకం చేశానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నా యుడు గొప్పలు చెప్పుకుంటున్నా రు. బెల్టు షాపులపై అధికారులు ఉక్కుపాదం మోపాలంటూ ప్రతి సభలోనూ ఆదేశాలిస్తున్నారు. కానీ జిల్లాలో నేటికీ బెల్టు షాపులు యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి. కట్టడి చేయాల్సిన అధికారులు మామూళ్ల మత్తులోపడి వ్యాపారులను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో బెల్టుషాపులు ఉన్నట్టు తెలిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని గత కలెక్టర్ సిద్ధార్థజైన్ హెచ్చరించడంతో బహిరంగ విక్రయాలు కనుమరుగయ్యాయి. రహస్యంగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు బెల్టుషాపుల్ని రద్దుచేస్తూ జూన్ 8న ఫైలుపై సంతకం చేశారు. మరుసటి రోజునుంచే జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు ప్రారంభించారు. ఇప్పటివరకూ ఏలూరు సర్కిల్ పరిధిలో 52 కేసులు నమోదు చేసి 189 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. భీమవరం సర్కిల్ పరిధిలో 42 కేసులు నమోదు చేసి 98 లీటర్ల మద్యం పట్టుకున్నారు.
అక్కడక్కడా తగ్గినా...
జిల్లాలో అక్కడక్కడా బెల్టు షాపులు తగ్గినా ఏజెన్సీ గ్రామాల్లో కొనసాగుతున్నాయి. పోలవరం మండలంలోని పైడాకుల మామిడి, టేకూరు, సింగన్నపల్లి, గూటాల తదితర గ్రామాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. మద్యం విక్రయిస్తున్న వారికి అధికారులు దాడులకు వస్తున్న విషయం ముందుగానే తెలుస్తుండటంతో వారొచ్చే సమయానికి మద్యం బాటిళ్లను రహస్య ప్రాంతాలకు తరలించేస్తున్నారు. తణుకు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని గ్రామాల్లోనూ గుట్టుచప్పుడు కాకుండా బెల్టు షాపులు నడుస్తున్నారుు. అయితే, పరిచయస్తులకు మాత్రమే వాటిలో మద్యం అమ్ముతున్నారు. యలమంచిలి మండలం కనకాయలంకలో ఏకంగా ఆరు బెల్ట్‌షాపులు నడుస్తున్నాయి.
ధరలకు రెక్కలు
మద్యం దుకాణాల్లో గరిష్ట చిల్లర అమ్మకం ధర (ఎంఆర్‌పీ) కంటే క్వార్టర్ బాటిల్‌కు రూ.10 నుంచి రూ.20 చొప్పున అధిక ధర వసూలు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని షాపుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు మద్యం దుకాణాలకు పక్కనే షాపులు తెరిచి రాత్రి 11నుంచి ఉదయం 9గంటల వరకు యథేచ్ఛగా మద్యం విక్రయూలు చేస్తున్నారు.
ఆదాయం కోసమే...
జిల్లాలో మొత్తం 475 మద్యం షాపుల లెసైన్సుల జారీ కోసం ఇటీవల టెండ ర్లు పిలవగా, 431 షాపులకు టెండర్లు దాఖలయ్యూయి. లెసైన్సు ఫీజు కింద ప్రభుత్వానికి రూ.160 కోట్ల 47 లక్షల 50 వేల ఆదాయం సమకూరింది. కేవలం ఒక్క ఏడాదికే ఇంత ఆదాయం వస్తున్నా అధికారులు అమ్మకాలను పెంచడం ద్వారా ఎక్సైజ్ డ్యూటీ ఆదాయం పెంచుకోవడానికి బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రతి షాపునకు అనుబంధంగా కనీసం రెండుమూడు బెల్టు షాపులను నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా అమ్మకాలు పెరిగి ప్రభుత్వంతోపాటు మామూళ్ల రూపంలో అధికారులకు, సిబ్బందికి ఆదాయం పెరుగుతోంది. కొందరు అధికారులైతే నెల రోజులు ఓపిక పడితే బెల్టు షాపులను బార్లా తెరుచుకోవచ్చని నిర్వాహకులకు భరోసా ఇస్తున్నట్టు సమాచారం.