సాక్షి, ఒంగోలు:శాంతిభద్రతలను, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి దాసోహమంటున్నారు. వరుసగా మూడు నెలలు జరిగిన ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు యంత్రాంగం..రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకొచ్చాక పూర్తిగా ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది.
జిల్లా పరిషత్ ఎన్నికల వ్యవహారంలో ఆది నుంచి పోలీసుల వ్యవహార శైలి అధికార టీడీపీకి అనుకూలంగా..ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రతికూలంగా ఉంది. టీడీపీ అధికార పగ్గాలు చేపట్టాక జిల్లాలో పలుచోట్ల వైఎస్సార్ సీపీ కేడర్‌పై వరుస దాడులు జరగడం..కొందరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇటీవల గిద్దలూరు పోలీస్‌స్టేషన్‌లో పోలీసు ఉన్నతాధికారుల ఎదుట టీడీపీ నేతలు ప్రత్యర్థులపై దాడులకు తెగబడటం..స్టేషన్ ఆవరణలోనే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన మార్కాపురం జెడ్పీటీసీ రంగారెడ్డిని సినీఫక్కీలో తెల్లవారుజామున అరెస్టు చేయడంలో పోలీసుల ఆంతర్యమేంటనేది చర్చనీయాంశమైంది.
కొద్దిగంటల్లో ఓటేయాల్సిన నేతను..
వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన మార్కాపురం జెడ్పీటీసీ జవ్వాజి రంగారెడ్డిని ఎస్సీఎస్టీ కేసులో ఆదివారం తెల్లవారుజామున సంతమాగులూరు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అరెస్టుచేశారు. ఫిర్యాదుపై కేసునమోదు చేశాక..చట్టప్రకారం అరెస్టు సరైన చర్యే అయినప్పటికీ, కొద్దిగంటల్లో జిల్లాపరిషత్ చైర్మన్ ఎన్నికలో ఓటేయాల్సిన సభ్యుడ్ని అదుపులోకి తీసుకోవడమే వివాదాస్పదమైంది. రాజకీయకక్షల నేపథ్యంలో ఒకపార్టీ నేతపై ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు సమగ్ర విచారణ చేయకుండానే.. అందులోనూ అట్రాసిటీ కేసుకు సంబంధించి ముందస్తు సమాచారం లేకుండా ఏకంగా అరెస్టుచేయడమేంటనే భావం సర్వత్రా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో తన సహచర జెడ్పీటీసీలతో కలిసి రంగారెడ్డి ఒంగోలు వచ్చేమార్గంలో సంతమాగులూరు టోల్‌ప్లాజా వద్ద ఒక అతిథిగృహానికి చేరారు. అక్కడికి పాఠశాల వాహనంలో 80 మందికిపైగా పోలీసులు, ఇద్దరు సీఐలు, ఒక డీఎస్పీ చేరుకుని బలవంతంగా రంగారెడ్డిని అరెస్టుచేసి తీసుకెళ్లడం అప్రజాస్వామ్యమంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, రంగారెడ్డి ఆదివారం జెడ్పీఎన్నికకు హాజరైతే.. ఓటింగ్ చేసి బయటకు వచ్చిన వెంటనే అరెస్టుకు ఆస్కారం ఉండేది.
అయితే, జెడ్పీచైర్మన్ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ బలం తగ్గించేందుకు అధికారపార్టీ ఆదేశాల మేరకే పోలీసులు పక్కాగా పనిచేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రంగారెడ్డిని మార్కాపురం తరలించి కోర్టురిమాండ్‌కు పంపిన అనంతరం స్థానిక డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ తాము గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు వెళ్లగా.. అక్కడ జెడ్పీటీసీ కనిపిస్తే అరెస్టు చేశామనడం విడ్డూరమని వైఎస్సార్‌సీపీ నేతలంటున్నారు.
కరణం తండ్రీ కొడుకులు, దివి శివరాంపై చర్యలేవీ..
నిష్పక్షపాతంగా పనిచేస్తున్నామని పైకి చెబుతూనే టీడీపీ నేతల మాటలకు తలొగ్గుతున్న కొందరిపై ..పోలీసుశాఖలోనూ అసంతృప్తి రేగుతోంది. ఈనెల ఐదోతేదీన జెడ్పీచైర్మన్ ఎన్నికప్పుడు సమావేశ మందిరం వద్ద చోటుచేసుకున్న ఘర్షణలో టీడీపీ నేతలు కరణం బలరాం, ఆయన తనయుడు వెంకటేష్, మరోనేత దివి శివరాం చేసిన దౌర్జన్యం అంతాఇంతా కాదు. ఏకంగా ఎస్పీగన్‌మెన్, డ్రైవర్‌లపైనే చేయిచేసుకుని గాయపరచడం, అడ్డుకున్న పోలీసు సిబ్బందిపై ఎదురుతిరగడం తెలిసిందే.
ఈఘటనకు సంబంధించి ఆ ముగ్గురితో పాటు 50 మందిపై రెండు కేసులు నమోదైనా.. ఇంతవరకు ఆ కేసుల్లోని వారిని అరెస్టు చేయలేదు. సెక్షన్ 144 నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు వందలాది మంది సమావేశ మందిరంలోకి చొచ్చుకొచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి. పర్చూరు, కొండపి, కందుకూరు, కనిగిరి, అద్దంకి ఎన్నికల్లోనూ టీడీపీ అరాచకపర్వానికి అనుకూలంగా పోలీసులు పనిచేశారని.. తాజాగా మార్కాపురం జెడ్పీటీసీని సినీఫక్కీలో అరెస్టుచేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జెడ్పీవైస్‌చైర్మన్‌గా ఎన్నికైన నూకసాని బాలాజీ బహిరంగంగా విమర్శించారు. ఏది ఏమైన ప్పటికీ, ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా పనిచేసి ఎన్నికల సంఘం ప్రశంసలందుకున్న పోలీసు యంత్రాంగం ప్రస్తుతం అధికార పార్టీ మార్కుతో వ్యవహరించడం బాధాకరమని మాజీ పోలీసు అధికారులతో పాటు ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు.
ఖాకీ.. చాకిరి
Published Mon, Jul 14 2014 2:48 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement