కందుకూరు: ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేసిన జోడు దొంగలను పోలీసులు కటకటాల వెనక్కు పంపించారు. అందులో ఓ దొంగ రైళ్లలో ఒంటిరిగా ప్రయాణించే మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డాడు. ఏకంగా ఓ మహిళా ఐపీఎస్‌పై దాడి చేసి ఆమె వద్ద బంగారు నగలు తస్కరించాడు. స్థానిక సీఐ కార్యాలయంలో డీఎస్పీ ప్రకాశరావు మంగళవారం విలేకర్లకు వివరాలు వెల్లడించారు. చీరాల దండుబాట రోడ్డు ప్రాంతానికి చెందిన షేక్ ఇదయతుల్లా కుమారుడు షేక్ ఖాజావలి పండ్లు అమ్ముకోవడంతో పాటు, పెయింటర్‌గా పనిచేస్తుంటాడు. నెల్లూరు జిల్లా నాయకుడుపేటకు చెందిన యువతితో వివాహమైంది. దీంతో నెల్లూరులో నివాసం ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఈ క్రమంలో నేరాలకు అలవాటుపడ్డ ఖాజావలి, రైళ్లలో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. దీనిలో భాగంగా 2015 సెప్టెంబర్ 9వ తేదీన సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న రాష్ట్ర పోలీస్ అకాడమీ ఎస్పీ స్థాయి అధికారి ఎస్‌ఎం రత్నపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమెను తీవ్రంగా కొట్టడంతో పాటు చంపేందుకు ప్రయత్నించాడు. చివరకు ఆమె పోలీస్ అధికారి అని చెప్పడంతో వదిలేసి వెళ్లిపోయాడు. అయితే ఆమె వద్ద ఉన్న బంగారు చైను, గాజులజత, రెండు ఉంగరాలు, పర్సులోని రూ. 2300 నగదు లాక్కుకుని వెళ్లాడు. ఆ తరువాత 2016 నవంబర్‌లో సింహపురం ఎక్స్‌ప్రెస్‌లో నిద్రిస్తున్న మహిళ వద్ద నుంచి ట్రాలీబ్యాగ్‌ను దొంగిలించాడు. అందులోని గుడ్లహారం, హ్యాంగింగ్ కమ్మల జత, బాంబేసెట్ హ్యాంగింగ్ కమ్మల జత, కెంపులు, పచ్చలు పొదిగిన డాలరు, పెద్దగాజు, బంగారు కడియం, వెండి గిన్నెలు, పట్టుచీరలు దోచుకున్నాడు.
కందుకూరు వాసితో కలిసి..
ఖాజావలి నేరాలు చేసే క్రమంలో కందుకూరు పట్టణంలోని పోతురాజుమిట్టకు చెందిన సుల్తాన్‌వలితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి తరచూ మద్యం సేవిస్తుండేవారు. ఈ క్రమంలో ఈ ఏడాది మే నెలలో జరిగిన తెట్టు గంధం సందర్భంగా ఉలవపాడులోని రిజర్వుకాలనీలో ఓ ఇంటిలో ఇద్దరూ కలిసి దొంగతనం చేశారు. సవర బుట్టలు, జతజాలరుకమ్మలు, రూ. 15వేల నగదు దోచుకున్నారు. అప్పటి నుంచి కందుకూరు పరిసర ప్రాంతాల్లో వరుస చోరీలు జరుగుతున్నాయి. దీనిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
లింగసముద్రం ఎస్సై కమలాకర్‌ను దొంగతనాల కేసులకు సంబంధించి ప్రత్యేకాధికారిగా నియమించి దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా ఖాజావలి, సుల్తాన్‌వలి ఇద్దరూ మంగళవారం పోలీసులకు పట్టుబడ్డారు. తమదైన శైలిలో విచారించడంతో రైళ్లలో దొంగతనాలు, ఐపీఎస్ అధికారిపై దాడి కేసు, కందుకూరులోని దొంగతనాలు వంటి విషయాలు బయటకు వచ్చాయి. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా కృషి చేసిన ఎస్సై కమలాకర్, సీఐ నరసింహారావును డీఎస్పీ అభినందించారు. ఎస్పీ ద్వారా రివార్డులు అందజేస్తామన్నారు. పొన్నలూరు ఎస్సై సురేష్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment