
పశ్చిమ గోదావరి జిల్లా: వచ్చే 2021 సంవత్సరానికల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అధికారులు చెప్పారని జలవనరుల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు విలేకరులతో మాట్లాడారు. పనులు దశలవారీగా పూర్తయ్యే తీరును అధికారులు వివరించారని, నాలుగు నెలల కాలంలో చేయాల్సిన పనులను పరిశీలించామని పేర్కొన్నారు. కాపర్ డ్యామ్ పనులు సరిగ్గా జరగలేదని, వరదల సమయంలో 113 గ్రామాలకు చెందిన నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని చెప్పారు.
నిర్వాసితుల సమస్యలపై సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. పోలవరాన్ని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు. 28 వేల కుటుంబాలను ఈ ఏడాది తరలించాల్సి ఉందన్నారు. ఆర్భాటం, హడావిడి లేకుండా సీఎం జగన్ తొలిసారి పోలవరంలో పర్యటించారని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో సమానంగా నిర్వాసితులకు న్యాయం జరగాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేయాలనే ప్రభుత్వం తమదని, తాము పాజిటివ్ ఆలోచనలతో ఉన్నామన్నారు. పోలవరంలో ఇప్పటి వరకు జరిగిన పనులపై నిపుణుల కమిటీ పరిశీలించిందని తెలిపారు. వరద ప్రవాహం నుంచి కాపర్ డ్యామ్‌ను రక్షించే విధంగా చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు.