
పోలీస్ విధులకు డిజిటల్ సపోర్టు
పోలీసు కమిషనరేట్ డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తోంది.
సాంకేతిక సొబగులతో సిబ్బంది సామర్థ్యం పెంపు
కార్యాచరణకు కమిషనరేట్ కసరత్తు
{పతిపాదనల రూపకల్పనలో అధికారులు
పోలీసు కమిషనరేట్ డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తోంది. పోలీసుల విధులు, సేవలకు సాంకేతిక సొబగులు అద్ది అధికారులు, సిబ్బంది సామర్థ్యం పెంచేందుకు డిజిటలైజేషన్ దోహదపడుతుందని ఆ శాఖ పెద్దలు భావిస్తున్నారు. ప్రపంచస్థాయి రాజధాని వైపు
శరవేగంగా వెళుతున్న క్రమంలో.. పోలీసు విధులు కూడా ఆ స్థాయిలోనే ఉండాలనేది ఆ శాఖ ఉన్నతాధికారుల అభిప్రాయం.
విజయవాడ సిటీ : విజయవాడ రాజధాని ప్రాంతం కావడంతో ముఖ్యుల రాకపోకలు పెరిగాయి. వలసలు, వాహనాల రద్దీ పెరిగింది. ఇదే స్థాయిలో నేరాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. వీటన్నిటిని అధిగమించాలంటే కాలం చెల్లిన పోలీసు విధులకు బదులు సాంకేతికంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఈ దిశగా కమిషనరేట్ విభాగాలను డిజిటలైజ్ చేసేందుకు పోలీసు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొద్ది రోజుల్లో దీనిపై సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపనున్నారు. నగరంలో పరిస్థితి మెరుగు పరిచేందుకు సీఎం కూడా సుముఖంగా ఉండటంతో కమిషనరేట్ ప్రతిపాదనలకు ఆమోదం పెద్ద కష్టం కాదని చెపుతున్నారు.
పోలీసు వాహనాల్లో జీపీఆర్‌ఎస్
నగర పోలీసు కమిషనరేట్‌లోని వాహనాల్లో జీపీఆర్ విధానం అమలు చేయనున్నారు. నేరం జరిగిన చోటుకు ఎఫ్‌ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ (ఇంటి ముంగిటకే ఎఫ్‌ఐఆర్) వాహనాలు వెళుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, ఆస్తిపరమైన నేరాల్లో వీటి ప్రయోజనం ఉన్నప్పటికీ మిగిలిన కేసుల్లో పెద్దగా ప్రయోజనం లేదు. నేరం జరిగినప్పుడు కంట్రోల్ రూమ్‌కి వచ్చిన కాల్స్ ఆధారంగా సమీపంలోని సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. వారు సంబంధిత వ్యక్తుల ఫోన్ నంబర్ల ఆధారంగా చిరునామా తెలుసుకొని వెళ్లాల్సి వస్తుంది. ఇదే రక్షక్, బ్లూ కోల్ట్స్ వాహనాలకు జీపీఆర్‌ఎస్ అనుసంధానం చేస్తే చిరునామా తెలుసుకొని వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. వీటికి కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తే అక్కడ జరిగే ఘటనను చిత్రీకరించి వెంటనే పోలీసు స్టేషన్లకు చేరవేయవచ్చు. తద్వారా ఆయా నేరాలపై తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులు సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తారు.
సిగ్నల్స్ ఆధునికీకరణ
ఐఐటీఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్)లో నగరంలోని 64 సిగ్నల్స్‌ను ఆధునిక కెమెరాలతో అనుసంధానం చేస్తారు. సెన్సర్ విధానంలో ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా అవసరమైన సంకేతాలు ఇచ్చి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఇది దోహదపడుతుంది. కంట్రోల్ రూమ్‌కు దీనిని అనుసంధానం చేస్తే అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల సిబ్బంది ఇతర విధులు నిర్వహించేందుకు వెసులుబాటు ఉండటమే కాక ట్రాఫిక్ రద్దీని నిలువరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ.. డిజిటలైజేషన్‌లో భాగంగా మరింత ఆధునికీకరించడానికి ఇది ఎంతగానో సహకరిస్తుందని పోలీసు అధికారులు చెపుతున్నారు.
సీసీ కెమెరాలు తప్పనిసరి
భారీ రద్దీ ఉన్న షాపులు, సంస్థల్లో సీసీ కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేయనున్నారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం రద్దీ షాపుల్లో వీటి ఏర్పాటు అనివార్యం. ఆయా షాపులు, సంస్థల బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు లోపల కూడా వినియోగదారుల రక్షణను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేయాలి. ఏదైనా జరగరానిది జరిగితే వీటి ద్వారా వాస్తవాలు పోలీసులు గుర్తించేందుకు వీలుంటుంది. నేరాల కట్టడికి సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఆలోచన చేస్తున్నాం
కమిషనరేట్‌లోని పోలీసు విధులు, సేవలను డిజిటలైజేషన్ చేసే ఆలోచన ఉంది. దీనిపై కసరత్తు చేస్తున్నాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తాం.
- డి.గౌతమ్ సవాంగ్, పోలీసు కమిషనర్