జనశక్తి నక్సల్స్‌పై పోలీసుల కాల్పులు
⇒ కాంట్రాక్టర్ నుంచి రూ.5లక్షలు డిమాండ్
⇒ రూ.50వేలకు కుదిరిన ఒప్పందం
⇒ మొదటి విడతగా రూ.10వేలు అందజేత
⇒ తిరిగి వెళ్తుండగా పోలీసుల కాల్పులు
⇒ ఒకరికి గాయాలు..
⇒ ఆయుధంతో పాటు అదుపులోకి..
⇒ మరొకరు పరారీ
⇒ జిల్లాలో కదలికలపై ఆందోళన
ఒకరికి గాయాలు.. ఆయుధం స్వాధీనం?
కోవెలకుంట్ల: అవుకు మండల పరిధిలోని రామాపురం గ్రామ పాఠశాల వద్ద జనశక్తి నక్సల్స్‌పై పోలీసులు ఆదివారం కాల్పులు జరిపారు. ఘటనలో ఒక నక్సలైట్‌కు బుల్లెట్ గాయం కాగా అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ప్రైవేట్ వాహనంలో కర్నూలుకు తరలించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాల్లోకి వెళితే.. బనగానపల్లెకు చెందిన కాంట్రాక్టర్ వెంకటేశ్వరరెడ్డి నుంచి జనశక్తి నక్సల్స్ పార్టీ కార్యకలాపాల నిమిత్తం రూ.5లక్షలు డిమాండ్ చేశారు. అందుకాయన తాను అంత ఇచ్చుకోలేనని.. రూ.50వేలు మాత్రమే ఇస్తానని అంగీకరించాడు.
మొదటి విడతగా ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రూ.10వేలు కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గ్రామ పాఠశాల సమీపంలో ముట్టజెప్పాడు. మిగిలిన మొత్తం సోమవారం అందజేయాలని చెప్పిన నక్సల్స్ ఉసేని, మారుతిలు మోటార్ బైక్‌పై అవుకు మండలం రామాపురం మీదుగా బయలుదేరారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం తెలుసుకున్న కోవెలకుంట్ల పోలీసులు వారిని వెంబడించారు. ఈ నేపథ్యంలో నక్సల్స్ బైక్‌ను పొలాల్లో వదిలేసి జొన్న సేనులో నుంచి పారిపోతుండగా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పోలీసులు కాల్పులు జరిపారు. మారుతికి బుల్లెట్ గాయం కాగా.. ఉసేని పరారయ్యాడు.
ఆ వెంటనే 50 మంది పోలీసులు రౌండప్ చేసి మారుతుని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఆయుధం స్వాధీనం చేసుకుని చికిత్స నిమిత్తం ప్రైవేట్ వాహనంలో కర్నూలుకు తరలించారు. ఇదే సమయంలో జనశక్తి నక్సల్స్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న బెలూంకు చెందిన శివశంకర్ అలియాస్ శివ, వెంకటరమణ అలియాస్ మెష, పేరుసోములకు చెందిన పక్కీర అలియాస్ ప్రతాప్‌తో పాటు మరొకరిపై పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అయితే కాల్పుల ఘటనను, మారుతిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. ఈ ఆపరేషన్‌లో కోవెలకుంట్ల సీఐ నాగరాజుయాదవ్, సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బెలూం గ్రామంలో నాపరాతి గనుల పంచాయితీ వ్యవహరం తేల్చేందుకు వారం రోజుల క్రితమే ఇద్దరు నక్సల్స్ గ్రామానికి చేరుకున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలుస్తోంది.